తెలంగాణ ప్రాంతం జానపద, పోరాట సారస్వతానికి పురిటిగడ్డ. ఇక్కడ ఏ మట్టి బిడ్డను పలకరించినా, పుట్టెడు పాటలను పలవరిస్తాడు. అటువంటి ఈ నేల మీద అద్భుతమైన సినీ గీతాలను రచించిన వారు ఎందరో ఉన్నారు. వాళ్లందరినీ ఒకే పూలమాలలో గుదిగుచ్చి సినీ కళామతల్లి మెడలో హారంగా వేసిన ఘనత తెలంగాణ సాహిత్య అకాడమీకి దక్కింది. 'తెలంగాణ సినీకవుల సింగిడి' పేరుతో 300 పేజీల ఉద్గ్రంధాన్ని ప్రచురించింది. నామోజు బాలాచారి కార్యనిర్వాహక సంపాదకత్వంలో తిరునగరి శరత్ చంద్ర రచించిన ఈ పుస్తకం తెలంగాణ జాతి యావత్తు గర్వించదగ్గది.
పుస్తకానికి నామోజు బాలాచారి ముందుమాట రాస్తూ తెలంగాణలో సినీ కవులు ఎదిగిన తీరును అద్భుతంగా ఆవిష్కరించారు. ఆశీరాభినుతి పేరుతో సుద్దాల అశోక్ తేజ సాహిత్య అకాడమీ, గ్రంథకర్త శరత్ చంద్ర కృషిని అభినందించారు.
అస్తిత్వ ప్రేమికులకు అరుదైన నజరానా అంటూ నందిని సిధారెడ్డి రాస్తూ.. తెలుగు సినిమా పాటల వికాసంలో తెలంగాణకవులది విశేషమైన ప్రస్థానం అంటూ ప్రశంసించారు.
ఈ గ్రంథంలో 95 మంది తెలంగాణ సినీ కవుల జీవిత విశేషాలతో పాటు వారు రాసినటువంటి ప్రసిద్ధమైన పాటలను అద్భుతంగా విశ్లేషించారు. తెలుగు సినిమా పాటల రచనకు శ్రీకారం చుట్టిన తొలి తెలుగు సినీ గీత రచయిత చందాల కేశవదాసు మొదలుకొని వర్ధమాన గేయకవులకు స్థానం కల్పించడం, అభినందించదగ్గ విషయం. విడుదలైన సినిమాలో ఒక పాట రాసినా సరే, ఆ రచయిత గురించి చక్కగా రాశారు.
దీనివలన రాబోయే తరాలకు కూడా ప్రోత్సాహం అందించినట్టుగా అనిపించింది. నిజానికి ఇది సంస్కారవంతమైన ఆలోచన.
చందాల కేశవదాసు 1931 లో విడుదలైన భక్త ప్రహ్లాద చిత్రంలో తొలి సినీ గీతాన్ని రాస్తే, ఆచ్చి వేణుగోపాలచార్య 1956 లో ముద్దుబిడ్డ సినిమాలో జానపద బాణీలో ఒక గీతాన్ని రాసి రాణించారు.
ఇక తెలంగాణ సినీ కవుల ఖ్యాతిని పెంచిన అగ్రకవి దాశరధి కృష్ణమాచార్య. 1961లో ఆత్రేయ దర్శకత్వం వహించిన వాగ్దానం చిత్రంలో ''నా కంటి పాపలో నిలిచిపోరా'' పాటతో ప్రారంభించి, తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని చిరస్మరణీయమైన గీతాలను రాశారు.
తెలంగాణలో ఇప్పటివరకు సినిమాకు సంఖ్యాపరంగా ఎక్కువ పాటలు రాసిన కవి సి. నారాయణ రెడ్డి. సినిమా పాటలకు కావ్య గౌరవాన్ని తీసుకొచ్చిన కవి. గీత రచయితగా 'గులేబకావళి కథ' చిత్రంతో ప్రారంభించి అజరామమైన పాటలను రాశారు.
తెలుగు సినిమా ఉన్నంతవరకు సినారె పాటలు చిరంతనంగా వెలుగులీనుతాయి.
వడ్డేపల్లి కృష్ణ సినీ కవిగా కొంత దూరం ప్రయాణించ గలిగారు. 1980లో వచ్చిన పిల్ల జమిందార్ చిత్రం లో మొదటి పాట రాసి, మరికొన్ని మంచి పాటలు రాశారు.
1982లో విడుదలైన రంగుల కల చిత్రంలో భద్రం కొడుకో అనే పాటతో గూడ అంజయ్య తెలుగు ప్రజల గుండెల్లో ఒదిగిపోయారు. అభ్యుదయ కవి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ విప్లవ వీరులు చిత్రంలో అంబరావే పాటను రచించి ఇంకొన్ని పాటలు రాశారు.
శ్రీవేదవ్యాస రంగభట్టర్ 1986 లో విడుదలైన రంగవల్లి సినిమాతో పాటల రచయితగా ప్రవేశించి శ్రీరామదాసు, ఝుమ్మంది నాదం, వెంగమాంబ వంటి 80 చిత్రాలలో పాటలు రాశారు. జెకె భారవి కూడా రంగవల్లి చిత్రంతోనే గీత రచయితగా మారారు.
ఆయన పలు చిత్రాల్లో పాటలు రాసినప్పటికీ ముఖ్యంగా 'ఎ' చిత్రంలోని నా గుండె పగిలింది పది ముక్కలయ్యింది పాట యువత గుండెను తాకింది.
దండోర చిత్రంలో పాటల రచయితగా మొదలైన జయరాజు సింగన్న, దమ్మున్నోడు చీకటి సూర్యులు, అడవిలో అన్న, పీపుల్స్ వార్ వంటి మొదలగు చిత్రాలలో పాటలు రాశారు.
తెలంగాణ సినిమా పాటల ప్రస్థానంలో ఇద్దరి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. 1994 లో వచ్చిన నమస్తే అన్న చిత్రంతో గీత రచయితగా మారి సుమారు 3000 గీతాలను వెండితెరకు అందించిన కవి సుద్దాల అశోక్ తేజ. అలాగే తెలుగు సినిమా పాటకు మూడవ జాతీయ అవార్డును అందించిన ఖ్యాతి కూడా సుద్దాల అశోక్ తేజకు ఉంది. ఒకవైపు సాహితీవేత్తగా, మరొకవైపు సినీ కవిగా సుద్దాల జీవన ప్రస్థానం అద్భుతం అని చెప్పవచ్చు. సినారె తర్వాత ఆ దారిలో ప్రయాణిస్తున్న సాహితీవేత్త అశోక్ తేజ. ఇక చంద్రబోస్ 1995లో విడుదలైన తాజ్ మహల్ చిత్రంలో మంచు కొండల్లోన చంద్రమా అనే పాట రాసి, 3000 పాటల మైలురాయిని దాటారు.
తెలుగు సినిమా పాటకు నాలుగవ జాతీయ పురస్కారాన్ని అందించడమే కాక, ఏకంగా ఆస్కార్ పురస్కారాన్ని తెచ్చి, తెలుగు సినిమా పాటల శక్తిని ప్రపంచానికి చాటారు. తెలుగు సినిమా పాటల ప్రపంచంలో సినారె, సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్ సాధించిన విజయాలు అనన్య సామాన్యం. గంగా యమునా సరస్వతి నదుల అలల స్వరాలుగా ఈ ముగ్గురిని అభివర్ణించవచ్చు.
వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్లలో తర్వాత ఇద్దరు మంచి రచయితలల్లో ఒకరు కందికొండ. రెండవ వ్యక్తి కాసర్ల శ్యామ్. వీరు సంఖ్యాపరంగా ఎక్కువ పాటలు రాశారు. ముఖ్యంగా కాసర్ల శ్యామ్ కలం శరవేగంగా కొనసాగుతుంది. అలాగే తెలుగు సినిమా పాటకు 5వ జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన గౌరవాన్ని కూడా శ్యామ్ అందిపుచ్చుకున్నాడు.
ప్రజా యుద్ధనౌక గద్దర్ 1984లో బి. నర్సింహారావు ప్రోత్సాహంతో వచ్చిన రంగుల కల చిత్రంతో పాటు మరికొన్ని చిత్రాలలో పాటలు రాశారు.
గోరటి వెంకన్న1997లో విడుదలైన ఎన్కౌంటర్ చిత్రంలో మొదటి పాట రాశారు.
ఆ తర్వాత శ్రీరాములయ్య కుబుసం, ఎర్ర సముద్రం, బతుకమ్మ, జై బోలో తెలంగాణ సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాలలో రాశారు.
అందెశ్రీ 1997లో సింగన్న సినిమాతో సినీ పాటల ప్రస్థానం ప్రారంభించి ఊరు మనదిరా, వేగుచుక్కలు, ఎర్ర సముద్రం, పోరు తెలంగాణ, స్వర్ణక్క వంటి చిత్రాలలో మంచి పాటలు రాశారు.
ఆ తర్వాత చాలా పాటలు పాటలు రాసిన రచయితలలో ఘంటాడి కృష్ణ, వరికుప్పల యాదగిరి, తైదల బాపు, వరంగల్ శ్రీనివాస్, కందికొండ, భీమ్స్, చరణ్ అర్జున్, వెంగీ, మాస్టార్జీ, మిట్టపల్లి సురేందర్, అభినయ శ్రీనివాస్, నందిని సిద్ధారెడ్డి, మౌనశ్రీ మల్లిక్, కృష్ణకాంత్, పూర్ణాచారి, తిరునగరి శరత్ చంద్ర, బండి సత్యం గురించి రాసిన వ్యాసాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కవుల పాటల ప్రస్థానాన్ని గురించి మాత్రమే కాకుండా, వారి జీవన ప్రస్తానానికి చోటు కల్పించడం వలన భావితరాలకు ఈ సమాచారం తెలిసే అవకాశం ఉంది.
అయితే ఈ పుస్తకంలో ఒక్క పాట రాసిన రచయితకు కూడా స్థానం కల్పించడం విశేషం.
అందులో సుద్దాల హనుమంతు, కేసీఆర్, ప్రభు వంటి వారు మరికొందరు కూడా ఉన్నారు.
ఇందులో 95 మంది కవుల జీవితం, పాటల ప్రస్థానాన్ని కూలంకశంగా వివరించారు.
గతంలో తెలంగాణ సినీ గేయ కవుల చరిత్ర పేరుతో కందికొండ ఆధ్వర్యంలో అకాడమీ తప్పులతడకగా ఒక పుస్తకాన్ని ప్రచురించింది. అందులో తెలంగాణలో పుట్టి అద్భుతమైన సినీ గీతాలు రాసిన చాలామంది రచయితల పేర్లను విస్మరించింది. ఆ పుస్తకం చాలా విమర్శలను ఎదుర్కొంది. కానీ ఈ పుస్తకం చాలా మటుకు అర్హులైన అందరికీ స్థానం కల్పించాలనే స్పృహతో ప్రచురించారు.
ఈ రచన తెలంగాణకే గర్వకారణంగా చెప్పుకునే విధంగా తీసుకువచ్చారు.
రచయితకు, ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న అకాడమీ కార్యదర్శి బాలాచారికి, తెలంగాణ సాహిత్య అకాడమీకి, ప్రభుత్వానికి అభినందనలు.
(16వ తేదీ సా. 5 గంటలకు, తెలంగాణ సారస్వత పరిషత్తులో గ్రంథావిష్కరణ జరుగుతున్న సందర్భంగా..)
మౌనశ్రీ మల్లిక్, 8919338546







కామెంట్లు (0)