Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeదర్వాజస్థానికతకు పట్టం గట్టిన కవిత్వం

స్థానికతకు పట్టం గట్టిన కవిత్వం

- Advertisement -

మూడు దశాబ్దాల పైబడి కవిత్వాన్ని సజిస్తున్న కవి మడిపల్లి రాజ్కుమార్‌ తొలి పుస్తకం ఇది. మూడు దశాబ్దాల పరిణామాలపై అతని కవితా స్పందన ఇది. కాలానికి నిలబడిన కవిత్వమిది. తొంభైలలో రాసిన కవితలు సైతం నిన్నమొన్న రాసినంత తాజాగా ఉన్నాయి. వస్తువును కవితామయం చేయడంలో రాజ్కుమార్‌ చూపిన శ్రద్ధ, కౌశలం దీనికి మూలం. శిల్పం కోసం ప్రత్యేకించి కసరత్తులు చేసినట్టు కనిపించదు. ఏది ఎలా చెబితే కవిత్వమవుతుందో తెలియడం అతనికి తెలిసిన రసవిద్య. ఈ మొత్తం పుస్తకంలో ‘గ్లోబలైజేషన్‌’ అనే పదం లేకుండానే మూడు దశాబ్దాల ప్రపంచీకరణ క్రమంలో తెలుగునాట నెలకొన్న విధ్వంసాన్ని చెప్పడం గమనార్హం.
పల్లెల్లో విధ్వంసం… పట్నాల్లో, నగరాల్లో విధ్వంసం, మానవ విధ్వంసం… ప్రకతి విధ్వంసం… అభివద్ధి పేరిట అంతులేని విషాద బీభత్సం మనిషి బతుకును బీటలు వార్చిన వైనాన్ని కవితామయం చేయడమే ఈ కవి సాఫల్యం.
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ కు చెందిన కవి రాజ్కుమార్‌ కవిత్వపు వేళ్ళు ఆ మట్టిలోనే ఉన్నాయి. ఆ ప్రాకతిక సంరంభంలోనే దాగున్నాయి. అక్కడి అడవుల పచ్చదనంలోనూ, పోరాటాల చరిత్రలోనూ, తరగిపోతున్న అడవులను, అడవులను కాపాడే ఆదివాసీ గోండుల చరిత్రతోనూ ముడిపడి అతని కవిత్వం
సారవంతమైంది. ఒక్కమాటలో చెప్పాలంటే స్థానికత అతని కవిత్వానికి వస్తువును, అభివ్యక్తిని, శిల్పచాతుర్యాన్ని సమకూర్చింది. కనుకనే నిసర్గమైన సౌందర్యంతో అలరారుతుంది రాజ్కుమార్‌ కవిత్వం. మూడు, నాలుగు దశాబ్దాల పరిణామ క్రమంలో తెలంగాణ, ఆదిలాబాద్‌, నిర్మల్‌, అటవీ ప్రాంతాలు, అడవులను అంటిపెట్టుకొని వున్న గోండులు ఇతర ఆదివాసీల బతుకుల్లో వస్తున్న మార్పులను అసంకల్పితంగానే తన కవిత్వంలోకి తీసుకొచ్చాడు రాజ్కుమార్‌. అక్కడ నిలబడి తన చుట్టూ ఉన్న లోకాన్ని, పల్లెలను, పట్నాలను, నగరాలను పరికిస్తూ ఏ పరిణామం ఏ విపరిణామాలకు దారితీస్తుందో గమనించాడు. తన నేల మీద నిలబడి ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను వీక్షించాడు. ఆ గమనింపులోంచి కవిగా నిశితమైన, పదునైన చారిత్రక వ్యాఖ్యానంగా అతని కవిత్వం రూపు దాల్చింది. ఆర్ద్రమైన వ్యక్తీకరణలతో పాఠకులను ఆకట్టుకుంది.

ముఖ్యంగా ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిర్మల్‌ పరిసర ప్రాంతాల ప్రకతి, భౌగోళికత, చరిత్ర, వర్తమానం ప్రత్యేకంగా అభివ్యక్తమై కవిత్వాన్ని సౌందర్యభరితం చేసింది. పచ్చదనంతో అనుభూతి పరిమళాన్ని పరివ్యాప్తం చేసింది. కవి రక్తనాళ స్పందనలో ఈ ప్రాంతం ఎంతగా మిళితమై వున్నదో ఈ కవిత్వం చెబుతున్నది. ‘బంగల్‌ చెరువు, నిర్మల్‌ బొమ్మలు, వెయ్యి ఉరులమర్రి, కడాకు, కవ్వాల్‌ అభయారణ్యం, మహబూబ్‌ ఘాట్‌, రంజను’ మొదలయిన కవితల్లో సాంద్రత, గాఢత అత్యున్నత స్థాయిని అందుకున్నాయి.
ఈ కవిత్వంలో నోస్టాల్జియా లేదు. కేవలం జ్ఞాపకాల కలవరింత లేదు. సుందర దశ్యాల మాటునే ఉన్న కరకు వాస్తవాన్ని చెప్పడం కనిపిస్తున్నది.
‘నిర్మల్‌ బొమ్మలు’లో ఆ బొమ్మల, బొమ్మలను తయారు చేసే కళాకారుల ఔన్నత్యాన్ని చిత్రిక పడతారు. ఇవాళ ఆ కళకీ, బొమ్మలకీ ఆదరణలేని స్థితిని గుర్తు చేస్తూనే ”చేతి కళల దీపంతెలు వాళ్లు/ నూనె నొంపుకుంట వత్తుల నెత్తితె మన తెలంగాణకు వెలుగు” అని పరిష్కారమూ చూపించడం మెచ్చదగింది. ‘కవ్వాల అభయారణ్యం’లో సుందరమైన అభివ్యక్తులెన్నో పరవశానికి లోను చేస్తాయి.
”అడువులు మగాల బతుకుతొవ్వలు/ నానారకాల పక్షులూ జంతువుల సాకే/ అమ్మతనపు హరితహదయాలు” అనడం కవి కరుణాంతరంగాన్ని సూచిస్తున్నది.
వీరుల మరణంతో చరిత్ర నిలిచిపోదు, కొత్తతరం కోసం కొత్త ఆశలతో ప్రవహిస్తుంటుంది. ఈ చారిత్రక స్పహ ఈ ఆలోచనారీతిలోని పరిణతికి, మార్పు పట్ల విశ్వాసానికి ప్రతీక. ‘తుడుం పామ్‌ దాదా’ కవితలోనూ ఇదే అవగాహన ప్రతిఫలిస్తుంది.
అడవులను, ఆదివాసీలను కాపాడుకోవటానికి తుడుం నిరంతరంగా మోగడం ఎంత అవసరమో చెప్పాడు రాజ్కుమార్‌. ఇవాళ ఇది మరింత అవసరం.
అభివద్ధి పేరుతో ఖనిజాల కోసం, రోడ్ల కోసం అడవుల విధ్వంసం సాగుతున్నది. అడవుల్లో ఉన్న ఆదివాసీలను ఆ నేల నుండి తరిమేస్తున్నారు. వాళ్ళకు అండగా నిలిచిన వారిని ఆనవాలు లేకుండా చేస్తున్నారు. కానీ ప్రతిఘటించడం అడవిలోనూ, అడవి బిడ్డల స్వభావంలోనూ ఇమిడి వుంది. కనుకనే ”తుపాకుల వ్యవస్థను కూల్చేందుకు తుడుం మోగుతోంది” ఆగకుండా మోగుతుంది. ఇక్కడ ‘తుడుం’ అనేది ఒక రూపకం. ఒక ప్రతీక. తిరుగుబాటుకు, విముక్తికి, మార్పుకు సంకేతం
”ఒకచెట్టు ఫెళఫెళమంటూ నేలకొరిగినా ఒక రెక్కలు తెగిన పాట/ నెత్తురోడుతూ నేల రాలినా/ అడవి నమ్మకం సడలిపోదు”
(ఒక మహా సంకల్ప సిద్ధి కోసం)
మార్పు అనివార్యమైన వాస్తవాన్ని ఈ కవితా పాదాలు చెబుతాయి.
అడవుల్లోనే కాదు, మైదాన ప్రాంతాల్లోనూ అణచివేతకు, పీడనకు లోనయ్యేవారు మౌనంగా ఉండలేరు. టీవీ, మొబైల్‌ వంటి పరికరాలతో రకరకాలుగా ఏమార్చినా మార్కెట్‌ మాయాజాలంలో ముంచెత్తినా, మతం పేరుతో విభజనరేఖలు సష్టించినా సమస్యలతో అల్లాడే మనుషులు ప్రలోభాలకు లోనుకారు. మౌనం వీడకుండా ఉండరు. ఇదే విషయాన్ని ఇంకా అనేక కవితల్లో కవి ప్రతీకాత్మకంగా వ్యక్తం చేస్తారు. ‘గాజా బాలుడు’, ‘గొడవ మనిషి’, ‘అబలలు కారు’, ‘బ్లాక్‌ హౌజ్‌’ ‘సంపూర్ణ తెలంగాణ’ వంటి కవితలలోనూ వీటి ఛాయలున్నాయి.

వైయక్తికమూ, సామాజికమూ అనే తేడా లేకుండా రాయకుండా ఉండలేని తనమే అనేక అంశాలపై రాజ్‌ కుమార్‌ ను రాయడానికి పురిగొల్పింది. అందుకే ఈ కవిత్వంలో నిండుదనం వుంది. ఘర్షణాత్మకమైన, సంక్లిష్టమైన ప్రపంచంలో మంచివైపు నిలబడాలన్న ప్రగాఢ మానవీయ వాంఛ దాగుంది. ఇదే ఈ కవిత్వపు అంతరాంతరాల్లో సంలీనమై రాజ్కుమార్‌ కవిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది.
– గుడిపాటి, 94900 99327

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img