- Advertisement -
- – మెజారిటీ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి
– మళ్లీ కెసిఆరే కావాలంటున్న ప్రజలు
– మన కృష్ణ , గోదావరి నది జలాలను ఆంధ్రాకు ధారాదత్తం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి
– నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
నవతెలంగాణ – తిమ్మాజిపేట - తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అని పార్టీ కార్యకర్తలందరూ ఐక్యమత్యంగా ఉండి ఎన్నికలకు సిద్ధం కావాలని నాగర్ కర్నూల్ మాజీ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. నాడు తెలంగాణ కోసం ప్రత్యేక ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అనీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్ని విధాలుగా మన రాష్ట్రాన్ని దేశంలోని అగ్రగామిగా నిలిపారని గుర్తు చేశారు.
- నా రాజకీయ జీవితంలో కష్టసుఖాల్లో నాకు తోడ్పాటునందిస్తున్న వారిని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని మాట ఇస్తూన్న పార్టీలో ఉండి అడ్డదారులు తొక్కే అవకాశ వాదులను గుర్తు పెట్టుకుంటానని అన్నారు. ఎవరి లెక్కలు వాళ్లకు అప్పజెప్పేందుకు మీరందరూ సహకరించాలని అన్నారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావలసిన సందర్భం వచ్చిందని సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, వార్డు సభ్యులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంత ఘోరంగా విఫలమైందో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగట్టాలి. గత సంవత్సరం కేంద్రం నుంచి గాని, రాష్ట్రం నుంచి గాని గ్రామాలకు ఒక్క పైసా ఇవ్వలేదు ఏం పని చేశారని కాంగ్రెస్, బీజేపీ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు.
- గ్రామాల్లో ఉన్న సమస్యలను వారు ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు, అలాంటి పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి అవకాశమిస్తే అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే బీజేపీ నాయకులు ఎందుకు స్పందిస్తున్నారో అర్థం కావడం లేదు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందే అని ఆ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ పెట్టే అక్రమ కేసులకు అరాస్మెంట్లకు నాయకులు భయపడే అవసరం లేదన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని నాయకులకు కార్యకర్తలకు సూచించారు. ఇక నుంచి మన ఇలాకాలో కాంగ్రెస్ బీజేపీల కథలు నడవనిచ్చేది లేదన్నారు.
- కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. గ్రామాల్లో ఎలాంటి సభలు, సమావేశాలు పెట్టాలంటే పోలీసులు లేకుండా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు గాని కాంగ్రెస్ నేతలు సభలకు సమావేశాలకు రావడంలేదు. బీఆర్‌ఎస్ హయాంలో 72 వేల కోట్ల రైతు బంధు ఇవ్వడం జరిగింది. 28 వేల కోట్ల రైతు రుణమాఫీ చేయడం జరిగిందని ఏనాడు కూడా కేసీఆర్ ప్రచారాల ఆర్భాటం చేయలేదు. రేవంత్‌రెడ్డి మాత్రం ఏదీ చేయకుండానే ప్రకటనలకు పరిమితం అవుతున్నారు. ఎప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని కొందరు అధికారులు అతిగా వ్యవహరిస్తున్నారు. రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని అతి చేసేవారు గుర్తుంచుకోవాలి.
- మన ప్రభుత్వం నిధులు కేటాయించి నిర్మించిన వాటికే ప్రారంభోత్సవాలు చేయటం సిగ్గుచేటు అన్నారు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి తో గ్రామాలు పట్టణాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాము కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణాలను, గ్రామాలను గాలికొదిలేసింది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసిన ఘనత రేవంత్ సర్కార్‌కే దక్కుతుంది. పూర్తి స్థాయిలో రైతు భరోసా, రుణమాఫీ అమలు కాకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పైన గడుస్తున్నా పేదల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేయడంలేదు పింఛన్ 4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం, మహిళలకు రూ.2,500లు, యువతులకు స్కూటీలు ఏమయ్యాయి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను, మోసపూరిత హామీలను ప్రతి కార్యకర్త ఎండగట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరుపున పోరాటం చేస్తాం అని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర నాయకులు నాగం శశిధర్ రెడ్డి, మాజీ గ్రంధాలయ ఛైర్మన్ హన్మంత్ రావు, మాజీ మార్కెట్ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ పార్టీ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, రైతు బంధు అధ్యక్షులు, పిఎసిఎస్ అధ్యక్షులు, సర్పంచుల సంఘం అధ్యక్షులు, అన్నీ గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -