పాలకుల మోసాలు, కష్టజీవుల సమస్యలపై కళారూపాలు : వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య
భువనగిరిలో సాంస్కృతికరంగ కార్యకర్తల రాష్ట్రస్థాయి సమావేశం
నవతెలంగాణ-భువనగిరి
”ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, మోసాలపై, మనువాద సంస్కృతిపై ప్రజలకు వివరించి చైతన్యపరచాలి.. కష్టజీవుల, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.. అందుకు ప్రజాసంస్కృతి, ప్రజాకళలను విస్తృత పరచాలి” అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య పిలుపునిచ్చారు. భువనగిరిలోని సుందరయ్య భవన్‌లో శుక్రవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సాంస్కృతికరంగ కార్యకర్తల రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో నాగయ్య మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలుకొని కూలి, భూమి, వివక్ష లాంటి సమస్యలపై నాడు ప్రజాకళలు ప్రజలను కదిలించి పోరాటాల్లో ముందు నడిపాయన్నారు. నేడు నూతన ఆర్థిక విధానాలు, సనాతన పద్ధతులతో పాలకులు, పెట్టుబడిదారులు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఆ మోసాలపై ప్రజలు తిరుగుబాటు చేయకుండా సనాతన ధర్మం పేరుతో అణచివేస్తున్నారని, మభ్యపెడుతున్నారని అన్నారు. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ప్రజలను పోరాటాల వైపు నడిపించడానికి ప్రజా సంస్కృతిని, ప్రజాకళలను ముందుకు తీసుకుపోతామని చెప్పారు. అందుకు వ్యవసాయ కూలీలు, కార్మికులు సంఘటితంగా సిద్ధం కావాలన్నారు.
తెలంగాణ ప్రజాసాంస్కృతిక కేంద్రం రాష్ట్ర బాధ్యులు జి.రాములు మాట్లాడుతూ.. ప్రజాకళలు, సంస్కృతి మానవుని దైనందిన జీవితంలో.. అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయని అన్నారు. పాలకులు ప్రజలను మూఢ విశ్వాసాల వైపు మళ్లిస్తున్నారని వ్యాఖ్యానించారు. అనేక దేశాలు చైతన్యవంతంతో నూతన టెక్నాలజీని ఉపయోగించుకొని అభివృద్ధి చెందుతుంటే.. మన దగ్గర మాత్రం బీజేపీ ప్రజలను మూఢ విశ్వాసాల వైపు నెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన సంస్కృతికి ప్రత్యామ్నాయంగా ప్రజా సంస్కృతిని ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు.
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రధానంగా భూమి, కూలి, ఉపాధి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వాటిపై నవంబర్, డిసెంబర్, జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రామారావును ఖమ్మంలో కాంగ్రెస్ గూండాలు చంపడాన్ని సంఘం రాష్ట్ర కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ, రాష్ట్ర కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, జిల్లాలకు సంబంధించిన పల్లెర్ల అంజయ్య, జూకంటి పౌల్, మల్లేశం, పాండు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు పాల్గొన్నారు.



