అమెరికా సుప్రీంకోర్టు రూలింగ్
ఆందోళనలో లక్షలాది మంది పేదలు, అల్పాదాయ వర్గాలు
వాషింగ్టన్ : నవంబర్ నెలకు అమెరికాలోని పేదలు, అల్పాదాయ వర్గాల ప్రజలకు అందజేయాల్సిన నాలుగు బిలియన్ డాలర్ల ఆహార సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు ట్రంప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతించింది. దీంతో దేశంలోని 4.2 కోట్ల మంది పేదలు, అల్పాదాయ వర్గాల ప్రజలు తీవ్ర ఆందోళనలో పడిపోయారు. మున్నెన్నడూ లేని విధంగా ప్రభుత్వ షట్‌డౌన్ సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతుండడంతో తమకు అందాల్సిన ప్రయోజనాలపై వారు అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కెతాంజీ జాక్సన్ శుక్రవారం అడ్మినిస్ట్రేటివ్ స్టే జారీ చేస్తూ… సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రాం (స్నాప్)కు పాక్షికంగా మాత్రమే నిధులు సమకూర్చేందుకు అనుమతించాలన్న ట్రంప్ ప్రభుత్వ అభ్యర్థనను పరిశీలించడానికి దిగువ కోర్టుకు మరింత సమయం ఇచ్చారు. ఫెడరల్ దారిద్య్ర రేఖ కంటే 130 శాతం కంటే తక్కువ ఆదాయం కలిగిన అమెరికన్లకు స్నాప్ కార్యక్రమం (ఫుడ్ స్టాంపులు) మద్దతు ఇస్తోంది.
2026 ఆర్థిక సంవత్సరంలో ఈ కార్యక్రమం కింద గరిష్టంగా నెలకు 298 డాలర్లు (ఒక్కరికి), ఇద్దరు సభ్యులున్న కుటుంబానికి 546 డాలర్లు అందజేస్తున్నారు. అయితే ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా ఈ సాయం నిలిచిపోయే ప్రమాదం ఏర్పడడంతో రోధ్ దీవిలోని ఫెడరల్ జడ్జి ఒకరు ఇటీవల ట్రంప్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ నిధుల విడుదలలో కోత విధించకుండా లబ్దిదారులకు పూర్తి మొత్తాన్ని అందజేయాలని ఆదేశించారు. అయితే దీనిపై సుప్రీంకోర్టు జడ్జి తాజాగా స్టే ఉత్తర్వులు జారీ చేశారు. దిగువ కోర్టు ఆదేశాలను కొట్టివేయాలా లేదా అనే విషయంపై బోస్టన్‌లోని ఒకటవ యూఎస్ సర్క్యూట్ అప్పీళ్ల కోర్టు రూలింగ్ ఇచ్చిన తర్వాత రెండు రోజుల పాటు ఈ స్టే ఉత్తర్వులు అమలులో ఉంటాయి. స్నాప్ పథకం ఆరు దశాబ్దాల నుంచీ అమలులో ఉంది. అయితే ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా తొలిసారిగా ఈ నెల ప్రారంభం నుంచే దాని అమలు నిలిచిపోయింది. దీంతో పేదలు, అల్పాదాయ వర్గాల వారు కుటుంబ బడ్జెట్ నిర్వహణపై కసరత్తులు చేస్తున్నారు. కొందరు అత్యవసర ఖర్చులను కూడా తగ్గించుకుంటున్నారు.



