Magazines

కాళోజి బాటలో ‘ఉదారి’ కవిత్వం!

15 నవంబర్, 2026

Udari’s
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 4 నిమిషాల చదవడం

వేల భావాల మనోగీతపు వెలుగు. అక్షలసత్యాలని కలం నిండా నింపుకొని నిరంతరం వికసిస్తూ, ప్రశ్నిస్తూ, బతుకు గీతాల్ని చదివిస్తూ, పీడితుల పాలిట భరోసాగీతమై వెలుగుతుంది. భాషకందని భావాలే కాదు జీవిత సత్యాలను ఇంకించుకుంటు కదులుతు, కదిలిస్తు సాగిపోతుంది. కవిత్వానికి నిశ్శబ్ద వారసులు అక్షరాలు. ఆ అక్షరాలలో నిజాయితి, ప్రశ్న, ధిక్కారం ఎదురుగీతలు ఒదిగించుకున్నవాళ్లు కొందరే... ఆ కొందరిలో కాళన్న సదా మన యాదిలోనే వుంటాడు. ఆయన మన మధ్య లేకున్నా ఆయన నూరిపోసిన అక్షర ధైర్యం, జాతి పట్ల గౌరవం ఇంకా నరనరాల్లో ప్రవహిస్తుంది. కవిత్వపు స్వచ్చతని మాండలికపు సొగసుని అద్దుకుని కాళోజీ కవిత్వ భావాలకు దగ్గరగా వున్న కవులకు ప్రతియేటా కాళోజీ పురస్కారం అందిస్తున్నారు. ఈ యేడాది ఆదిలాబాద్ కు చెందిన కవి డా.ఉదారినారాయణని ఈ పురస్కారానికి ఎంపిక చేయడం ఆదిలాబాద్‌‌కి గర్వకారణం... ఆకుపచ్చని ఎడారి, యాల్లైంది ఎల్గడి (జిల్లా కవిత సంకలనం), మాగి పొద్దు, అరుగు మీద ముచ్చట, ఆదిలాబాద్ సాహిత్య సంకలనం, ఆదిలాబాద్ నానీలు,మళ్లీ మనిషిలోకి,యాపచెట్టుకాడ ఈయన పుస్తకాలు.

ప్రతి కవితా సంపుటిలో మానవత్వం పరిమలించడమే కాదు.మాండలికానికి జీవం, పల్లెభాష సుగంధమంతా ఒదిగింది‌‌. చెప్పవలసిన అంశం స్పష్టత, ఎంచుకున్న అంశంపై తనధైన ధోరణిలో అక్షరాల్ని కలపడంలో తనదైన ముద్ర వేసుకున్నాడు... ఈయన రాసిన మొదటి కవిత సంపుటి "ఆకుపచ్చని ఎడారికి" కాళోజీ ముందుమాట రాసిండంటే ఆ కవిత్వం గొప్పతనం మనం గుర్తించక తప్పదు కదా‌... కవిత్వం రాయడమే గొప్ప అనుకోవడం తప్పు...రాసే వాళ్లని ప్రోత్సహించడం, వేదికలు తయారు చేసి రాసే‌వాళ్లని వెన్నుతట్టడం చాలా గొప్పపని‌‌.. ఈయన కవిత్వ ప్రయాణం మొదలైన నుండి ఈయన వేలుపట్టి సాహితిలోకంలోనడిచిన మొగ్గలు ఇపుడు వికసిస్తున్నాయి. అక్షర పరిమళాలను వెదజల్లుతూ.. ఇప్పుడు కూడా ఐత్యారం ముచ్చట్లు అనే ఒక సాహితి వేదికను నడుపుతు ఎందరో యువకళాలకు మార్గనిర్దేశనం చేస్తున్నాడు. ఇతని కవిత్వంలో చాలా భావాలు మిలితమయ్యాయి.

ఈకవి ప్రశ్నిస్తాడు, కొన్ని చోట్ల బదులిస్తాడు.... ఒక్కో సారి ఓదార్పు గీతానికి పదాలల్లుతాడు... మనిషి చుట్టే తన కవిత్వయాత్ర చేస్తాడు... అంతిమంగా ఏ అక్షరమైన కోరేది మార్పే కదా... ఆ మార్పుకి శ్రీకారం చుడుతూ పరుగెడుతాడు...ఇతని కవిత్వాన్ని దగ్గరగా చూద్దామా‌మరి... యాల్లైంధి కవిత సంపుటిలో తన కవిత భావజాలం ఇలా.. ‘‘ఇపుడు తెలంగాణ/ పరుగు పందెనికి సన్నద్దమైన/ వీరుని చూపులా వుంది.../ వదలడానికి గుంజి పుట్టిన బాణంలా వుంది/ నదులు, వాగులు, చెరువులు లోలోనే ఉద్యమాన్ని/ రిహార్సల్స్ చేస్తున్నాయి/ కొండలు, అడవులు సిగలు ముడిచి విజయాన్ని కడసారి బేరీజు వేస్తున్నాయి ’’(యాల్లైంది కవిత) మన అస్థిత్వం కోసం చేసిన పోరాట గీతం ఈ అక్షరస్వరం కవితలో ఒదిగిపోయింది. సహజత్వం ప్రాంతంపై మమకారం మది వేసే ప్రశ్నలకి మూలం ఈ కవిత... కవిత్వం ఎవరి పక్షం ఎవరికోసం అంటే వేల సమాధానాలుచిక్కుతాయి. కాని మనసున్న కవి రాసే అక్షరాలు అన్ని కదిలించేవే..పీడితులగళమై వెలిగి కదిలించాడు కవి ఈ కవిత పాదాలు చూస్తే అర్థమైతుంది.

‘‘ఎండిన డొక్కలు ఆకలి దరువు లేస్తున్నా/ అలిసిన రెప్పలు నీడలు వెతుకుతున్నా/ భుజాలపై మినుకు,మినుకు కాంతులు పిల్లలు/ చంకలో ఎడవిల్లడు/ చేతుల్లో వజ్రాల బాసండ్లు లాగుకుంటూ/ కంపెని తాళానికి టాటాచెప్పి వాళ్లు బయలు దేరారు/ దేశమే వలసపోతున్నట్లు/ ప్రజాస్వామ్యమే దుఃఖనదిలా పొంగినట్లు’’. (ఎవరి మనుషులు వీళ్లుకవిత). ప్రజాస్వామ్యమే దుఖనదిలా పోంగినట్లు ఎంతటి భావోద్వేగం ఆర్థత.. నిజంగా మనిషి బతుకు బడిలో ఎన్ని చిత్రాలో. కరోనా కాలం ఎందరో బతుకులకి కొత్త పరీక్ష పెట్టింది‌‌... శ్రామిక జీవన శ్రమగీతపు సుగంధమంతా ఆ అక్షరాలలో మిలితమైంది... ఇదే కదా నిజమైన కవితా లక్షణం... బాధని, సంతోషాన్ని పంచుకోవడం అంటే సాటి మనిషి పట్ల నీకు ఓ సామాజిక బాధ్యతుందని గుర్తు చేయడమే... నిజమైన కవికుండే మొదటి లక్షణం స్పందన ‘‘కైతలతాతను యాజ్జేసుకుంటే/ కుతికెలొ తండ్లాడుతున్న ఊపిరి/ ఒక్కసారి లేచి నినదిస్తుంది/ ఏది తనది అనుకోలేదు/ ఇది నాది అని భ్రమిసిపోలేదు/ చూపున్నంతకాలం/ మన చూపుల్ని జల్లెడపట్టి/ జాగృతి చేసినోడు’’(తాతను యాజ్జేసుకుంటే కవిత ) కాళోజీ మీద రాసిన కవిత ఇది...

