– ఆదివారం ఒక్కరోజే 59 మంది మృతి
– మృతుల్లో చిన్నారులు, మహిళలు
– గాజాలో తీవ్రమైన జల సంక్షోభం
– పాలస్తీనాలో 58 వేలకు చేరిన మృతులు
డెయిర్ అల్ బలా: గాజాలోని సామాన్య పౌరులపై ఇజ్రాయిల్ దాడులు పాశవికంగా కొనసాగుతున్నాయి. తాగునీటి కోసం ఓ ప్రాంతంలో గుమిగూడిన జనంపై ఆదివారం జరిపిన దాడిలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో అభం శుభం ఎరుగని చిన్నారులు కూడా ఉండడం హృదయాలను కలచివేస్తోంది. గాజా స్ట్రిప్‌లో తాగునీటికి సైతం కటకట ఏర్పడుతోంది. గుక్కెడు నీటి కోసం పాలస్తీనియన్లు సహాయ కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారు. వారిని లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ అమానుషంగా దాడులు చేస్తోంది. దీంతో చివరికి కలుషిత నీటిని సైతం వాడుకునేందుకు ప్రజలు సిద్ధపడుతున్నారు. నీటి కోసం కేంద్రాల వద్దకు తరలి వస్తున్న ప్రజలను లక్ష్యంగా చేసుకొని భారీగా దాడులు జరుగుతున్నాయి. నీటి పంపిణీ కేంద్రాలను బాంబు దాడితో ధ్వంసం చేశారు. మొత్తంగా ఇజ్రాయిల్ దాడులలో ఆదివారం 59 మంది చనిపోయారు.గాజాలోని అనేక నీటి వనరులను ఇజ్రాయిల్ ధ్వంసం చేస్తోంది. దీంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. పారిశుధ్య పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. బావులు, బోర్‌వెల్స్ సహా అనేక నీటి వనరులను ఇజ్రాయిల్ ఓ పథకం ప్రకారం నాశనం చేస్తోంది. ‘నీటి ప్లాంటు వద్ద నాలుగు గంటలకు పైగా వేచి ఉన్నాం. ఎందుకంటే నీటి లభ్యత తక్కువగా ఉంది. గంటల తరబడి నిలబడ్డా చివరికి వట్టి చేతులతో వెళ్లాల్సి వస్తోంది’ అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరాశ్రయులైన పాలస్తీనా ప్రజలు తలదాచుకుంటున్న ప్రాంతాలను కూడా ఇజ్రాయిల్ దళాలు వదలడం లేదు. తాజా మరణాలతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 58 వేలు దాటిందని పాలస్తీనా ఆరోగ్యశాఖ తెలిపింది.ఎలాంటి జాప్యం లేకుండా పాలస్తీనా అధికారులు ఇంధన సరఫరాలకు అనుమతించాలని పాలస్తీనా రెడ్ క్రీసెంట్ సొసైటీ కోరింది. లేనిపక్షంలో ఆస్పత్రులకు అంబులెన్సులు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు ఉండవని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలావుండగా అమెరికా, ఇజ్రాయిల్ ఆధ్వర్యంలో నడుస్తున్న సహాయ శిబిరాలపై దాడులు చేసి ప్రజలను హతమారుస్తున్నందుకు డోనాల్డ్ ట్రంప్‌ను ప్రాసిక్యూట్ చేయాలని హక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి. గాజాలో నరమేథానికి మద్దతు ఇస్తున్నందుకు ట్రంప్‌ను బాధ్యుడిగా చేసి విచారించాలని జెనీవాలోని హక్కుల సంఘం అంతర్జాతీయ సంస్థలను కోరింది.
నీళ్ల కోసం వెళ్తే..ప్రాణాలు తీస్తున్నారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES