నవతెలంగాణ – కంఠేశ్వర్
రాబోయే 2-3 రోజుల వర్ష సూచన దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. కావున ప్రజలు పోలీస్ శాఖ సూచించిన సూచనలను పాటించగలరు. ప్రజల భద్రతా దృష్ట్యా 24 X 7 పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పొంగిపొర్లనున్న వాగులు, వంకలు వద్దకు వెళ్లవద్దు.
జలాశయాలు, చెరువులు, కుంటలు చూడడానికి వెళ్లకూడదు. ప్రమాదానికి గురయ్యే అవకాశముంది. కావున అట్టి ప్రదేశాలకు ప్రజలు ఎవరు కూడా వెళ్లకూడదు. వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పొలాల్లో పడిపోయిన విద్యుత్తు తీగలతో ప్రమాదం కలిగే అవకాశం ఉన్నందున రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పురాతన కట్టడాలు లేదా పురాతనమైన ఇండ్లు పురాతనమైన గోడలు ఉన్నట్లయితే వర్షతాకిడికి నాని కింద పడే అవకాశాలు ఉన్నాయి. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా వరద ఉదృతి తలెత్తిన సందర్భంలో పోలీసు సిబ్బంది, అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టి ప్రాణ నష్టం లేకుండా చూడాలని అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
రెవెన్యూ , మునిసిపల్ , వ్యవసాయం , గ్రామీణాభివృద్ధి , పశుసంవర్ధక , ప్రజా రవాణా, నీటిపారుదల వంటి అన్ని విభాగాలతో సరైన సమన్వయం చేసుకోవాలి అని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సమయంలో డయల్ 100 ( లేదా ), పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712659700( లేదా ) సంబంధిత పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని సూచించారు.