Wednesday, November 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకఠిన నిర్ణయాల దిశగా పీసీబీ

కఠిన నిర్ణయాల దిశగా పీసీబీ

- Advertisement -

– 305 పరిశ్రమలు మూసివేత
– మరి కొన్ని పరిశ్రమలకు నోటీసులు
– పర్యావరణ చట్టాలు, అమలుకు దిశగా అడుగులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) పర్యావరణ చట్టాలు, నియమాలను అమలుకు కట్టుదిట్టం చేసింది. చట్టబద్ధమైన అధికారాలకు మరింత పదును పెట్టాలని నిర్ణయించింది. కాలుష్య తీవ్రత ఆధారంగా సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు(సీపీసీబీ) పరిశ్రమలను నాలుగు రకాలుగా విభజించిన విషయం తెలిసిందే. వాటిలో ఎరుపు, నారింజ, ఆకుపచ్చ, తెలుపు క్యాటగిరీలుగా నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ నాలుగు క్యాటగిరీలకు సంబంధించిన పరిశ్రమలు 12,264 ఉన్నాయి. కొత్త పరిశ్రమలకు అనుమతులివ్వడంతోపాటు ఇప్పటికే ఉన్న పరిశ్రమలు చట్టాలు, నిబంధనలను పాటిస్తున్నాయా? అంశాలను గుర్తించడానికి నిరంతరం పర్యవేక్షణలు, నోటీసులు జారీచేయడం పెనాల్టీలు జారీచేయడంతో కాలుష్యాన్ని నియంత్రించడానికి టీజీపీసీబీ ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది.

జనవరి 2024 నుంచి 2025 అక్టోబర్‌ వరకు కొత్త కంపెనీలకు పీసీబీ అనుమనిచ్చింది. పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్య కారకాలు, పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా అని నిర్ధారించడంతోపాటు నీరు, వాయు కాలుష్యాన్ని నివారించడానికి పీసీబీ అనుమతి జారీ చేస్తుంది. 2,620 కంపెనీల స్థాపనలకు అంగీకరించనుంది. అంతేకాదు సదరు కంపెనీ భవిష్యత్‌లో సంభవించే కాలుష్యకారకాల అంచనా, వాటి ప్రభావం ఆధారంగా కార్యకలాపాలను ప్రారంభించడానికి అనుమతులు జారీచేస్తుంది. 3,521 కంపెనీలకు కాన్సెప్ట్‌ ఫర్‌ ఆఫరేషన్స్‌(సీఎఫ్‌ఓ) జారీచేసింది. రాష్ట్రంలో మొత్తం నీటి కాలుష్య కారకాల పరిశ్రమలు 2,193, వాయు కాలుష్య కారక పరిశ్రమలు 3,164 ఉన్నాయని పీసీబీ గుర్తించింది. ఈ పరిశ్రమల పనితీరును పీసీబీ అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు. వాటి నుంచి మొత్తం 7,966 మురుగునీటి/ప్రమాదకర వ్యర్థాల నమూనాలు, 3,807 గాలి కాలుష్య కారకాల నమూనాలను సేకరించారు. నమూనాలను ల్యాబోరేటరీ పంపించడంతోపాటు రిపోర్టు వచ్చిన తర్వాత సంబంధిత కంపెనీలపై చర్యలు తీసుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

305 కంపెనీలలో ఆపరేషన్లు నిలిపివేత
రాష్ట్రంలో 305 కంపెనీలకు మూసివేయాలనీ, ఉత్పత్తిని నిలిపివేయాలని పీసీబీ ఉత్తర్వులు జారీచేసింది. కాలుష్య నియంత్రణలో భాగంగా 2,069 పరిశ్రమలకు సంబంధించిన కాలుష్య కారకాలను అధికారులు సమీక్షించారు. వీటిలో 1,234 పరిశ్రమలకు నోటీసులు జారీ చేశారు. పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలు, కాలుష్య కారకాలను గుర్తించడానికి 24/7 ఆన్‌ లైన్‌ మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేసింది. 501 అత్యంత కాలుష్య కారక పరిశ్రమల నుండి ఉద్గారాలు, కాలుష్య కారకాలను ఆన్‌లైన్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ల ద్వారా ట్రాక్‌ చేస్తున్నారు. ఉద్గారాలు, కాలుష్య కారకాల నిబంధనలను అధిగమించినందుకు టాస్క్‌ఫోర్స్‌ కమిటీ మొత్తం 108 పరిశ్రమలను సమీక్షించి నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముందని, వెంటనే నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ (ఈఓడీపీ) కింద కంప్యూటరైజ్డ్‌ తనిఖీల కేటాయింపు కోసం సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) ఒక ‘టూల్‌’ను అభివృద్ధి చేసింది. ఈ తనిఖీల అమలు డిసెంబర్‌ 2015 నుంచి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా యాదచ్ఛిక ప్రాతిపదికన అధికారులకు తనిఖీ కోసం రెడ్‌ పరిశ్రమల కేటాయించారు. టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ 1,664 పరిశ్రమలను తనిఖీ చేసింది. 324 పరిశ్రమలను సమీక్షించడంతోపాటు తగు చర్యలు తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.

వేగవంతమైన ఫిర్యాదుల పరిష్కారం కోసం టీజీపీసీబీ టోల్‌-ఫ్రీ నంబర్‌ 10741, ఆన్‌లైన్‌ ఫిర్యాదు యాప్‌ ‘జనవాణి-కాలుష్య నివారిణి’ని ఏర్పాటు చేసింది. పారిశ్రామిక ప్రాంతాల్లో రాత్రి పెట్రోలింగ్‌ కూడా నిర్వహిస్తున్నారు. బల్క్‌ డ్రగ్‌, రసాయన పరిశ్రమల నుంచి వచ్చే ప్రధాన నీటి కాలుష్యాన్ని జీరో లిక్విడ్‌ డిశ్చార్జ్‌ వ్యవస్థలను కఠినంగా అమలు చేయడం ద్వారా సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు పరిశ్రమలలో శుద్ధి చేయబడిన మురుగునీటి పునర్వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్టు చెబుతున్నారు. దీంతోపాటు సురక్షిత వ్యర్థాల నిర్వహణకు 5 కామన్‌ ఎఫ్లూయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, 26 ఈ-వేస్ట్‌ రీసైక్లింగ్‌ ప్లాంట్లు, 4 కన్స్ట్రక్షన్‌, డెమోలిషన్‌ (సీఅండ్‌ డీ) వేస్ట్‌ ఫెసిలిటీలు, 12 బయో-మెడికల్‌ వేస్ట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -