సాహిత్య సమావేశాల్లో కవులు తమ కవితలు చదువుతారు. కథకులు తమ కథల గురించి మాట్లాడతారు. వక్తలు సాహిత్య ధోరణులను వివరిస్తారు. సభ ముగిసిన తర్వాత ఎవరి రచనలతో వారు తిరిగి వెళ్తారు. కానీ ఒక రచయిత మరో రచయిత రాసిన కవితను చదివి, అందులోని లోటుపాట్లను ఎత్తిచూపితే? తనకు నచ్చిన కవితలోని ప్రత్యేకతను వివరించాల్సి వస్తే? రచయిత పేరును పక్కనపెట్టి కేవలం రచనను మాత్రమే ముందుంచి మాట్లాడితే? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికిన సమావేశం నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో జరిగింది. అక్టోబర్ 24, 25 తేదీల్లో తెలంగాణ సాహితీ నిర్వహించిన యూత్ లిటరరీ ఫెస్ట్ కొత్తతరం రచయితల మధ్య ఒక భిన్నమైన చర్చకు వేదికైంది.
తెలంగాణలోని వివిధ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి యువ కవులు, కథకులు ఈ ఉత్సవానికి వచ్చారు. కవిత్వం, కథ, పాటలతో రెండు రోజులూ బుద్ధవనం సందడిగా కనిపించింది. ప్రారంభ సమావేశానికి నర్రా ప్రవీణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రొఫెసర్ బెల్లి యాదయ్య, కె. ఆనందాచారి, తగుళ్ళ గోపాల్, కె. సలీమా, కుడికాల గోవర్ధన్, దాసరి శ్రీరాములు పాల్గొన్నారు. వివేక్ ఎండ్లూరి ఆహ్వానం పలకగా, బురుగు గోపికృష్ణ వందన సమర్పణ చేశారు.
ప్రొఫెసర్ బెల్లి యాదయ్య యువత సామాజిక బాధ్యతను గుర్తుచేశారు. సమాజంలోని అసమానతలు, వైరుధ్యాలు కవిత్వంలో ప్రతిఫలించాలని, ప్రశ్నించే గొంతుకగా కూడా కవిత్వం నిలవాలని ఆయన తెలిపారు. అయితే ఒక సమస్యను కవితలో ప్రస్తావించడమే కవిత్వం అయిపోదు. ఆ సమస్యను కవిత్వం తనదైన కళాత్మక రూపంలోకి మలచుకోవాలి. సామాజిక ఆలోచనకు కవితా నిర్మాణం తోడైనప్పుడే రచన పాఠకుడిని చేరుతుందనేది ఆయన మాటల్లో స్పష్టమైంది. తగుళ్ళ గోపాల్ కవిత్వంలోని భాష, నిర్మాణం గురించి మాట్లాడారు. కవులు, కథకులు ఇతర సాహిత్య ప్రక్రియలను కూడా చదవాలని సూచించారు. సాధారణమైన వాక్యాన్ని కవిత్వంగా మార్చగలగడమే కవి ప్రతిభకు గీటురాయి.
పదాలను విడగొట్టి రాయడం, వాక్యాలను చిన్నచిన్న ముక్కలుగా పేర్చడం మాత్రమే కవిత్వం కాదని చెప్పారు. ఒక సాధారణ వాక్యం పాఠకుడికి కొత్త అనుభూతిని కలిగించినప్పుడు, దాని వెనుక కొత్త అర్థం కనిపించినప్పుడు అది కవిత్వంగా మారుతుందని వివరించారు. కవితకు శీర్షిక పెట్టడంలోనూ కవి చూపించే శ్రద్ధను ఆయన ప్రస్తావించారు. తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి ఈ సాహిత్యోత్సవ లక్ష్యాన్ని స్పష్టం చేశారు. అది తరువాతి సెషన్స్ నడవడానికి ఒక ప్రేరణగా నిలిచింది.
ఈ ఉత్సవంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి ‘కవితా కేఫ్’, ‘కథా వైబ్స్’ కార్యక్రమాలు. పేర్ల రాము అధ్యక్షతన, వేల్పుల మహేశ్ సమన్వయంలో జరిగిన ‘కవితా కేఫ్’లో పల్లిపట్టు నాగరాజు, నాగిళ్ల రమేశ్, స్వప్న కొండమడుగు, సందీప్ వొటారికారి, సలీం కందికొండ, సిద్ధార్థ కట్ట పాల్గొన్నారు. వారికి ఏడు కవితలను అందించారు. అయితే ఆ కవితలు ఎవరు రాశారో చెప్పలేదు. అలా కవి పేరు తెలియని కవితను చదివి, దాని వస్తువు ఏమిటి? భావం ఎంతవరకు పలికింది? భాషలోని ప్రత్యేకత ఏమిటి? శిల్పం ఎక్కడ బలంగా ఉంది? ఎక్కడ బలహీనపడింది? అనే అంశాలపై చర్చించారు.
రచయిత పేరు తెలియకుండా కవితలను చదివించడం వల్ల వాటిని ఎలాంటి ముందస్తు అంచనాలు లేకుండా పరిశీలించే అవకాశం ఏర్పడింది. సాధారణంగా పేరున్న రచయితల రచనలను చదివేటప్పుడు వారి సాహిత్య ప్రతిష్ఠ కూడా మన అంచనాలను ప్రభావితం చేస్తుంటుంది. ఆ గౌరవంతో కొన్ని లోపాలను పట్టించుకోకపోవచ్చు. కొత్తగా రాసేవారి రచనల విషయంలోనూ కొన్నిసార్లు అంతటి శ్రద్ధ కనిపించదు. ఇక్కడ రచయితల పేర్లకు బదులు కవితలకే ప్రాధాన్యం ఇవ్వడంతో ఎవరు రాశారనే విషయం కంటే, కవితలో ఏముందనే అంశంపై చర్చ కేంద్రీకృతమైంది.
కవితలపై జరిగిన చర్చలో నచ్చిందని చెప్పడంతోనే ఎవరూ ఆగిపోలేదు. తమకు నచ్చిన పంక్తుల వెనుక ఉన్న ప్రత్యేకతను, నచ్చని చోట కనిపించిన పరిమితులను వివరించారు. కొన్ని సందర్భాల్లో ఒకరి అభిప్రాయంతో మరొకరు విభేదించారు. ఆ విభేదాలకు కూడా కవితలోని పంక్తులనే ఆధారంగా చూపించారు. ఒక రూపకం భావాన్ని ఎంతవరకు పలికించింది, పదాల ఎంపిక కవితా వస్తువుకు ఎంతవరకు సరిపోయింది అనే అంశాలపై మాట్లాడుకున్నారు. ఇలా కవితను కేవలం ఆస్వాదించడానికే కాకుండా, దానిలోని బలాబలాలను గుర్తిస్తూ చదివే ప్రయత్నం ఈ కార్యక్రమంలో కనిపించింది.
కథల కోసం ఏర్పాటు చేసిన ‘కథా వైబ్స్’లోనూ ఇదే పద్ధతిని అనుసరించారు.
సాయి వంశీ అధ్యక్షతన, తేజ గుడికందుల సమన్వయంలో జరిగిన 'కథా వైబ్స్' ఈ కార్యక్రమంలో రాజీఖన్నా, పెద్దపల్లి తేజశ్విని, కె.వి. మేఘనాథ్ రెడ్డి, దినేష్, కవనమాలి, రామ్ పెరుమాండ్ల, రవీంద్ర రావెళ్ల, కె.పి. లక్ష్మీనరసింహ, ముక్కామల జానకీరామ్, క్రాంతి శివరాత్రి, సి.పి. గ్రేస్, ఆశ్రిత రెడ్డి, సందీప్, భాను ప్రసాద్, భానుచందర్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో కథ ఇచ్చారు. కథ రాసినవారి పేరు చెప్పలేదు. కథ చదివిన తర్వాత కథావస్తువు, పాత్రలు, కథనం, ముగింపు గురించి చర్చించారు.
కథలో జరిగిన సంఘటనలను మళ్లీ చెప్పడం దగ్గరే ఆగిపోకుండా, పాత్రల ప్రవర్తన వెనుక ఉన్న పరిస్థితులను కూడా పరిశీలించారు. ఒక పాత్ర అలా ఎందుకు ప్రవర్తించింది? రచయిత ఆ సంఘటనను కథలో ఎందుకు తీసుకొచ్చాడు? అది కథలోని సంఘర్షణకు ఎంతవరకు ఉపయోగపడింది? ఇలాంటి ప్రశ్నలు చర్చలోకి వచ్చాయి. కథలోని పాత్రలను వాటి సామాజిక నేపథ్యం నుంచి వేరు చేసి చూడలేం. అలాగే కథలో ఒక సంఘటన ఉండటం కంటే, అది కథకు ఎంత అవసరమో తెలుసుకోవడం ముఖ్యం. ఈ విషయాలపై యువ రచయితలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఈ చర్చలకు ప్రముఖ విమర్శకులు ఆర్. సీతారాం, బి.వి.ఎన్. స్వామి పరిశీలకులుగా ఉన్నారు. కవితలపై మాట్లాడిన ఆర్. సీతారాం కవిత్వానికీ జీవితానుభవానికీ ఉన్న సంబంధాన్ని వివరించారు.
భావోద్వేగ అనుభవాల నుంచే కవిత్వం పుడుతుందని, ఒకే కవితను వేర్వేరు పాఠకులు తమ అనుభవాల ఆధారంగా వేర్వేరుగా అర్థం చేసుకోవచ్చని చెప్పారు. అయితే పాఠకుడి అనుభవం ఒక్కటే కవితకు అర్థం కాదని, కవితలోని పదాలు, రూపకాలు, నిర్మాణం కూడా ఆ అర్థాన్ని నిర్దేశిస్తాయని గుర్తుచేశారు. పాఠకుడి అనుభవానికీ, కవితలోని అభివ్యక్తికీ మధ్య ఉండే సంబంధాన్ని ఆయన వివరించారు.
బి.వి.ఎన్. స్వామి కథలపై జరిగిన చర్చలో కథావస్తువు, పాత్రల నిర్మాణం, కథనశైలి వంటి అంశాలను విశ్లేషించారు. ఒక సంఘటనను చెప్పడం వేరు, దాన్ని కథగా మలచడం వేరు. సంఘటనకు కథలో ఒక ప్రయోజనం ఉండాలి. పాత్రలు సహజంగా ఉండాలి. వాటి మధ్య సంఘర్షణ కథను నడిపించాలి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని యువ రచయితల విశ్లేషణలను ఆయన పరిశీలించి, అవసరమైన చోట సూచనలు చేశారు.
యూత్ లిటరరీ ఫెస్ట్ నిజంగా యువత తోనే జరిగింది. ఇక్కడ యువత కేవలం శ్రోత ఎంతమాత్రమూ కాదు. వారే వక్తలు ... రెండు రోజుల కార్యక్రమంలో చర్చలే కాకుండా పాటలు, కవితా పఠనాలు కూడా జరిగాయి. నాగార్జునసాగర్‌లో లాంచీ ప్రయాణం ఈ సమావేశానికి మరో ప్రత్యేకతను చేర్చింది.
లాంచీలో కవితా పఠనం మరో అదనపు సొగభు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన కవులు, కథకులు తమ రచనల గురించి, సాహిత్య అనుభవాల గురించి పరస్పరం మాట్లాడుకునే అవకాశం దొరికింది. వచ్చినవారికి వసతి, భోజన ఏర్పాట్లలో నిర్వాహకులు మంచి శ్రద్ధ తీసుకున్నారు. మోహన్ కృష్ణ అనంతోజు, ఫోటోగ్రాఫర్ మయూర్‌తోపాటు నిర్వాహకులు, వాలంటీర్లు కార్యక్రమం సజావుగా సాగేందుకు కృషి చేశారు.
ముగింపు సభలో మోహన్ కృష్ణ అనంతోజు ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రకటించారు. ఇకపై కవిత్వంతోపాటు కథకు సంబంధించిన సమావేశాలను కూడా తెలంగాణ సాహితీ నిర్వహిస్తుందని, బుద్ధవనంలో జరిగిన కవితలు, కథల విశ్లేషణలను పుస్తకరూపంలో తీసుకొస్తామని తెలిపారు. సాహిత్య సమావేశాల్లో ఎన్నో చర్చలు జరుగుతుంటాయి. సభ ముగిసిన తర్వాత వాటిలో చాలావరకు అక్కడితోనే ఆగిపోతాయి. ఎవరు ఏ రచనపై ఏమన్నారు, ఏ అంశంపై ఏకీభవించారు, ఎక్కడ విభేదించారు అన్నది కొంతకాలానికి గుర్తుండకపోవచ్చు. ఈ చర్చలను పుస్తకంగా తీసుకురావాలనే ఆలోచన వల్ల ఆ రోజు జరిగిన సంభాషణలు, వాటి ద్వారా వచ్చిన ఆలోచనలు భద్రంగా ఉంటాయి.
సాహిత్యంలో రాసినదాన్ని తిరిగి చదవడం ఎంతో ముఖ్యం. బుద్ధవనంలో జరిగిన సాహిత్య కచ్చీరు యువ రచయితలకు పరస్పర పఠనం, విమర్శ ద్వారా మంచి అనుభవాన్ని అందించింది. ఈ చర్చలు కేవలం ఒక కార్యక్రమంగా మిగిలిపోకుండా, రచయితల మధ్య ఎప్పుడూ కొనసాగుతూ ఒక మంచి సాహిత్య సంప్రదాయానికి ఆరంభంగా నిలుస్తుంది.
సందీప్ వొటారికారి 9390280093





కామెంట్‌లు (0)