Magazines

జీవ పరిమళాల చెమన్

1 గంట క్రితం

Fragrant
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026 | 4 నిమిషాల చదవడం

1997 జూన్ 8వ తేదీ ఆదివారం రోజున ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక "చెమరించిన కన్నుల నుంచి చివురించిన కవి చెమన్" అంటూ సంచలనాత్మక ఎడిటోరియల్ రాసింది. ఈ ఎడిటోరియల్ తెలుగు సాహిత్య లోకంలో ఒక పెద్ద చర్చకు దారి తీసింది. సుమారుగా ఓ పది మంది ప్రపంచ ప్రఖ్యాత కవులతో "చెమన్"ను పోలుస్తూ రాసిన ఈ ఎడిటోరియల్ నిండా జీవితం మూలాలను తాకిన చెమన్ కవిత్వం గుభాళించింది. అంతకుముందు అడపాదడపా పత్రికల్లోని సాహిత్య పేజీల్లో తళుక్కున మెరిసి మాయమయ్యే చెమన్, "ఎడారి స్వప్నం మధ్య "అనే తన మొదటి కవితా సంపుటితో సంచలనం సృష్టించాడు. ఆయనకు వచ్చిన ఆ ట్రెండ్ సెట్టర్ పేరును ఏమి పట్టించుకోకుండా చాలా రోజులు పత్రికల్లో కనిపించడం మానేశాడు. కీర్తి కాంక్షల పట్ల పట్టింపు లేని సాధారణ కవిగా ఉండడమే బహుశా ఆయనకిష్టం. జీవితపు అట్టడుగు పొరలను తాకుతూ సాగే చెమన్ కవిత్వంలో భావన, భాష, శైలి, భావ చిత్రాలలో, ఇతివృత్తంలో, అలంకారాలలో తనకంటూ ఉన్న ఆ సొంత గొంతుక ప్రత్యేకంగా కనిపిస్తాయి.


నిత్యం ఏదో ఒకటి రాయాలనే ఆతుృత లేకుండా, అరుదుగానే రాసినప్పటికీ ఆయన రచనలు సాహితీప్రియులకు ఎప్పుడూ విందు భోజనంలా ఉంటాయి. తిలక్, శ్రీశ్రీ, ఓషో, కార్ల్ మార్క్స్‌లను ఒకే దృశ్యంలోకి ఇమిడ్చే అమోఘమైన కాల్పనిక శక్తి ఆయన సొంతం. గాయాన్ని గేయంగా మలుస్తూ, జీవిత సత్యాలను లోతైన భావచిత్రాలతో కవిత్వంలో ఆవిష్కరించే చెమన్ కవిత్వాన్ని ఆస్వాదించడానికి మనలో జీవితానుభవాల గాయాలు లేదా జ్ఞాపకాలు ఉండాలి. చెమన్ కవిత్వం మనలోకి ఇముడ్చుకోవాలంటే మనకు కొంత జీవితం ఉండాలి, లేదా జీవితం నేర్పిన ఏదో ఒక గాయమో, గేయమో మనలో మసలుతూఉండాలి. అప్పుడే మనం ఆయన చెప్పే కవిత్వాన్ని మనసుపెట్టి ఆలకిస్తాం. మౌన ప్రవాహం నుండి మరో కెరటమై ఎగిసి పడాలని, మనలోని మనం వెయ్యి మనంలా విస్తరించాలని, ఊరటై, ఊపిరై వూటల చెలిమగా ప్రవహించాల్సి ఉందని, మనలో ముడుచుకుపోయి కునుకుతీస్తున్న మన చైతన్యం మీద కాసిన్ని అక్షరాలను చిలకరిస్తాడు. అనుభవాలు ఆవిరైపోయి రెటీనా నిండా నిశ్శబ్ద హిమధూమమై పరుచుకుని బతుకు మీద శిశిరం శివమెత్తినాసరే ఆశ కోల్పోవద్దని మనిషి వెన్ను తడతాడు.

మెరుగైన సమాజం కోసం, నిర్మలమైన మానవుని కోసం కలలు కనడం అనేది కవి కనీస వివేచన. రేపు ఎప్పుడైనా ఈ సమాజం ఇలా కాకుండా మరింత పరిపుష్టమైన మానవ సమాజ నిర్మాణం జరగాలని కవి ఆశపడతాడు. అలాంటి సమాజా నిర్మాణంలో ముఖ్య పాత్ర ప్రశ్నదే. ప్రశ్నించడం పాలకులకు గిట్టదు అందుకే వాళ్ళు ప్రశ్న గొంతును నొక్కే నిత్య కృత్యమైన పనికి పూనుకుంటారు. కానీ ప్రశ్న ఎప్పుడూ మరణించదనే ఒక సత్యాన్ని వెలిగెత్తి చాటుతాడు. ''ప్రశ్న ఎక్కడ జారిపోలేదు/ సంధించిన స్వప్నం చివర/ విడదీసిన పద్యమై/ విషదపరుచుకుంది/ చూపుడువేలు చివరన పుష్పించిన గొంతుకై/ నిశ్చల గేయాన్ని ఆలపిస్తున్నది/ మూసిన కనురెప్పల మీద/ నిశ్శబ్ద సాధన చేస్తున్నది'’. ఎడారి స్వప్నం మధ్య తర్వాత ఆయననుండి వచ్చిన మరో కవితా సంపుటి "ఆవిష్కరించని దృశ్యం". ఈ పుస్తకంలో ఆయన మరో రకంగా దర్శనమిస్తాడు. ఆయన ఎప్పటికప్పుడు కొత్త నిర్మాణ పద్ధతులకు శ్రీకారం చుడతాడేమో అనిపిస్తుంది. ఎడారి స్వప్నం మధ్య లోని చెమన్ ఆవిష్కరించని దృశ్యంలోని చెమన్ ఒక్కరే అన్న ఆశ్చరం కల్గిస్తోంది. ఒక సందిగ్ధ కాలపు సందర్భంలోంచి ప్రతి పేజీని కొత్త దృశ్యాలతో ఆవిష్కరించాడు.

నడిచి వచ్చిన రహదారులే నయవంచనమయ్యే చేదు వాస్తవాల నగ్నసత్యాలను మొహమాటం లేకుండానే కుండ బద్దలు కొట్టి దండోరా వేస్తాడు. కలత నిద్దరల కాంక్షల లోంచి కూడా శృతి చేయని గీతన్నైనా సరే, ఆశల హృదయం గుండా చూడమంటాడు. అగాధాల్లోంచి అగాధాల్లోకి/ విస్ఫోటనాల్లోంచి విస్పోటనాల్లోకి/ కాసింత కన్నీరై కారిపోయే/ రాత్రుల్లోకి దిగబడిన /అనుభవాల పాదుల్లోకి/ మొలకెత్తినప్పుడు/ తగిలే తొలి పిల్ల తెమ్మెరల్లోకి/ నిశ్శబ్దాతి నిశ్శబ్దంగా/ కాల్పనిక మెదడు పొరల్లోంచి/ యదార్థ జీవితపు/ కఠిన శిలల పైకి పరుచుకునేప్పుడు/ బతుకు మృత్యువు అయినప్పుడు/ బతుకులాగే మృత్యువును ప్రేమించాలని చెప్పుకుంటాడు.దాపరికాలు లేని గంభీర పదావిష్కరణలతో, వేదికల అవసరం లేకుండానే తనలో తానే నిశ్శబ్ద విస్ఫోటనమయ్యే కవిత్వ శక్తి చెమన్ సొంతం. ఆ విస్ఫోటనం నుండి ఎగిసిపడే నిప్పురవ్వలు పాఠకులను చాలాకాలం వెంటాడుతాయి. ప్రజా పోరాటాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న క్షేత్రస్థాయి కార్యకర్త కావడం వల్ల ఆయన కవిత్వం మరింత పదునెక్కింది. కవిత్వాన్ని ఒక క్రియాశీలతగా భావించే చెమన్, సాహిత్య స్పృహను సామాజిక-రాజకీయ కార్యాచరణకు జోడించి మనుషులను, సమాజాన్ని అధ్యయనం చేయడం ద్వారా మరింత ప్రభావవంతమైన సాహిత్యాన్ని సృష్టించగలిగారు.

చెమన్ కవిత్వంతో పాటు కథలను, వ్యాసాలను కూడా ఎంతో శిల్ప నైపుణ్యంతో రాస్తారు. గతంలో ఆయన రాసిన 'మౌన విపంచి', 'ఒక మౌనం వెనకాల', 'పద్మప్రియ', 'పడమటి సంధ్య' వంటి కథలు అందమైన ప్రేమ కథలుగా ఉంటే, 'సారా సర్కార్' కథ మాత్రం సారా వ్యాపారంతో పేదల జీవితాలను నాశనం చేసే ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శనాత్మకంగా ఉంటుంది. ఇటీవల వెలువడిన ఆయన 42 కథల సంపుటి "కుమ్మరి కుంటోని కథలు" మునుపటి రచనలకు భిన్నంగా తెలంగాణ గ్రామీణ సంస్కృతిని, సంప్రదాయాలను మరియు అలనాటి బాల్య జ్ఞాపకాలను కళ్లకు కట్టినట్లు ఆవిష్కరిస్తుంది. ప్రతి కథలోనూ పాఠకుడు భాగమైపోయేలా తాదాత్మ్యత చెందించడం ఆయన ప్రత్యేక నేర్పరితనం. మూడేళ్ల వయసులోని అమాయక బాల్యం నుండి తిరుగుబాట్లు, పోరాటాల వరకు తెలంగాణ చరిత్రను చెమన్ తన కథల ద్వారా అద్భుతంగా రికార్డు చేశారు. ఇవి కేవలం పల్లెటూరి బాల్యపు కథలు మాత్రమే కాకుండా, తెలంగాణ సమాజ సమిష్టి సాంస్కృతిక పరిణామ క్రమాన్ని నమోదు చేసే చారిత్రక ధ్వనిలా నిలుస్తాయి.

ఎలాంటి కాల్పనికతలకు చోటు లేకుండా, యథార్థ పాత్రలతో తాను చూసిన, అనుభవించిన కాలాన్ని ఆయన కళ్లకు కట్టారు. గ్రామీణ ఆటలు, పండుగలు, చేనులు, నాటకాలు, ఈత బావులు, గుట్టలు, వాగులు వంటి సమస్త గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబిస్తూ, పాఠకులను వారి స్వంత బాల్యంలోకి తీసుకువెళ్లి విషాదాలను, ఆకలిని, బతుకు పోరాటాలను కళ్ళముందు దృశ్యమానం చేస్తారు. కవిత్వంతో పాటు చెమన్ రాసే గద్య రచనలు (ప్రోజ్) కూడా అంతే ఆసక్తికరంగా, గొప్ప శైలితో ఆసాంతం చదివిించేలా ఉంటాయి. సాహిత్య వ్యాసాల నుండి వైద్య రంగం వరకు పలు అంశాలపై ఆయన వ్యాసాలు రాశారు. ఒక మంచి పుస్తకం, కవి గురించి, గులాం అలీ, మహేంద్ర కపూర్, జగజ్జీత్ సింగ్, సజ్జద్ అలీ వంటి గాయకుల గురించి, సి. రామచంద్ర వంటి సంగీత దర్శకుల గురించి మరియు చెహోవ్, అలెగ్జాండర్ కుప్రిన్, దోస్తోవ్‌స్కీ, లియో టాల్‌స్టాయ్, మాక్సిం గోర్కీ వంటి ప్రముఖుల గురించి ఆయన రాసిన వ్యాసాలు పాఠకులను ఒక అందమైన పూలవనంలో విహరించిన అనుభూతిని కలిగిస్తాయి.


కరోనా కాలంలో కోవిడ్ గురించి రాసినప్పటికీ, సమాచారాన్ని అందించడంలో ఆయన వ్యాస రచనా శైలి పాఠకులను ఆసాంతం ఆకట్టుకుంటుంది. రాసేది తక్కువైనా, ఎక్కువ లెక్కలు, గణాంకాలు ఆయన విషయంలో ఉండవు; ఎందుకంటే ఆయన కీర్తి కాంక్షల ఫలాపేక్ష లేని నిస్వార్థ అక్షర సేద్యకుడు. తనది వెలుగు-చీకట్ల మధ్య విచ్చుకోలేని సంగీత ధ్వని అని ఆయన సరిపెట్టుకున్నప్పటికీ, ఆ సంగీత ధ్వనిని ఎంతోమంది సాహిత్య అభిమానులు ఆస్వాదించి వింటారు. కలలు పేలిపోయిన నిశ్శబ్ద ఒంటరితనాల మూలల్లోకి ఒక గాయమై ఆయన సృష్టించిన ప్రతి గేయం అత్యంత గాఢమైన కొత్త సంగీత ధ్వని. (నవంబర్ 3 వ తేదీన చెమన్ కు మల్లావజ్ఞుల సదాశివుడు స్మారక పురస్కారం ప్రధానం చేస్తున్న సందర్భంగా)


సీహెచ్.ఉషారాణి 9441228142

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్