మాండలిక పరిమళాలే కాదు ఆయన వ్యక్తిత్వానికి అక్షర నీరాజనం ఈ కవిత... మన చూపుల్ని జల్లెడ పట్టి జాగృతి చేసినోడు ఎంత గొప్పదనం ఒదిగిపోయింది ఆ పదంలో... ఊపిరి నినదిస్తుంది అని కలిపిన అక్షరం కాళోజినే కనులముందుచింది‌. ఎంత పరిగెత్తిన ఒక సారి మదిని ప్రశ్నించుకుంటే వాస్తవానికి నేను ఎవరని అనే ప్రశ్న మొదలవుతుంది..ఆ ప్రశ్నకి బదులు అంతర్మధన గూటిలో చిక్కవచ్చు. చిక్కకపోవచ్చు. అదే కోవలో కొన్ని అక్షరాలు మనలో విశాల తత్వానికి బీజమేస్తాయి‌. అందులోఈ కవిత.. ‘‘నిన్ను కాల్చే కట్టెలకొరకు గొడ్డలినేనే/ నీ శవయాత్రకు ముందుండి నడిచే/ కుమ్మరి కుండను నేనే/ నీ పగలెత్తు అలసటని నిద్రలోకి వంపే/ గౌండ్ల మల్లేషు కల్లు బుంగను నేనే/ నా చూపు ఓక కళాఖండం,/ నా ఆలోచనలు అద్బుత ఆవిష్కరణ/ నా నడకే మహా సృజనాత్మక ప్రయాణం/ నా శక్తిని ఎవడు ఆపలేడు/ నా విద్వత్తును ఎవ్వడు అందుకోలేడు/ నేను నిఖార్సయిన పురజనున్నీ,/ సృష్టి కే బహుజనున్ని...’’(అనేకాలుగా నేను అనే కవిత) వాక్య పరిణితి,పదంలో లోతైన విశ్లేషణ అక్షర సత్యాలని నిగూడపరిచి జీవిత సత్యాన్ని నింపుకున్నది ఈ కవిత సమానత్వగీతిక....

ఇలా ఎన్నో కవితలు, వ్యాసాలు, కథలు, కథానికలు, నానీలు, నాటికలు సామాజిక వ్యంగ కథనాలు, ముఖాముఖిలు, రేడియో ప్రసంగాలు, తన కలంనుండి వెలువడినాయి, అన్నింటిలో కూడా మాండలికం ఉట్టిపడింది. ప్రధానంగా మన మూలాలు మరవకూడదనే గట్టి ప్రయత్నం తన అక్షరాలలో ఒదిగింది. కనుమరుగవుతున్న భాషను బ్రతికించే వాళ్లు కొందరు. ఆ కొందరిలో ఇతనిది ప్రత్యేక స్థానం. కాళోజీ రాసిన కవిత్వపు పసనంతా నింపుకొని తనదైన శైలిలో వెలిగిండు ఉదారి‌. ఈయన రాసిన పుస్తకాలలో ప్రాంతీయ భాషని కలం నిండా నింపుకొని, సామాజిక బాధ్యతంతా అక్షరాలలో ఒదిగించుకోని మనిషిని మనిషిగా చూడమని వేడుకుంది.నిరాశని తరిమే ప్రేరణగీతమయింది. భాదితుడికి నేనున్నానని భరోసా నిచ్చింది. శ్రమగీతమై శృతికలిపింది‌... ఎన్నో భావాల పూలతోటగా వికసించింది‌‌... అందుకే ఆయన కలానికి కాళోజీ పురస్కారం వరించింది... మొట్టమొదటగా కాళోజీ పురస్కారం ఆదిలాబాద్ ప్రముఖకవి, రచయిత సదాశివ మాష్టారుని వరించింది.

మళ్లీ ఉదారి నారాయణను ఈ పురస్కారం వరించడం గర్వించదగ్గ విషయం.. మా మట్టిగంధాలు నలుదిశలా వ్యాపించడం చాలా హర్షించదగ్గవిషయం. ఇంతే సామాజిక బాధ్యతతో మరెన్నో కవిత సంపుటాలతో చైతన్యాన్ని స్పురింపజేస్తు సమసమాజ స్థాపనలో మరింత ఉత్సుకతతో ముందుకు సాగాలని కోరుకుంటు పురస్కారగ్రహితకు అభినందనలు తెలుపుతు.. (2026 సంవత్సరానికి కాళోజి నారాయణ రావు స్మారక అవార్డును అందుకుంటున్న సందర్బంగా).

సాయిప్రియకొండ



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్