విద్వేష ప్రపంచంలో శాంతికై పిలుపిచ్చిన మైసూరు దసరా ఉత్సవాలు
మైసూరులో దసరు ఉత్సవాలను ప్రారంభించించిన బాను ముష్తాక్
మైసూరు : మైసూరు దసరా ఉత్సవాలు శాంతి సామరస్యతలకు పిలుపునిచ్చాయని అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ విజేత, రచయిత్రి బాను ముష్తాక్ పేర్కొన్నారు. మైసూరు చాముండేశ్వరి ఆలయంలో సోమవారం దసరా ఉత్సవాలను బాను ముష్తాక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ”సంస్కృతి మన హృదయాలకు వారధి వంటిది. ప్రేమను వ్యాప్తి చేస్తుంది, ద్వేషాన్ని కాదు. అందరినీ గౌరవించాలని ఈ భూమే నాకు నేర్పింది. ఒక పక్క ప్రపంచమంతా యుద్ధపంథాలో సాగుతుంటే, మరోపక్క మానవాళి విద్వేషాలతో, రక్తపాతాలతో రెచ్చగొట్టబడుతుంటే మైసూరు దసరా ఉత్సవాలు శాంతికి, సామరస్యతలకు స్పష్టంగా పిలుపునిచ్చాయి.” అని పేర్కొన్నారు. కర్ణాటక ఉమ్మడి సంస్కృతికి ఈ ఉత్సవాలు ఒక చిహ్నం వంటివని ఆమె వ్యాఖ్యానించారు. ‘స్త్రీత్వం అంటేనే మాతృ వ్యాత్సల్యం. అలాగే అన్యాయాన్ని ఎదిరించి పోరాడే శక్తి కూడా” అని ఆమె వ్యాఖ్యానించారు. మహిళలో శక్తికి ప్రతీక చాముండేశ్వరి అని ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాది మైసూరు దసరా ఉత్సవాలను బాను ముష్తాక్‌తో ప్రారంభించాలన్న కర్నాటక ప్రభుత్వ నిర్ణయంపై వివాదం చెలరేగింది. ప్రభుత్వ చర్యను ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. దాన్ని అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయడంతో బానుముష్తాక్ ఈ ఉత్సవాలను ప్రారంభించడానికి మార్గం సుగమమైంది.
ఉత్సవాలను ప్రారంభించడానికి వచ్చిన ఆమె తొలుత చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. ప్రార్ధనలు చేశారు. ఆమెతో పాటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా వున్నారు. మతపరమైన, సాంప్రదాయసిద్ధమైన ఆచారాలు, సాంప్రదాయాల మధ్య మైసూరులో ప్రఖ్యాతి చెందిన 11 రోజుల దసరా ఉత్సవాలు ఘనంగా కన్నుల పండువుగా ప్రారంభమయ్యాయి. ”చరిత్ర నల్వాడి కృష్ణరాజ ఒడయార్‌ను చాలా అభిమానంగా గుర్తుంచుకుంటుంది. ఎందుకంటే ఆయన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని విశ్వసించారు. అవి సుదీర్ఘకాలం కొనసాగాలంటే సంపద, అధికారాన్ని పంచుకోవాలన్నది ఆయన సందేశం.” అని ముష్తాక్ పేర్కొన్నారు. జయచామరాజేంద్ర ఒడయార్ ముస్లింల పట్ల కూడా విశ్వాసం కనబరిచారని, రాజ్యాన్ని సంరక్షించే బాధ్యతలను వారికి కూడా అప్పగించారన్నారు. ”రాజ్యాంగ విలువలను, అలాగే ప్రతి ఒక్కరి విశ్వాసాలను, విలువలను మనందరం గౌరవించుకోవాలి. ఐక్యత, సమగ్రతలను ఈ భూమి పరిమిళాలుగా మనం వుండనిద్దాం. మనలో వున్న విద్వేషం, అసహనం వంటి వాటిపై గెలుపొందేందుకు చాముండేశ్వరి ప్రేమ, ధైర్యం, ఆమె దీవెనలు మనల్ని ముందుకు నడిపించాలని కోరారు. ఈ రాష్ట్రం, దేశం హద్దులు దాటి ఈ దసరా ఉత్సవాలు జరగాలని, ప్రపంచవ్యాప్తంగా శాంతి, సామరస్యతలను రగులుస్తూ, న్యాయాన్ని అందించాలని ఆమె ఆకాంక్షించారు.
మానవులుగా పరస్పర గౌరవం వుండాలి
బాను ముష్తాక్ ముస్లిం కుటుంబంలో పుట్టవచ్చు, కానీ ఆమె ఒక మనిషి, మనుష్యులుగా మనం ఒకరినొకరం గౌరవించుకోవాలి. అంతేగానీ, కులాలు, మతాలను ఆధారంగా చేసుకుని వివక్ష చూపరాదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. మానవాళిగా మనందరం ఒక్కటే అని భావిస్తే, మనందరం కూడా బాను ముష్తాక్ దసరా ఉత్సవాలను ప్రారంభించడాన్ని ఆమోదించాల్సిం దేనని అన్నారు. కర్ణాటక మెజారిటీ ప్రజలు ఇప్పటికే హృదయపూర్వకంగా దీన్ని స్వాగతించారని చెప్పారు.
ఇది ప్రజల పండుగ
‘నాద హబ్బా’ (ప్రభుత్వ ఉత్సవాలు)గా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు కర్ణాటక సుసంపన్నమైన సంస్కృతులు, సాంద్రాయాలను ప్రతిబింబించేలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. గత కాలపు రాజరికపు వైభవం కూడా కలగలిసి వుంటుంది. ఈ ఉత్సవాలు ప్రతి ఒక్కరికీ చెందినవని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సమానత్వంతో కూడిన న్యాయమైన సమాజాన్ని నిర్మించేందుకు, కుల వివక్ష లేని స్వేచ్ఛా సమాజాన్ని రూపొందించేందుకు బుద్ధుడు, బసవన్న, అంబేద్కర్, కువెంపు ప్రభృతులు చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. అందువల్లే దసరా ప్రజల పండుగ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో రాజకీయాలు చేయండి కానీ ఇలాంటి ఉత్సవాల్లో కాదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.