Magazines

Identity

15 నవంబర్, 2026

Identity
avatar
balaji

ప్రచురించబడింది నవం 15, 2026 | 1 నిమిషాల చదవడం

ఆమె ఎక్కడో పెట్టి

తానే మర్చిపోయినట్టుంది…

ఎవరికైనా దొరికితే

ఆమెకు అందించండి—

అది ఒక వస్తువు కాదు,

ఆమెగా మిగిలిన

చివరి ఆనవాలు.

బహుశా…

గిన్నెలు కడిగిన నీటితో పాటు

చేతుల మీద నుంచి జారిపోయిన

ఆమె చిన్న చిన్న కలలు కూడా

కొట్టుకుపోయాయేమో…

లేదా…

పిల్లల భవిష్యత్తును

తీర్చిదిద్దే హడావిడిలో

తన వర్తమానాన్ని

ఎక్కడో అట్టడుగున

పడేసిందేమో…

లేదా…

ఇంటిని చక్కదిద్దే క్రమంలో

తనలోని గజిబిజిని

చక్కదిద్దుకోవడం మర్చిపోయిందేమో…

రోజూ పిలిచే పేర్ల మధ్య—

“అమ్మ…”

“భార్య…”

“కోడలు…”

“ఫలానా వారి మనిషి…”

అని తనను తాను పరిచయం చేసుకుంటూ,

ఒకరోజు

తన పేరునే

తానే వినడం మర్చిపోయిందేమో…

అందరి జీవితాల్లో

ఒక పాత్రగా నిలుస్తూ,

తన జీవితంలో మాత్రం

తానే ఒక ప్రేక్షకురాలైపోయిందేమో…

ఎప్పుడో ఒకరోజు

అద్దం ముందు నిలబడి

“నేను ఎవరు?” అని అడిగితే—

అద్దం కూడా

ఆమెకు తెలిసిన

అన్ని పేర్లనే చూపించిందేమో…

ఆమెను ఎక్కడో వెతకకండి…

ఆమె తనలోనే ఎక్కడో

తప్పిపోయి ఉంది.


బహుశా…

ఇప్పుడు ఆమెకు కావాల్సింది

తనను తాను

మళ్లీ కనుగొనడమే...


ప్రియాంక వజ్రాల

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్