వాగులు, చెరువులు, కుంటల దగ్గరికి వెళ్లవద్దు..చిన్న తప్పిదం పెద్ద ప్రమాదంగా మారొచ్చు
నవతెలంగాణ – వనపర్తి
వనపర్తి జిల్లాలో మొంథా తుఫాన్ దృష్ట్యా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయకూడదని, చేపల వేట లేదా నీటిలో ఆటల వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. వర్షాల ప్రభావంతో రహదారులు దెబ్బతినే అవకాశాలు ఉన్నందున అత్యవసరం తప్ప బయటకు రాకూడదని సూచించారు. వాగులు చెరువులు కుంటలు వర్షపు నీటితో నిండిన క్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలను కుటుంబ సభ్యులను వాగులు చెరువులు కుంటలను తిలకించేందుకు ఎవరు వెళ్లవద్దని సూచించారు.
రైతులు తమ పశువులను, వ్యవసాయ పరికరాలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని, పిల్లలు, వృద్ధులు నీటి ముంపు ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100, వనపర్తి జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ వాట్సాప్ నెంబర్ 6303923200 కు సమాచారం అందించినచొ తక్షణ సహాయక రక్షణ చర్యలకు వర్షాల సమయంలో ప్రజల రక్షణ కోసం వనపర్తి జిల్లా పోలీసులు సిద్ధంగా ఉన్నారని జిల్లా ఎస్పీ గారు ఒక ప్రకటనలో తెలిపారు. “ప్రజల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. జీవన రక్షణకే ప్రాధాన్యత ఇవ్వండి, రిస్క్ తీసుకోవద్దు,”అని జిల్లా ఎస్పీ అన్నారు.



