చర్చనీయాంశంగా హైదరాబాద్ మెట్రోరైల్
టూరిజం, మూసీ పునరుజ్జీవం సహా పలు శాఖల్లో ఈ విధానానికి ప్రాధాన్యం
దేశవ్యాప్తంగా సంక్షోభంలో ఉన్న 449 పీపీపీ ప్రాజెక్ట్‌లు
రాష్ట్రంలో నూతన విధానం కోసం కసరత్తు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పబ్లిక్, ప్రయివేట్, పార్టనర్ షిప్ (పీపీపీ) మోడల్‌పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ విధానం సక్సెస్‌పై ఇప్పటి వరకు ఇండియాలో మిశ్రమ ఫలితాలే వచ్చాయి. భూ సేకరణలో జాప్యాలు, రాజకీయ మార్పులు తదితర కారణాలతో చివరి వరకు సాగడం లేదు. లాభాల వెంట ప్రయివేట్ భాగస్వాముల పరుగు, ప్రజాహిత కోణంలో ప్రభుత్వాల నిర్ణయాలు తదితర కారణాలతో ఒప్పంద కాలం వరకు అవి కొనసాగడం లేదు. పీపీపీ పద్ధతిలో నిర్మించిన హైద్రాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నుంచి నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కంపెనీ అర్థంతరంగా వైదొలగడంతో, అసలు ఈ మోడల్ ఎంత వరకు ప్రజోపయోగం అనే చర్చ ప్రారంభమైంది. ఈ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది! నూతన విధానంకోసం కసరత్తు ప్రారంభమైనట్టు సమాచారం.నిర్మాణం, నిర్వహణ, బదలాయింపు ప్రాతిపదికన తెరపైకి వచ్చిన పీపీపీ మోడల్ ఇటీవలి కాలంలో అనేక ప్రశ్నలకు కేంద్రంగా మారింది.
హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్ట్ విఫలం కావడంతో ఈ విధానంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభుత్వం ఈ విధానంపై పున్ణస్సమీక్ష చేయాల్సిన అవసరం ఏర్పడింది. పీపీపీ మోడల్‌లో పెట్టుబడులను ప్రోత్సహిస్తే, నిర్మాణ సంస్థలు మధ్యలో చేతులెత్తేస్తే పరిస్థితి ఏంటనే దానిపై అధ్యయనం చేయాలి. ప్రాజెక్టుల ఒప్పంద సమయంలోనే ఆయా కంపెనీలపై కఠిన నిబంధనలు విధించాల్సిన అవసరం కనిపిస్తోంది. రాష్ట్రప్రభుత్వం వివిధ శాఖల అభివృద్ధి పథకాలను పీపీపీ విధానంలోనే ఒప్పందాలు చేసుకుంది. వచ్చే మూడేండ్లలో పర్యాటకరంగంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, 50 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పీపీపీ విధానం ద్వారా పెట్టుబడులను ఆహ్వానించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని శిల్పారామం వేదికగా ఇటీవల నిర్వహించిన తెలంగాణ టూరిజం కాంక్లేవ్-2025లో వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది.
పలువురు పెట్టుబడిదారులు రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన హౌటళ్లు, వెల్‌నెస్ సెంటర్లు, హాస్పిటాలిటీ ప్రాజెక్టుల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. అలాగే మూసీ పునరుజ్జీవనం పేరిట నదికిరు వైపులా పీపీపీ మాడల్‌లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిం చింది. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల దుబాయి పర్యటనలో ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, ఆర్కిటెక్ట్‌లతో భేటీ అయ్యారు. మూసీ పొడవునా చేపట్టనున్న గ్రీన్ అర్బన్ పార్క్‌లు, వాణిజ్య సముదాయాలు, నడక దారులు మొదలగు అభివృద్ధి పనుల్లో పలు సంస్థలు, పారిశ్రామిక వేత్తల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అయితే స్థానికంగా ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ ప్రాజెక్ట్ ఇంకా పట్టాలెక్కలేదు. ఇవే కాకుండా రహదారులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ప్రభుత్వం పీపీపీ మోడల్‌లోనే పెట్టుబడులను ఆహ్వానిస్తోంది.
హైదరాబాద్ మెట్రో…
2003లో కేంద్రం హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది. దాదాపు తొమ్మిదేండ్ల వరకు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. మొదట కాంట్రాక్ట్ దక్కించుకున్న మైటాస్ సంస్థ వైదొలగడంతో ఎల్‌అండ్‌టీ తెరపైకి వచ్చింది. 90 శాతం, ఎల్‌అండ్‌టీ, 10 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యతో ఒప్పందం కుదిరింది. 76 కిలోమీటర్ల నిడివిగల తొలిదశ ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణ, 35 ఏండ్ల కాలపరిమితి తర్వాత బదిలీ ప్రాతిపదికన ఎల్‌అండ్‌టీ సంస్థ హైదరాబాద్ మెట్రోను చేపట్టింది. ప్రారంభంలో వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్రం రూ.1,639 కోట్లు ఇచ్చింది. 2017 నుంచి 2019 వరకు దశల వారీగా మూడు కారిడార్లు అందుబాటులోకి వచ్చాయి. 5 శాతం ప్రకటనలు, 45 శాతం వ్యాపార సముదాయాలు, 50 శాతం టికెట్ల ద్వారా ఆదాయం పొందాలని ప్రతిపాదించారు. ప్రకటనలు, టికెట్ల విధానం సక్సెస్ అయినా వ్యాపార సముదాయాల ద్వారా ఆదాయం సమపార్జనలో ఎల్‌అండ్‌టీ ఫెయిల్ అయింది. మెట్రో రైల్ ఇరువైపులా రాష్ట్ర ప్రభుత్వం 18 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించింది. దాన్ని ఆదాయ మార్గంగా మార్చడంలో విఫలం కావడంతో సంస్థ నష్టాలను చవిచూసింది. ఈ క్రమంలో 2023లో చివర్లో రాష్ట్రంలో అధికార మార్పిడి రేవంత్‌రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టింది.
కొత్త ప్రభుత్వం ప్రతిపాదించిన ఫేజ్ 2 నిర్మాణంపై మెట్రో యాజమాన్యానికి సర్కార్‌కు మద్య వివాదం పొడసూపింది. తాము ఇప్పటికే నష్టాల్లో ఉన్నామని ఫేజ్ 2 చేపట్టలేమని ఎల్‌అండ్‌టీ చేతులెత్తేసింది. ఒక వైపు కేంద్రం ఒత్తిడి, మరో వైపు ఎల్‌అండ్‌టీ మొండికేయడంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2ను టేకోవర్ చేసుకోవడానికి సిద్దపడింది. ఇటీవల జరిగిన చర్చల్లో కంపెనీ అప్పులను బదలాయించుకోవడంతో పాటు సంస్థ పెట్టిన రూ.5,900 కోట్లకు గాను వన్‌టైం సెటిల్‌మెంట్ కింద రూ.2 వేల కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. అన్ని సవ్యంగా జరిగితే ఏడాదిలోపు హైదరాబాద్ మెట్రో రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా మారనుంది. మెట్రో ఉదంతం అనేక ప్రశ్నలకు కేంద్ర బిందువుగా మారింది. పీపీపీ మాడల్ కింద వచ్చే పెట్టుబడులు చివరి వరకు నిలబడతాయా? అనే సందేహాలకు తావిస్తున్నాయి. లాభాలు ఉంటేనే తాము నిర్వహిస్తాం.. లేదంటే తప్పుకుంటామంటే భవిష్యత్‌లో ఈ తరహా పెట్టుబడులు సర్కార్‌కు భారంగా మారుతాయనే అభిప్రాయం వ్యక్తంమవుతోంది. పీపీపీ మాడల్ పెట్టబడులపై సర్కార్ పునరాలోచించాల్సిన అవసరం ఉంది.
దేశంలో మిశ్రమ స్పందన…
భారతదేశంలో పీపీపీ మోడల్ సక్సెస్ రేటు మిశ్రమంగా ఉంది, అనేక ప్రాజెక్ట్‌లు వివిధ కారణాలతో విఫలమవుతున్నాయి. 2024 నివేదిక ప్రకారం దేశంలో 449 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సంక్షోభాలను ఎదుర్కొ న్నాయి. సకాలంలో వివాదాలను పరిష్క రించే యంత్రాంగాలు లేకపోవడం కూడా ఇందుకు కారణంగా భావిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో స్పష్టమైన, స్థిరమైన నిబంధనలు లేకపోవడం ప్రాజెక్టుల నిర్మాణం నిర్దేశిత గడువు కన్నా ఎక్కువ కాలం సాగుతోంది. ఈ క్రమంలో ప్రాజెక్ట్‌కు తీసుకొచ్చిన అప్పులు, వాటి వడ్డీలు తడిసి మోపెడవుతున్నాయి. డీటేయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)లో నిర్దేశించిన అంచనా రాబడి, వ్యయం మధ్య తీవ్రమైన వ్యత్యాసం ఏర్పడుతోంది. మెరుగైన ప్రాజెక్ట్ నిర్వహణ, రిస్క్ ప్రయివేట్ కంపెనీలకు భారంగా మారుతోంది. పలితంగా నష్టాలను చవిచూస్తున్న పలు సంస్థలు ఒప్పందం నుంచి వైదొలిగే ప్రయత్నం చేస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వాలకు అవి ఆర్థికంగా భారంగా మారుతున్నాయి.