వ్యకాస రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ
నవతెలంగాణ – మిర్యాలగూడ
రైతులకు మదర్ డైరీ నుండి రావలసిన పెండింగ్ పాల బిల్లులు వెంటనే చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్యపాలకవర్గాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం మిర్యాలగూడ నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం ఆ సంఘం జిల్లా నాయకులు పిల్లుట్ల సైదులు అధ్యక్షతన స్థానిక కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలోని వేలాది మంది రైతులకు మదర్ డైరీ నుండి సుమారు రూ.40 కోట్ల పాల బిల్లులు మూడు నెలల నుండి రాకుండా పెండింగ్లో ఉన్నాయని వెంటనే చెల్లించాలని పాలకవర్గాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని బిల్లులు ఇప్పించాలని కోరారు.
మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా తెలంగాణ రాష్ట్రానికి రావలసిన యూరియా సకాలంలో రాకపోవడం మూలంగా కొరత ఏర్పడి రైతులు ఎరువుల షాపు దగ్గర యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది అయినా రైతుకు రెండు బస్తాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న దుస్థితి ఏర్పడింది రైతులు యూరియా కోసం పడుతున్న తిప్పల అంతా ఇంతా కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా వ్యవసాయ అధికారులు రైతులకు సరిపడు యూరియా అందిస్తున్నామని తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారు జిల్లాలో అనేక ప్రాంతాల్లో నిత్యం యూరియా కోసం రైతులు ఆందోళన చేస్తున్న స్థితి జిల్లా అధికారుల కనబడుట లేదా అని ప్రశ్నించారు. వరి పంట పొలాలకు అవసరమైన యూరియా కోసం రైతులు కుటుంబాలతో వచ్చి గోదాముల దగ్గర సొసైటీల దగ్గర పొద్దంతా పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి రావలసిన యూరియాను తీసుకురావలసిన బాధ్యత ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాల వలన రాష్ట్రంలోని రైతులంతా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లుకేటాయిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయటం హర్షించదగ్గ విషయమని తెలంగాణ రాష్ట్రం నుండి ఎన్నికైన బిజెపి ఎంపీలు ఇద్దరు మంత్రులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వెంటనే బిల్లును అమలు చేసే విధంగా కృషి చేయాలని కోరారు.
ఈనెల 11న నల్లగొండలో జరుగు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్క్ షాపుకు ప్రతినిధులంతా పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జటావతి రవి నాయక్, పిల్లుట్ల సైదులు, జిల్లా సహాయ కార్యదర్శి పెంటమల్ల సుకన్య, సంఘం జిల్లా కమిటీ సభ్యులు రెమిడాల బిక్షం, పులమ్మ, కన్నెకంటి సీతారాములు ప్రజా సంఘాల నాయకులు మల్లుగౌతమ్ రెడ్డి తిరుపతి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.



