బీఆర్‌ఎస్, బీజేపీ కట్టు కథలు నమ్మలేదు
అత్యున్నత ప్రమాణాలతో పాలనను అందిస్తాం
ప్రెస్ మీట్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ ఎన్నికల్లో 83 మున్సిపాలిటీలు, ఐదు కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంకా కొంత సమాచారం రావాల్సి ఉందనీ, తమ స్థానాలు మరిన్ని పెరుగుతాయని అన్నారు. స్వతంత్రులు ఇతర పార్టీల వారు తమ పార్టీతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఉన్నారని పేర్కొన్నారు. మొత్తంగా 116 మున్సిపాలిటీలకు గాను 90 నుంచి 94 మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో జమవుతాయని స్పష్టం చేశారు. ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా, ఐదు కార్పొరేషన్లలో కాంగ్రెస్ తిరుగులేని మెజారిటీ సాధించిందని తెలిపారు. మరో రెండు చోట్ల హంగ్ ఏర్పడిందన్నారు. రెండు దశాబ్దాల కాలంలో కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్దఎత్తున మున్సిపల్ స్థానాలు రావడం సంతోషం కలిగించే విషయమన్నారు.
అభివృద్ధి, సంక్షేమం విశ్వసనీయతకు రాష్ట్ర ప్రజలు పెద్దపీట వేశారనేది ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారనే విషయం ఈ ఫలితాలతో తేటతెల్లమైందని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీి నేతలు గాలి కబుర్లు చెబుతూ కట్టు కథలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై, కాంగ్రెస్‌పై చేసిన విమర్శలను గమనించి రాష్ట్ర ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన తీర్పునిచ్చారని చెప్పారు. పట్టణ ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పుతో ప్రజా ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగిందనీ, అత్యున్నత ప్రమాణాలతో పాలన అందిస్తామని స్పష్టం చేశారు. పార్లమెం టు ఎన్నికల్లో, ఆ తర్వాత కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆ తరువాత పంచాయతీ ఎన్నికల్లో వరుసగా ప్రజా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని, ప్రతిపక్షాలు ఈ విషయాన్ని గమనంలో పెట్టుకోవాలని సూచించారు. ప్రజలకు జవాబుదారీగా ప్రతిపక్షాలుండాలని సూచించారు. సంపూర్ణ విజయం కోసం శ్రమించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.



