Monday, January 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవిశ్వశాంతే ఉత్తమ ఔషధం

విశ్వశాంతే ఉత్తమ ఔషధం

- Advertisement -

– డబ్ల్యుహెచ్‌ఒ చీఫ్‌ టెడ్రోస్‌ హితవు
– సైన్యానికి కేటాయింపులు పెరగడంపై తీవ్ర ఆందోళన
– ఆరోగ్య కార్యక్రమాలకు కేటాయింపులు పెంచాలని డిమాండ్‌
జెనివా :
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైనిక వ్యయం గురించి ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. 2024లో ప్రపంచ సైనిక వ్యయం రికార్డు స్థాయిలో 2.7 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుందని ఆయన తెలిపారు. 2025లోనే ఇంతకు మించే ఖర్చు చేసివుంటారని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ప్రపంచ ఆరోగ్య కార్యక్రమాలపై చేసే ఖర్చు గణనీయంగా తగ్గిపోయిందని వెల్లడించారు. ప్రాణాలను కాపాడటంపై దృష్టి పెట్టాలని, ఘర్షణలను పెంచవద్దని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విశ్వశాంతియే ఉత్తమ ఔషధమని పేర్కొన్నారు.

ఆరోగ్య కార్యక్రమాలపై అరకొర ఖర్చు
ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది ఘర్షణలను పెంచడం కాదని, ప్రజల ప్రాణాలను కాపాడటంపై ఎక్కువ దృష్టి సారించాలని టెడ్రోస్‌ హితవు పలికారు. 150 దేశాలలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఒక సంస్థకు రెండు సంవత్సరాలకు 4.2 బిలియన్‌ డాలర్లు లేదా ఏడాదికి 2.1 బిలియన్‌ డాలర్లు అనేది పెద్ద లక్ష్యం కాదని, ఇది చాలా తక్కువ అని పేర్కొన్నారు. 2.1 బిలియన్‌ డాలర్లు అనేది 8 గంటల కాలంలో ప్రపంచదేశాల ఖర్చు చేసే సైనిక వ్యయంతో సమానం అని తెలిపారు. 2.1 బిలియన్‌ యూఎస్‌ డాలర్లు అంటే ఒక స్టీల్‌ బాంబర్‌ విమానం ధర, పొగాకు పరిశ్రమ ఏటా చేసే ప్రకటనలు, ప్రచారం కోసం చేసే ఖర్చులో నాలుగో వంతుకు సమానం అని తెలిపారు. మన ప్రపంచంలో నిజంగా విలువైన వాటిపై ఎవరో ధరల ట్యాగ్‌లను మార్చినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దేశాలు ఇతర దేశాల దాడుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారయని, కానీ అంతకంటే ఎక్కువ విధ్వంసం, నష్టాన్ని కలిగించే అదశ్య శత్రువు (అనారోగ్యం) నుంచి తమను తాము రక్షించుకోవడానికి చాలా తక్కువ ఖర్చు చేస్తున్నాయని టెడ్రోస్‌ అధనోమ్‌ విమర్శించారు.

ట్రంప్‌ నిర్ణయం వేళ టెడ్రోస్‌ అధనోమ్‌ కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ‘డ్రీమ్‌ మిలిటరీ’ నిర్మాణం కోసం 2027 ఆర్థిక సంవత్సరానికి గానూ సైనిక బడ్జెట్‌ను 1.5 ట్రిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.135 లక్షల కోట్లు ) పెంచుతున్నట్లు వెల్లడించిన నేపథ్యంలో టెడ్రోస్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం అమెరికా రక్షణ బడ్జెట్‌ 1 ట్రిలియన్‌ డాలర్లుగా ఉండగా, దీనిని ఏకంగా 50 శాతం పెంచుతున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. మరోవైపు 66 అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా వైదొలుగుతూ సంబంధిత మెమొరాండంపై ట్రంప్‌ ఇటీవలే సంతకం చేశారు. ఇందులో డబ్ల్యుహెచ్‌ఒ సహా ఐక్యరాజ్యసమితికి (యూఎన్‌) చెందిన 31 సంస్థలు కూడా ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -