నిలువెత్తు కావురం
రూపు కట్టిన యవ్వారం
చూపంతా చూరు మీదనే..
రెపరెపలాడిచ్చుకునే ఇమాకతు.
మెత్తన గాళ్లను కూడగట్టిన ఇకుమతు.
ఎక్కి ఏలుకుంటవేమో గానీ
ఏలనిచ్చిన మంద కళ్ళల్ల
ఆశ నెవరు నిలబెట్టాలె...
చాలు
మబ్బుల్ల నీళ్లు జూపి
ముంత ఒలకబోసిన ముచ్చట చాలు.
గాలి ముంతను మెడకు కట్టి
తాగు తాగు మంటే
దూపెట్ల తీరాలె...
బాయిని నమ్మకుమంటివి
తవ్వుకున్న చెరువుకు తూటు వెడితివి పారేది నదే అయినా
పారనియ్యని నిర్వాకం
గొలుక గోస తీర్చదు.
అరక అక్కెర తీర్చదు.
కత్తి దూసింది ఎవరిమీద
కైగట్టింది ఎవరి మీద.
ఏది నిలవడ్డది
ఎవరి కట్టం గడ్డకు వడ్డది.
ఎవుసం భరోసా దూలానికి
ఉరేసుకుంది.
అందిన కాడికి మింగే యావ
దొరికింది దొరికినట్టు దోచి
తిలా పాపం తలాపిడికెడు..
ముల్లె కట్టిన ముడుపును
గాలి మోటరెక్కిచ్చి
గాయి గానికి నైవేద్యం పెట్టుడు.
మరి గత్తరేట్ల పోవాలె.
గావరెట్ల తగ్గాలె.
కరువెందుకంటే
గాలి తూర్పారాలో
తాలే మిగిలిందంటవు.
నిన్నటి అనుభవం
శూన్యమంటవు.
పేను పెత్తనమై
తల గొరిగే లక్ష్యానికి
ఉల్లెక్కాలే విత్తనాలు.
ఉత్తుత్త హామీల నీడలోనే
నాటుకునే పెత్తనాలు.
చాటుకునే మాటకూ
చోటైన అవినీతికీ మధ్య
సత్యం వెలిసిపోతున్న బతుకంత.
సంబరం మలిగిపోతున్న వెలుగంత.
వఝల శివకుమార్,
9441883210
ఉల్లెక్కాల విత్తనాలు
15 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 15, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)