అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరు..నిలదీసిన ప్రతిపక్ష నేతలు
స్పష్టమైన వివరణ ఇవ్వలేదు : ప్రతిపక్ష నేతలు
దేశంలో ఇంధన సంక్షోభం లేదు : కేంద్రం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పశ్చిమాసియా సంఘర్షణ, ఇంధన సంక్షోభం వంటి అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్షం సమావేశానికి ప్రధాని మోడీ డుమ్మా కొట్టారు. కీలకమైన సమావేశానికి ప్రధాని గైర్హాజరు కావడంపై సమావేశంలో కేంద్ర మంత్రులను ప్రతిపక్ష నేతలు నిలదీశారు. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం 1.45 గంటల పాటు జరిగింది. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, ఎస్. జైశంకర్, కిరణ్ రిజిజు, హర్దీప్ సింగ్ పూరి, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీలు పాల్గొన్నారు. పశ్చిమాసియా సంఘర్షణ నేపథ్యంలో కూడా దేశంలో ఇంధన సంక్షోభాన్ని నివారించడానికి అన్ని చర్యలూ తీసుకున్నామని సమావేశంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.
అలాగే దేశంలో ఇంధన సంక్షోభం లేదని తన వాదనను పునరుద్ఘాటించింది. ”తగినంత నిల్వలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో నాలుగు లేదా ఐదు నౌకలు భారతదేశానికి రానున్నాయి. ఎక్కడా కొరత గానీ, సరఫరా సమస్య గానీ లేదు. ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని కేంద్రమంత్రులు హామీ ఇచ్చారు. అయితే ప్రతిపక్షాలు లేవనెత్తిన కీలక అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ల దురాక్రమణను వ్యతిరేకించని కేంద్ర ప్రభుత్వం.. దౌత్యం అంటే మౌనంగా ఉండటమేననే అభిప్రాయాన్ని కలిగించేం దుకు ప్రయత్నిస్తోందని సీపీఐ(ఎం) రాజ్యసభ నేత జాన్ బ్రిట్టాస్ ఎద్దేవా చేశారు.
”అమెరికా ఏకపక్ష, క్రూరమైన దురాక్రమణను ఖండించని కేంద్ర ప్రభుత్వం, జీసీసీ దేశాలపై జరిగిన దాడులను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానానికి గట్టిగా మద్దతు తెలిపింది. బ్రిక్స్ కూటమికి నాయకత్వం వహిస్తున్న దేశంగా భారతదేశం స్పందన అత్యంత నిరాశపరిచింది. దేశంలో ఇంధన సంక్షోభం లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, దానిని నిరూపించే నివేదికలు ఒక్కటి కూడా రావడం లేదు. వాస్తవం ఏమిటంటే, అన్ని రాష్ట్రాలూ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎల్పీజీ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బ్లాక్ మార్కెటింగ్, నిల్వలను అరికట్టలేకపోతోంది. పాశ్చాత్య దేశాలలో కోటి మందికి పైగా భారతీయులు ఉన్నారు.
వారి భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? యుద్ధ భయంతో తిరిగి వచ్చిన వారికి సహాయం చేయడానికి పునరావాస ప్యాకేజీని ఎందుకు రూపొందించలేదు?” అని జాన్ బ్రిట్టాస్ ప్రశ్నించారు. పశ్చిమాసియా సంఘర్షణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించలేదన్న అభిప్రాయం తప్పు అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బదులిచ్చారు. ప్రభుత్వం ప్రతిరోజూ అధికారికంగా స్పందించిందని, దేశాధినేతలతో సంప్రదింపులు జరిపిందని ఆయన తెలిపారు. మొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేసినప్పుడు, యుద్ధం వీలైనంత త్వరగా ముగియాలని తాను కోరుకుంటున్నట్టు ప్రధాని తన వైఖరిని స్పష్టం చేశారని జైశంకర్ అన్నారు. ఇరాన్, అమెరికా మధ్య చర్చలలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం పెద్ద విషయమేమీ కాదని అన్నారు. ”1981 నుంచి పాకిస్తాన్ అనేక విషయాలపై ఇరాన్, అమెరికాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తూనే ఉంది.
అందువల్ల, ఇది కొత్త విషయం కాదు. సంఘర్షణను ముగించడానికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడం కేంద్ర ప్రభుత్వ దౌత్య వైఫల్యం అనే ఆరోపణలు తప్పు. ఒకవేళ అదే నిజమైతే, అది 1981 నుంచే ప్రారంభమైన దౌత్య వైఫల్యం” అని జైశంకర్ తెలిపారు. మరింత ప్రాణనష్టం జరగకుండా వీలైనంత త్వరగా యుద్ధం ముగియాలన్నది భారతదేశ వైఖరని చెప్పారు. ఈ వైఖరిని ప్రధాని అమెరికా అధ్యక్షుడికి స్పష్టం చేసినట్టు వివరించారు. ఏ విషయం పైనైనా ప్రతిపక్షాలతో చర్చలు జరపడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు ముకుల్ వాస్నిక్, తారిఖ్ అన్వర్, ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్, జావెద్ అలీ, ఎల్జేపీ నేత అరుణ్ భారతి, డీఎంకే ఎంపీ పి.విల్సన్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, జెడియు నేత రాజీవ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
సంతృప్తికరంగా లేదు: తారిఖ్ అన్వర్
అఖిలపక్ష సమావేశం సంతృప్తికరంగా జరగలేదని కాంగ్రెస్ నేత తారిఖ్ అన్వర్ అన్నారు. తాము ప్రభుత్వం నుంచి వివరణ కోరేందుకు ప్రయత్నించామని, కానీ స్పష్టమైన వివరణ రాలేదని అన్నారు. ఈ అంశంపై రాజ్యసభ, లోక్‌సభ రెండింటిలోనూ రూల్ 193, 170 కింద చర్చ జరగాలన్నది తమ డిమాండ్ అని అన్నారు. ప్రభుత్వం చెబుతోంది యుద్ధం వద్దని, కానీ కేవలం అలా చెప్పడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదని తెలిపారు. వాస్తవమేమిటంటే, ఇప్పటికే ఘర్షణ మొదలైందని, పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఆ పాత్రను పోషిస్తుండగా, మనం నిశ్శబ్దంగా ప్రేక్షకులుగా మిగిలిపోయామని అన్నారు.



