నవతెలంగాణ -సుల్తాన్ బజార్
హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపై ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువకుడి మిస్టరీ కేసును పోలీసులు సేదించారు. అతడి స్నేహితుడే హత్య చేసినట్లు రైల్వే, ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపారు. నాంపల్లి రైల్వే పోలీస్ స్టేషన్ లో మంగళవారం రైల్వే డీఎస్పీ జావెద్, రైల్వే ఇన్ స్పెక్టర్ బి.ప్రవీణ్ కుమార్, లింగంపల్లి ఆర్పీఎఫ్ సీఐ రవిలతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. వనపర్తి జిల్లా ఘనాపూర్ మండలం రుక్కన్నపల్లి గ్రామం దొంతికుంట తాండాకు చెందిన పి.రవి కూలి పనులు చేసుకుంటూ బాలానగర్లో నివాసం ఉంటున్నాడు.
బౌన్సర్, సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తున్న హఫీజ్ పేట్ రాఘవేంద్ర కాలనీకి చెందిన నీలం రాజేష్ (34)తో పరిచయం ఏర్ప డింది. ఈనెల 18న ఇద్దరూ కలిసి మియాపూర్ లో కల్లు తాగారు. ఆకలి వేస్తుందని రవి హైటెక్ సిటీ రైల్వే స్టేష నకు వెళ్లాడు. అక్కడి చేరుకున్న రాజేష్ తనను వదిలి వెళ్లిపోతావా అంటూ దుర్భాషలాడాడు. దీంతో ఇటుకతో కొట్టడంతో రాజేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. మంగళవారం ఫతేనగర్ రైల్వే స్టేషన్ లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా గాయాలతో ఉన్న రవి అనుమానాస్పదంగా కనిపించాడు. రాజేష్ ను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. నిందితుడిని రిమాండ్ కు తరలించారు.