Wednesday, March 25, 2026
E-PAPER
Homeజాతీయంసంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలు సంపూర్ణంగా సిద్ధంగా ఉండాలి

సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలు సంపూర్ణంగా సిద్ధంగా ఉండాలి

- Advertisement -

– రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోవాలి : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ :
పశ్చిమ ఆసియా ఘర్షణల నేపథ్యంలో దేశం కోవిడ్‌ కాలం నాటి సంక్షోభం వంటి దీర్ఘకాలిక సంక్షోభం వైపు పయనిస్తోందని, దానిని ఎదుర్కొనేందుకు పౌరులు సంపూర్ణంగా సిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని ఘర్షణల వల్ల ఏర్పడిన సంక్షోభం గురించి మంగళవారం ఆయన రాజ్యసభలో మాట్లాడారు. ‘ఇంధన సరఫరా గొలుసులలో అంతరాయం, ధరల పెరుగుదల సుదూర పరిణామాలకు దారితీస్తాయి. యుద్ధం వల్ల కలిగే సంక్షోభం దీర్ఘకాలం కొనసాగుతుంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. కోవిడ్‌-19 సంక్షోభాన్ని అధిగమించడానికి ఉన్నత స్థాయి బందాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా, యుద్ధకాల సంక్షోభాన్ని పరిష్కరించడానికి కూడా ఉన్నత స్థాయి బందాలను ఏర్పాటు చేస్తారు. ఇంధనం, సరఫరా గొలుసులు, ఎరువుల పంపిణీ, ధరల పెరుగుదలను నియంత్రించడం వంటి అంశాలకు సంబంధించిన వ్యూహాలను ఈ బందాలు రూపొందిస్తాయి. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోవాలి. అన్ని కష్టకాలంలో మాదిరిగానే, కార్మికులు, నిరుపేదలు ఎక్కువగా నష్టపోతారు. వారిని ఆదుకోవడానికి రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలి. నల్లబజారు, నిల్వలను నివారించడానికి చర్యలు తీసుకోవాల” అని అన్నారు.

హోర్ముజ్‌ను మూసివేయడం ఆమోదయోగ్యం కాదు
మధ్యప్రాచ్యంలో వీలైనంత త్వరగా ఉద్రిక్తతలను తగ్గించడానికి, హోర్ముజ్‌ జలసంధిని తెరవడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ‘మేము గల్ఫ్‌ దేశాల అధిపతులతో మాట్లాడుతున్నాము. ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికాలతో సంప్రదింపులు జరుపుతున్నాము. దౌత్యపరమైన చర్చలతో ఈ ప్రాంతంలో శాంతి, ప్రశాంతతను నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హోర్ముజ్‌ను మూసివేయడం ఆమోదయోగ్యం కాదు. దాని గుండా వెళ్లే వాణిజ్య నౌకలపై దాడులు ఖండనీయం. అదేవిధంగా, ఇంధన సౌకర్యాలపై దాడులను మేము వ్యతిరేకిస్తాము. సంఘర్షణ ప్రాంతాల్లోని భారతీయుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. 3,75,000 మంది భారతీయులు సురక్షితంగా తిరిగి వచ్చారు. 700 మంది వైద్య విద్యార్థులతో సహా 1,000 మంది ఇరాన్‌ నుంచి తిరిగి వచ్చారు. భారతదేశంలో తగినంత ముడి చమురు నిల్వలు ఉన్నాయి’ అని అన్నారు.

దాడులను ఖండిస్తూ పార్లమెంట్‌ లో తీర్మానాలను ఆమోదించాలి : జాన్‌ బ్రిట్టాస్‌
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో అక్కడి భారతీయుల భద్రత, పునరావాసం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ ప్రణాళికలు రూపొందించాలని సిపిఎం రాజ్యసభ నేత జాన్‌ బ్రిట్టాస్‌ డిమాండ్‌ చేశారు. ‘పశ్చిమ ఆసియాలో కోటి మంది భారతీయులు ఉన్నారు. కేరళ జనాభాలో పది శాతం మంది పశ్చిమ ఆసియాలో నివసిస్తున్నారు. ఉద్రిక్తతల కారణంగా ఐదు లక్షల మంది భారతీయ విద్యార్థులు రాయాల్సిన సిబిఎస్‌ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. పశ్చిమ ఆసియా నుండి ప్రజలు పంపే డబ్బు దేశ ఆర్థిక పునాదికి ఆధారం. ఈ పరిస్థితుల్లో, గల్ఫ్‌ దేశాల నుంచి తిరిగి వచ్చిన వారికి, రాబోతున్న వారికి సమగ్ర పునరావాస ప్యాకేజీని సిద్ధం చేయాలి’ అని జాన్‌ బ్రిట్టాస్‌ డిమాండ్‌ చేశారు. అమెరికా, ఇజ్రాయెల్‌ చేస్తున్న ఏకపక్ష, అనైతిక దురాక్రమణలపై ప్రధానమంత్రి మౌనం వహించడాన్ని జాన్‌ బ్రిట్టాస్‌ విమర్శించారు. 2003లో అటల్‌ బిహారీ వాజ్‌పేరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఇరాక్‌పై యుద్ధాన్ని ఖండిస్తూ పార్లమెంటు ఉభయ సభలు తీర్మానాలు చేశాయి. ఈ ఉదాహరణను అనుసరించి, ప్రస్తుత దాడులను ఖండిస్తూ తీర్మానాలను ఆమోదించాలని పార్లమెంటు ఉభయ సభలకు జాన్‌ బ్రిట్టాస్‌ పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -