Friday, February 13, 2026
E-PAPER
Homeజాతీయంమోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన ప్రజానీకం

మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన ప్రజానీకం

- Advertisement -

దేశవ్యాప్తంగా ఆందోళనలు
చారిత్రాత్మక సార్వత్రిక సమ్మె విజయవంతం
అన్ని రాష్ట్రాల్లో వెల్లడైన ప్రజాగ్రహం
భాగస్వాములైన సంఘటిత, అసంఘటితరంగ కార్మికులు
మూతపడ్డ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు
స్తంభించిన కార్యకలాపాలు
సమ్మెలో 30 కోట్ల మంది భాగస్వామ్యం
అభినందనలు తెలిపిన సీఐటీయూ


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, దేశ వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు గురువారం నిర్వహించిన జాతీయ సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు సమ్మెలో భాగస్వాములు అయ్యారు. అన్ని రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున ప్రదర్శనలు, పికెటింగ్‌లు, సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించారు.

సమ్మెలో సంఘటిత, అసంఘటిత రంగాలు, ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు, బహుళజాతి కంపెనీలు, స్కీమ్‌ కార్మికులు, గ్రామీణ శ్రామికులు, ఊబర్‌, ఓలా, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం కార్మికులు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనేక చోట్ల వారికి బెదిరింపులు తప్ప లేదు. అయినా వెనుకడగు వేయకుండా తాము సమ్మెను కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. అనేక రాష్ట్రాల్లో నిషేధాజ్ఞలు విధించారు. అనేక చోట్ల న్యాయస్థానాల ఆంక్షలు, కార్మిక వ్యతిరేక శక్తుల దాడులు చేసినా దేశ శ్రామికవర్గం ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ఫలితంగా సమ్మెకు భారీ స్పందన లభించింది.

అనేక రాష్ట్రాల్లో…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, కేరళ, తమిళనాడు, గోవా, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్తాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్ర, త్రిపుర, బీహార్‌, అసోం, జమ్మూకాశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, కర్నాటక, హర్యానా, మేఘాలయా, పాండిచ్చేరి, ఢిల్లీ తదితర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో(యూటీలు) సమ్మె ప్రభావం కనిపించింది.

పలు రంగాల్లో సమ్మె కార్యక్రమాలు
బ్యాంకింగ్‌, బీమా, పోస్టల్‌, రవాణా, ఆరోగ్యం, రక్షణ, బొగ్గు, బొగ్గుయేతర గనులు, గ్యాస్‌ పైప్‌లైన్‌, విద్యుత్‌, పోర్టు, స్టీల్‌, డాక్‌ యార్డు, రైల్వే, జూట్‌ వంటి రంగాల్లో సమ్మె కార్యక్రమాలు జరిగాయి. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. అసంఘటిత రంగ కార్మికులు భారీ స్థాయిలో సమ్మెలో భాగస్వామ్యమయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకింగ్‌, పోస్టల్‌ శాఖ, బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఉద్యోగులు, అకౌంట్స్‌, ఆడిట్‌ విభాగం ఉద్యోగులు, ఆదాయపు పన్ను, ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖ ఉద్యోగులు సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు. కొన్ని చోట్ల భోజన విరామ సమయంలో ప్రదర్శనలు, నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనలు నిర్వహించారు. అనేక ప్రాంతాల్లో వేలాది మంది కార్మికులు, రైతులు, వ్యవసాయ, గ్రామీణ కార్మికులు భారీ సంఖ్యలో సమ్మెలో పాల్గొన్నారు.

బొగ్గు, మైనింగ్‌ రంగంపై ప్రభావం
కేరళ, ఒడిశా, త్రిపుర తదితర కొన్ని ఇతర రాష్ట్రాలలో సమ్మె ప్రభావం తీవ్రంగా కనిపించింది. బొగ్గు, మైనింగ్‌ రంగంలో కోల్‌ ఇండియా లిమిటెడ్‌, దాని అనుబంధ సంస్థలైన సీసీఎల్‌, ఈసీఎల్‌, ఎన్‌సీఎల్‌, ఏఈసీఎల్‌, ఎంసీఎల్‌, డబ్ల్యూసీఎల్‌, ఎన్‌ఈసీ- సీఎంపీడీఐ యూనిట్లతో పాటు 83 శాతం కంటే ఎక్కువ మంది సమ్మెలో భాగస్వామ్యం అయ్యారు. జార్ఖండ్‌ లోని ధన్‌బాద్‌, బొకారో, గిరిదిV్‌ా, ఒడిశాలోని తాల్చర్‌, ఇబ్‌ వ్యాలీ, ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లో సింగ్రౌలి, మహారాష్ట్రలోని చంద్రపూర్‌, నాగ్‌పూర్‌ బెల్ట్‌, పశ్చిమ బెంగాల్‌ లోని రాణిగంజ్‌-అసన్సోల్‌లలో బొగ్గు ఉత్పత్తి, సరఫరా తీవ్రంగా ప్రభావితమైంది.

సమ్మెలో విద్యుత్‌ ఉద్యోగులు
విద్యుత్‌ రంగంలో అనేక రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం గణనీయంగా ఉంది. తమిళనాడులో 13,040 మంది విద్యుత్‌ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. కేరళ విద్యుత్‌ రంగంలో దాదాపు 95 శాతం మంది సమ్మెలో పాలు పంచుకున్నారు. దీంతో రాష్ట్రంలో దాదాపు మొత్తం షట్‌డౌన్‌ అయింది. హిమాచల్‌ప్రదేశ్‌లో అనేక విద్యుత్‌ సంస్థలలో 100 శాతం మంది ఉద్యోగులు పాల్గొన్నారు. పంజాబ్‌లో 25,000 మందికి పైగా విద్యుత్‌ ఉద్యోగులు సమ్మెలో భాగమయ్యారు. మహారాష్ట్రలో వివిధ యూనిట్లలో విద్యుత్‌ ఉద్యోగులు 100 శాతం పని బహిష్కరణను పాటించారు. ఈశాన్య, దక్షిణ రాష్ట్రాలలోని పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ యూనిట్లు సమ్మెతో దాదాపు మూతపడ్డాయి.

పెట్రో, గ్యాస్‌ రంగంలో…
పెట్రోలియం శుద్ధి కర్మాగారాలు, గ్యాస్‌ రంగంలో సమ్మె భారీగా జరిగింది. అసోంలోని దిగ్బోరు, బొంగైగావ్‌, నుమాలిఘర్‌ శుద్ధి కర్మాగారాలలో, అలాగే సిల్చార్‌, దిమాపూర్‌, సెక్మైలోని టెర్మినల్స్‌లో కాంట్రాక్ట్‌ కార్మికులు పూర్తిగా సమ్మెలో పాల్గొన్నారు. కేరళలోని కొచ్చి, కోజికోడ్‌, కర్నాటకలోని మంగళూరులో ఎల్పీజీ బాట్లింగ్‌ ప్లాంట్లు, పీవోఎల్‌ డిపోలు, మహారాష్ట్ర, గుజరాత్‌లోని వివిధ యూనిట్లలో గణనీయంగా సమ్మె జరిగింది. బీపీసీఎల్‌ ముంబయి రిఫైనరీ, హెచ్‌పీసీఎల్‌ ముంబయి, ఓఎన్‌జీసీ పరిశ్రమల్లో ఆందోళనలు జరిగాయి. అనేక ప్రాంతాల్లో శాంతియుత పికెటింగ్‌ తో వాహనాలు, కాంట్రాక్ట్‌ కార్మికుల ప్రవేశాన్ని అడ్డుకున్నారు.

ఓడరేవులు, రవాణా రంగంలో…
ఓడరేవులు, షిప్పింగ్‌, రవాణా రంగాల్లో సమ్మె విజయవంతగా జరిగింది. ఒడిశాలోని పారదీప్‌ పోర్టు, ఆంధ్రప్రదేశ్‌ లోని కాకినాడ పోర్టు పికెటింగ్‌ కారణంగా కార్యకలాపాలు నిలిచిపోయాయి. తమిళనాడులోని కామరాజర్‌ పోర్టు, కేరళలోని కొచ్చిన్‌ పోర్టు, పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తా పోర్టులు గణనీయంగా ప్రభావితమయ్యాయి. డాక్‌ కార్మికులు, కార్గో హ్యాండ్లర్లు, కాంట్రాక్ట్‌ కార్మికులు సమ్మెలో భారీగా పాల్గొన్నారు. తమిళనాడులోని టుటికోరిన్‌ పోర్టులో పూర్తిగా సమ్మె జరిగింది. ప్రభుత్వ రంగ ఉక్కు కర్మాగారాల్లో కూడా సమ్మె ప్రభావితం స్పష్టంగా కనిపించింది. సేలం, వైజాగ్‌ ఉక్కు కర్మాగారంలో సమ్మె గణనీయంగా ఉంది.

రవాణా కార్మికుల భాగస్వామ్యం
పంజాబ్‌, ఒడిశాల్లో రోడ్డు రవాణా కార్మికులు సమ్మెలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కేరళలో ప్రభుత్వ, ప్రయివేట్‌ బస్సులు, ఆటోరిక్షాలు, టాక్సీలు, వస్తువుల రవాణా వాహనాలు రోడ్లపైకి రాలేదు. పశ్చిమబెంగాల్‌లోని హౌరా, హుగ్లీ, దుర్గాపూర్‌, హల్దియాతో సహా అన్ని పారిశ్రామిక ప్రాంతాలలో వస్తువుల రవాణా తీవ్రంగా దెబ్బతింది. సికింద్రాబాద్‌, చెన్నై, నాగ్‌పూర్‌, భువనేశ్వర్‌, పాట్నా, కలకత్తా డివిజన్లలో రైల్వే కాంట్రాక్ట్‌ కార్మికులు ప్రదర్శనలు, గేట్‌ సమావేశాలు నిర్వహించారు.

పారిశ్రామిక రంగంపై ఎఫెక్ట్‌
తయారీ, పారిశ్రామిక రంగంలో భారీ పరిశ్రమ, ఇంజినీరింగ్‌, ఆటోమొబైల్స్‌, టెక్స్‌టైల్స్‌, జూట్‌, ప్లానిటేషన్‌, కెమికల్స్‌, ఫార్మస్యూటికల్స్‌లో సమ్మె ప్రభావం కనిపించింది. తమిళనాడులోని ఆటోమొబైల్‌, ఇంజినీరింగ్‌ సెంటర్లయిన శ్రీపెరుంబుదూర్‌, ఒరగడం, మరైమలైనగర్‌, అపోలో టైర్స్‌, జెకె టైర్స్‌, యమహా, శామ్సంగ్‌ వాలియో, గెస్టాంప్‌, ఎల్‌ అండ్‌ టీ యూనిట్లతో సహా దాదాపు 40 కంపెనీల్లో కార్మికులు ఉత్పత్తిని నిలిపివేశారు. కొచ్చిన్‌ సెజ్‌లో దాదాపు 200 పరిశ్రమలు మూతపడ్డాయి. 40,000 మంది కార్మికులలో దాదాపు 32,000 మంది సమ్మెలో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లోని సత్నా, మైహార్‌, నీముచ్‌లోని సిమెంట్‌ ప్లాంట్లు పూర్తిగా మూతపడ్డాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, సనంద్‌, సూరత్‌, వడోదర, భరూచ్‌ లోని పారిశ్రామిక వాడల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.

తెలంగాణలో…
తెలంగాణలోని సంగారెడ్డి, మేడ్చల్‌ పారిశ్రామిక ప్రాంతాల్లో సాండ్విక్‌, తోషిబా, ఐటీసీ బొల్లారం, మహీంద్రా అండ్‌ మహీంద్రా వంటి బహుళజాతి కంపెనీల కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని దూర్స్‌, తెరాయ్ లో టీ తోటలు, హౌరా, హూగ్లీలోని జ్యూట్‌ మిల్లులు, ఇటుక బట్టీలు, బియ్యం మిల్లులు, సిమెంట్‌ యూనిట్లు సమ్మెకు గణనీయంగా ప్రభావితమయ్యాయి. మహారాష్ట్ర, కర్నాటక, కేరళలోని టైర్‌ ఫ్యాక్టరీలలో కూడా భారీ సమ్మె జరిగింది. సీఐటీయూ నేతృత్వంలోని సేల్స్‌ ప్రమోషన్‌ ఉద్యోగులు దేశవ్యాప్తంగా భారీ సమ్మెలో పాల్గొన్నారు.

కదం తొక్కిన కార్మికులు
స్కీమ్‌ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు సమ్మెలో భాగస్వామ్యం భారీగా, నిర్ణయాత్మకంగా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, బీహార్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, అనేక ఇతర రాష్ట్రాలలో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. నిర్మాణ, మున్సిపల్‌ పారిశుధ్య, తోటల, హెడ్‌లోడ్‌, గృహ, గిగ్‌ కార్మికులు ప్రదర్శనలు, పికెటింగ్‌లలో భారీగా పాల్గొన్నారు. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ లో నిర్మాణ కార్మికులు సమ్మెలో భారీగా పాల్గొన్నారు. అనేక రాష్ట్రాల్లో, గ్రామీణ వ్యవసాయ కార్మికులు, చిన్న రైతులు సంఘీభావ ర్యాలీలలో చేరారు. కార్మిక-రైతు ఐక్యతను ప్రదర్శించారు.

స్తంభించిన ఒడిశా
ఒడిశాలో సాధారణ జనజీవనం స్తంభించింది. మైనింగ్‌ బెల్టులు, స్పాంజ్‌ ఐరన్‌ ప్లాంట్లు, పారాదీప్‌ పోర్టు కార్యకలాపాలు నిలిచిపోయాయి. భువనేశ్వర్‌లో భారీ ర్యాలీ జరిగింది. భువనేశ్వర్‌లోని నల్కో రిఫైనరీ డామన్‌జోడి, పారాదీప్‌లోని గోవా కార్బన్‌, సీఆర్‌ఆర్‌ఐ కటక్‌, మాస్టర్‌ క్యాంటీన్‌ స్క్వేర్‌ లో ఆందోళనలు జరిగాయి. జాతీయ, రాష్ట్ర రహదారులతో సహా ప్రధాన రహదారులు దిగ్బంధించడంతో పాటు ప్రజా రవాణా, మార్కెట్లు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు మూత బడ్డాయి. భువనేశ్వర్‌, కటక్‌, బాలసోర్‌, బెర్హంపూర్‌, సంబల్పూర్‌ సహా అన్ని ప్రధాన పట్టణ ప్రాంతాల్లో సమ్మె ప్రభావం కనిపించింది.

ఛత్తీస్‌గఢ్‌లో…
ఛత్తీస్‌గఢ్‌లో ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో అనేక బ్యాంకులు మూతపడ్డాయి. బీమా కంపెనీలు, పోస్టాఫీసుల సిబ్బంది, కార్మికులు, రైతులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. మైనింగ్‌ కార్యకలాపాలు కూడా సమ్మెకు ప్రభావితమయ్యాయి. కోబ్రా కోల్‌ సెక్టర్‌లో సమ్మె కారణంగా లారీలు నిలిచిపోయాయి. భిలాయ్ స్టీల్‌ ప్లాంట్‌లో ఆందోళనలు జరిగాయి.

తమిళనాడులో స్తంభించిన పోర్టు
తమిళనాడులో చెన్నై, నైవేలి, కోయంబత్తూర్‌, తిరుప్పూర్‌, రాజధాని చుట్టూ ఉన్న పారిశ్రామిక బెల్ట్‌లలో పెద్ద ర్యాలీలు జరిగాయి. సమ్మె కారణంగా పోర్టు కార్యకలాపాలు స్తంభించాయి. తూత్తుకుడి, చెన్నైలోని ఓడరేవు కార్యకలాపాల్లో భారీ ఆందోళనలు జరిగాయి. పారిశ్రామిక కేంద్రమైన శ్రీపెరంబుదూర్‌ లో కూడా గణనీయమైన కార్యకలాపాలు జరిగాయి. అనేక తయారీ పరిశ్రమల్లో కార్మికులు సమ్మెకు సంఘీభావం తెలుపుతూ గేట్‌ మీటింగ్‌లు, ప్రదర్శనలు నిర్వహించారు. కొన్ని ప్రధాన ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్‌ రంగాల్లో, పరిశ్రమల్లో సమ్మె జరిగింది. శ్రీపెరంబుదూర్‌-ఒరగడం పారిశ్రామిక బెల్ట్‌లో వస్తువుల తరలింపు రవాణా వాహనాలు స్తంభించాయి.

పంజాబ్‌లో…
పంజాబ్‌లో సమ్మె ప్రభావం కనిపించింది. అధికార ఆప్‌ సమ్మెకు మద్దతు ప్రకటించింది. గోవాలో బ్యాంకింగ్‌ కార్యకలాపాలు ప్రభావితం అయ్యాయి. బ్యాంకులు, బీమా సంస్థల కార్యాలయాలు మూసి వేయబడ్డాయి. పంజాబ్‌ విద్యుత్‌ ఉద్యోగులు, రైతులు, వ్యవసాయ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.

గుజరాత్‌లో ఆందోళనలు
గుజరాత్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. స్కీమ్‌ వర్కర్లు, పారిశ్రామిక కార్మి కులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అహ్మదాబాద్‌, సూరత్‌, వడోదర, రాజ్‌కోట్‌తో సహా ప్రధాన నగరాల్లో సమ్మె ప్రభావం కనిపించింది.

త్రిపురలో నిలిచిన రవాణా
త్రిపురలో సమ్మె ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రైలు, రోడ్డు రవాణా నిలిచిపోయింది. పెద్ద సంఖ్యలో దుకాణాలు, సంస్థలు మూసివేయబడ్డాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి సార్వత్రిక సమ్మెకు మద్దతుగా నిలిచారు. అగర్తలాలో సమ్మెకు మద్దతుగా జరిగిన భారీ ర్యాలీలో మాజీ ముఖ్యమంత్రి మానిక్‌ సర్కార్‌, ప్రతిపక్ష నేత జితేంద్ర చౌదరి పాల్గొన్నారు.

అసోంలో సమ్మె సక్సెస్‌
అసోంలోని పారిశ్రామిక ప్రాంతాలలో విజయవంతమైన సమ్మె జరిగింది. డిగ్బోరు రిఫైనరీ, గౌహతి శుద్ధి కర్మాగారంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. మినరల్‌ ఆయిల్‌ కార్మికులు సమ్మె చేపట్టారు. విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజినీర్లు సమ్మె చేపట్టారు. ఎన్‌టీపీసీ బొంగైగావ్‌ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. రాజస్తాన్‌లోని 22 జిల్లాల్లో సమ్మె ప్రభావం కనిపించింది. భివాడిలోని ఆశిరాద్‌ పైప్స్‌ లిమిటెడ్‌ భివాడిలో కార్మికులు సమ్మె చేపట్టారు. సిరోహి జిల్లాలోని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీ వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు.

మేఘాలయాలో విద్యుత్‌ ఇంజినీర్లు, కార్మికులు సమ్మె చేపట్టారు. హిమాచల్‌ప్రదేశ్‌లో విద్యుత్‌ కార్మికులు, ఇంజినీర్లు సమ్మె చేశారు. బఘేరిలో లాల్‌ ఝండా సిమెంట్‌ వర్కర్స్‌ ఆందోళన చేపట్టారు. ఉత్తరాఖండ్‌లోని 25 ప్రదేశాలలో సమ్మె ర్యాలీలు జరిగాయి. హరిద్వార్‌లో సమ్మెలో భెల్‌ కార్మికులు పాల్గొన్నారు. బీహార్‌లోని హాజీపూర్‌ పారిశ్రామిక వాడలో రోడ్లపై కార్మికులు వచ్చి ఆందోళన చేపట్టారు.

ఢిల్లీలో…
న్యూఢిల్లీలో పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రదర్శలు జరిగాయి. జంతర్‌మంతర్‌లో కార్మిక, వ్యవసాయ కార్మిక, రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో సీఐటీయూ అధ్యక్షుడు సధీప్‌ దత్తా, ఉపాధ్యక్షులు తపన్‌ సేన్‌, ఏఐకేఎస్‌ అధ్యక్షుడు విజూ కృష్ణన్‌, ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

మధ్యప్రదేశ్‌లో…
మధ్యప్రదేశ్‌లో సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపించింది. బొగ్గు, మాంగనీస్‌, సిమెంట్‌ రంగాలు పూర్తిగా మూతపడ్డాయి. బాలాఘాట్‌ గనుల్లో కార్మికులు 100 శాతం సమ్మెలో పాల్గొన్నారు. భోపాల్‌, గ్వాలియర్‌, జబల్పూర్‌లలో ఆందోళనలు జరిగాయి. ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలో పని చేసే 25 వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లో ఉన్న ఆరు ఆయుధ పరిశ్రమలు, 506 ఆర్మీ బేస్‌ వర్క్‌ షాప్‌, సెంట్రల్‌ ఆర్డినెన్స్‌ డిపో, మిలిటరీ ఇంజినీర్‌ సర్వీస్‌లల్లో పని చేసే 25 వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నట్టు ఆలిండియా డిఫెన్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (ఏఐడీఈఎఫ్‌) అధ్యక్షుడు ఎస్‌ఎన్‌ పాఠక్‌ తెలిపారు. బ్యాంక్‌ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొన్నారు. దీంతో బ్యాంకులు మూతపడ్డాయి. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథక కార్మికులు సమ్మెలో భాగస్వామ్యం అయ్యారు.

పశ్చిమబెంగాల్‌లో భారీగా సమ్మె
పశ్చిమబెంగాల్‌లో సమ్మె భారీగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6,000 పికెటింగ్‌ పాయింట్లు నిర్వహించారు. దాదాపు 100 మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హల్దియా రిఫైనరీ కంపెనీలో ఉద్యోగులు, కార్మికులు ఆందోళన నిర్వహించారు. హూబ్లీలోని అన్ని జూట్‌ మిల్లులు మూతబడ్డాయి. ఇన్సురెన్స్‌ రంగంలో ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. నక్సల్‌బరి టీ గార్డెన్‌ కార్మికులు ఆందోళన చేపట్టారు.

కేరళలో కోటి మంది..
కేరళలో జనజీవనం స్తంభించింది. దాదాపు కోటి మంది కార్మికులు, రైతులు సమ్మెలో పాల్గొన్నారు. 250కి పైగా ప్రధాన ర్యాలీలు, వేలాది స్థానిక పికెటింగ్‌ జరిగాయి. రవాణా, ప్రభుత్వ రంగ సంస్థలు, సెజ్‌లు, సహకార సంస్థలు, తోటలు, సేవా రంగాన్ని సమ్మె ప్రభావితం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ, ప్రయివేట్‌ బస్సులు, ఆటోలు ఇతర వాహనాలు రోడ్డు ఎక్కలేదు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు దుకాణాలు, వ్యాపారాలు కూడా మూసివేశారు. కొచ్చి రిఫైనరీ వంటి కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు మూతపడ్డాయి. కేరళలోని అన్ని జిల్లాల్లో ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారు.

కదిలిన సింగరేణి
తెలంగాణలోని రామగుండం, కొత్తగూడెం, మణుగూరు, బెల్లంపల్లి, భూపాలపల్లి ప్రాంతాలను కలిగి ఉన్న సింగరేణి కాలరీస్‌లో దాదాపు 90 శాతం మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. దీనితో ఉత్పత్తి, బొగ్గు రవాణా నిలిచిపోయింది. వివిధ సైడింగ్‌ల వద్ద బొగ్గు రేకుల రైలు కదలికకు అంతరాయం కలిగింది. ఒడిశాలోని కోయిడా, బర్సువాన్‌, కల్తా, తలదిహిలోని ఇనుప ఖనిజ గనులు, మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో గల మాంగనీస్‌ గనులు, కియోంఝర్‌, జాజ్‌పూర్‌లోని స్పాంజ్‌ ఐరన్‌ క్లస్టర్‌లు పూర్తిగా స్తంభించిపోయాయి. కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులు సమ్మెలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యం
బ్యాంకింగ్‌, బీమా, ఆర్థిక రంగాల్లో సమ్మె భారీగా జరిగింది. అనేక రాష్ట్రాల్లోని ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖలు మూతబడ్డాయి. కొన్ని చోట్ల పాక్షికంగా పనిచేశాయి. అనేక కేంద్రాలలో ఎల్‌ఐసీ, జీఐసీ కార్యాలయాలు దాదాపు పూర్తిగా మూతపడ్డాయి. గుజరాత్‌లోని లేబర్‌ కోర్టులు, ట్రిబ్యునళ్లు క్లోజ్‌ అయ్యాయి. 16 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో గణనీయంగా పాల్గొన్నారు.

కర్నాటకలో భారీ ఆందోళనలు
కర్నాటకలో 17 జిల్లాల్లోని 2,691 ఫ్యాక్టరీల్లో భారీ ఆందోళనలు జరిగాయి. బెంగళూరులోని అనేకల్‌ తాలూకాలోని బొమ్మసంద్ర, ఎలక్ట్రానిక్‌ సిటీ, అట్టిబెలె, వెర్సంద్ర, జిగాని పారిశ్రామిక ప్రాంతాలకు చెందిన పారిశ్రామిక కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. రామనగర జిల్లాలోని బిడాడి ఇండిస్టియల్‌ ఏరియా-టయోటా ఇండిస్టియల్‌ ఏరియాలో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెలో భాగంగా బెంగళూర్‌ లోని ఫ్రీడమ్‌ పార్క్‌కు మార్చ్‌ చేయడానికి ప్రయత్నించిన కార్మిక, రైతు సంఘాల నేతలను టౌన్‌ హాల్‌ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో ఐటీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.

జార్ఖండ్‌లో…
జార్ఖండ్‌లో బ్యాంకింగ్‌, బీమా, బొగ్గు రంగాలు సమ్మె కారణంగా ప్రభావితమయ్యాయని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగుల సంఘం రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీ ఉమేశ్‌ దాస్‌ తెలిపారు. సమ్మెకు వామపక్ష పార్టీలు, కాంగ్రెస్‌ పార్టీలు మద్దతు ఇచ్చాయి.

సకలజనుల సంఘీభావం
సార్వత్రిక సమ్మెక సకలజనుల నుంచి సంఘీభావం లభించింది. విద్యార్థులు, మహిళలు, యువత, కళాకారులు, రచయితలు కూడా సమ్మెకు మద్దతు తెలిపారు. సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐఎంఎల్‌, ఆర్‌ఎస్పీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌ సహా వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీ, ఆప్‌ తదితర రాజకీయ పార్టీలు సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలిపాయి.

సీఐటీయూ అభినందనలు
సార్వత్రిక సమ్మెను చారిత్రాత్మకం చేసినందుకు దేశ ప్రజలకు సీఐటీయూ అభినందనలు తెలిపింది. గురువారం ఈ మేరకు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎలమరం కరీం ప్రకటన విడుదల చేశారు. అఖిల భారత సార్వత్రిక సమ్మెను చారిత్రాత్మకమైన, అద్భుతమైన విజయంగా మార్చిన కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులను సీఐటీయూ అభినందిస్తుందని పేర్కొన్నారు. ”ఇది దేశంలో అతిపెద్ద సమ్మెలలో ఒకటిగా నిలిచింది. లేబర్‌ కోడ్‌ల అమలు, ఇతర కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా డూ-ఆర్‌-డై పోరాటం చేయాలనే వారి దృఢ సంకల్పాన్ని ఇది స్పష్టం చేసింది. ఇండియా-అమెరికా ఒప్పందం కారణంగా రైతులు భారీగా పాల్గొన్నారు.

దేశ ప్రజలు ధైర్యం, బలంతో సామ్రాజ్యవాద శక్తులను వెనక్కి నెట్టివేస్తారు” అని వివరించారు. ”ఈ సమ్మె దేశంలోని కార్మికులు, రైతులు ఎటువంటి ఒత్తిడికి లొంగరని నిరూపించింది. బొగ్గు క్షేత్రాలు, శుద్ధి కర్మాగారాల నుంచి ఓడరేవులు, కర్మాగారాలు, తోటలు, ఆర్థిక సంస్థల వరకు దేశంలోని కార్మికులు తమ ఐక్యత, దృఢ సంకల్పాన్ని నొక్కి చెప్పారు. ఉత్పత్తి, సేవలను నిలిపివేయడంతో పాటు వీధుల్లోకి రావడంతో ఈ సమ్మె చారిత్రాత్మకమైనది” అని తెలిపారు. ”ఈ చారిత్రాత్మక సమ్మెను కార్మికులు, రైతుల ఐక్యతను శక్తివంతంగా మార్చడానికి దోహదపడింది. ప్రతి ఒక్కరినీ సీఐటీయూ మరోసారి అభినందిస్తుంది. రాబోయే రోజుల్లో ఐక్య పోరాటం మరింత బలం, సమన్వయంతో కొనసాగుతుంది” అని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -