మనం ఏదైనా చూసేటప్పుడు మన కండ్ల ద్వారా చూడడం మాత్రమే కాదు… అది మన ఆలోచనలు, భావాలు, మనసులో ఉన్న దృక్పథం కూడా ప్రభావితం చేస్తుంది. అంటే ఒక విషయాన్ని మనం ఎలా చూస్తున్నాం అనేది మన మనసు దృక్పథంపై ఆధారపడి ఉంటుంది. మనకు ఏదైనా కనిపించేటప్పుడు మనం దాన్ని ఎలా అర్థం చేసుకుంటామో, దానికి ఎలా స్పందిస్తామో అనేది మన దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టే మన నడవడికి ఉంటుంది.
మన భావాలు కూడా మన దృక్పథాన్ని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక విషయాన్ని చూసి సంతోషంగా ఉంటే మరొక వ్యక్తిని అదే విషయం బాధపెట్టవచ్చు. ఇక మన ఆలోచనలు కూడా మన దృక్పథాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక వ్యక్తి ఒక సమస్యను చూసి అది చాలా పెద్దది అని ఆలోచిస్తే మరొక వ్యక్తి అదే సమస్యను చూసి అది చాలా చిన్నది అనుకోవచ్చు. ఇలా మనం చూసే దృష్టి కోణం మన జీవితంలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
దృష్టి కోణం, నడవడిక… బహుశా ఇంత కన్నా మంచి అర్థవంతమైన పదాలు మరొకటి వుండవేమో. ఎందుకంటే ఏదైనా సరే మనం చూసే దృష్టిని బట్టే ఉంటుంది కనుక. మనకు ఉన్న అర్హతలు, బలాబలాలు, నిర్ణయం తీసుకోవడంలో ఉన్న చాకచక్యం వంటివన్నీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలని అధిగమించి ముందుకెళ్లేందుకు దోహదపడతాయి. కానీ మనం ఎక్కడికైనా చేరుకోవడానికైనా లేక చేరుకోలేకపోవడానికైనా.. పెద్ద తేడా ఏదైనా ఉందా అంటే అది కేవలం మనం చూసే దృష్టి కోణం వల్లే అని గ్రహించాలి.
ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో నడవడిక కన్నా గొప్పది ఇంకొకటి లేదు. చూసే దృష్టి కోణం కన్నా గొప్ప క్వాలిఫికేషన్ మరొకటి లేదని చెప్పవచ్చు. మనకు తెలియకుండానే మనలో ఉన్న ఓ సహజమైన గుణం అది. ఒకే వాతావరణంలో, ఒకే రకమైన పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఆలోచిస్తున్నారంటే, అందులో ఉన్న ఏకైక తేడా వారు చూసే దృష్టి కోణం వేర్వేరుగా ఉండటమే. కొంతమంది కష్టాలు దాటుకుని ముందుకెళ్లి విజయాలు సాధిస్తే ఇంకొంతమంది అక్కడే ఆగిపోతారు. మన స్నేహితుల్లోనే చూడండి వీరిలో కొందరు ఆత్మవిశ్వాసం కలిగిన వాళ్లయితే, ఇంకొంతమంది మూఢ విశ్వాసాలపై నమ్మకం ఉండేవాళ్లుంటారు. ఇంకా కొంతమంది అసలు ఏం చేయాలన్నా.. ఏదో ఓ సందేహంతో కొట్టుమిట్టాడే వాళ్లుంటారు. వాళ్లు ఎందుకలా ఉన్నారంటే అందుకు కారణం వాళ్లు పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న వాతావరణం ఒక ఎత్తైతే, ఆ తర్వాత వాళ్లు పరిస్థితులను ఎలా స్వీకరించారనేది మరో కారణం.
సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిళ్లే మన దృష్టి కోణానికి చక్కటి ఉదాహరణలు. పెళ్లిలో అమ్మాయి వాళ్లను సంప్రదాయం పేరిట వరకట్నం కోసం గొంతెమ్మ కోరికలు కోరుతుంటే, యువత మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతోంది. కానీ ఎవ్వరైనా ఒకరు ముందుకొచ్చి అలా జరగడానికి వీల్లేదు అని గట్టిగా ప్రశ్నించరు. మనచుట్టుపక్కల జరిగే పెళ్లిళ్లలో 99 శాతం జరిగేది ఇదే. పైగా ‘అమ్మాయి తల్లిదండ్రులు పాత సంప్రదాయాన్నే అనుసరిస్తున్నారు కానీ అంతకుమించి ఇందులో ఇంకేం లేదు. అందుకే మౌనంగా ఉన్నాం’ అని తప్పించుకుంటారు. ఈ కారణంగానే మన దేశంలో మహిళల జీవితాల్లో, వారి సామాజిక పరిస్థితుల్లో ఆశించినంత అభివృద్ధి కనిపించడం లేదు. ఉన్నత చదువులు ఎంత చదువుకున్నా ఇంకా యువత చూసే దృష్టి కోణంలో ఇంకెంతో మార్పు రావాల్సి ఉంది.
దృష్టికోణం
- Advertisement -
- Advertisement -



