Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeదర్వాజనిరంతర వర్తమానం కాళోజీ

నిరంతర వర్తమానం కాళోజీ

- Advertisement -

”నిన్నటి స్వప్నాన్ని/ రేపటి జ్ఞాపకాన్ని/ నేను ప్రస్తుతాన్ని” అంటూ మూడు కాలాలకు విస్తరించిన తన విశ్వాసాన్ని ప్రకటించారు కాళోజీ. గతంలో కలగన్న ఆదర్శ ప్రపంచం గూర్చి, తాను పోరాటం చేస్తున్న వర్తమానం గూర్చి, ఈ రెండింటి కలయికగా మిగిలివుండే భవిష్యత్తును గూర్చిన కవితాత్మక వ్యాఖ్యానమే పై పంక్తులు. అయితే కాళోజీ కలలు, జ్ఞాపకాలు మన కలలుగా మన జ్ఞాపకాలుగా నిరంతరం సాగుతూ వస్తున్నాయి. ఎందుకంటే కాళోజీది సామాజిక వ్యక్తిత్వం. ఆయన ఏది రాసినా ప్రజల కోసం ప్రజాతత్వంతో రాశారు. అందుకే ‘నా గొడవ’ మన గొడవ అయింది. అందుకే ‘నా నుండి మా దాకనే రాలేదు/ మన అన్నప్పుడు గదా ముందడుగు’ అని అనగలిగే నైతికశక్తి సిద్ధించింది. ‘రాజకీయాలు కావు ప్రజాకీయాలు’ అనాలన్న అధికారం కూడా సిద్ధించింది.

ఎంత బలమైన శత్రువులుంటే అంత బలమైన వీరుడు తయారవుతాడు. ‘నాజీల మించినోడైన’ నిజాంకు కుడి ఎడమలుగా వున్న భూస్వాములు, రజాకార్లు తెలంగాణలో మారణహోమం సృష్టించిన కాలంలో అందుబాటులో వున్న ప్రతి సాధనాన్ని ఆయుధంగా మలచుకొని ప్రతిఘటనోధ్యమం సాగించినవారు కాళోజి. కవిత్వం, సభ, ఊరేగింపు, ఉపన్యాసం, సంస్థ – ప్రతీది ఆయన నినాదానికి, నిరసనకు, తెగింపుకు, ధిక్కార స్వరానికి మాధ్యమం అయింది. కవి వెనుక, ప్రజాకవి కనుక అక్షరమే ఆయన ఆయుధం అయింది. నిరంకుశ ప్రభుత్వం పోయి బాధ్యతాయుత ప్రభుత్వం రావాలని ప్రకటించినందుకు గొడవలు జరిగినయి. జెండాను ఆవిష్కరించినందుకు రజాకార్లు దొడ్డికొమురయ్యను ఖూనీ చేశారు. పోతూ పోతూ ఒక చిన్న పిల్లవాణ్ణి పొడిచి చంపారు. ఆ తర్వాత డా||నారాయణరెడ్డిని చిత్రవధ చేసి చంపేశారు. వరంగల్లు అల్లకల్లోలమైంది. కాళోజీకి, మరికొందరికి మూడు నెలలపాటు నగర బహిష్కరణ శిక్ష విధించారు. ప్రధానమంత్రి మీర్జా ఇస్మాయిల్‌ స్వయంగా విచారణ చేసి పరిస్థితులను చక్కదిద్దేందుకు వరంగల్‌ వెళ్తారన్న వార్త పొక్కింది.
‘జరిగినదంతా చూస్తూ ఎరగనట్లు పడివుండగ/ సాక్షీభూతుణ్ణి కాను, సాక్షాత్తూ మానవుణ్ణి’ అని నమ్మినవారు కనుక వెంటనే ప్రధానమంత్రికి ‘వరంగల్‌లో ఉద్రిక్త పరిస్థితులకు నేను కూడా కారణమని నన్ను నగర బహిష్కారం చేనిన్రు. ఆ విచారణకు నన్ను కూడా నీవెంట తీసుకుపో. నా తప్పు వుంటే శిక్షించు’ అంటూ లేఖాస్త్రం సంధించారు. ప్రధాని ఒంటరిగానే పోయి వచ్చారు. వెంటనే ‘ప్రధానికి బహిరంగ లేఖ’ అన్న కవిత రాశారు.
‘కోటగోడల మధ్య ఖూని జరిగిన చోట/ గుండాల గుర్తులు గోచరించినవా?’ అంటూ ఒక పెద్ద కవిత రాస్తే, దాన్ని వెంటనే ‘కాళోజీ వేసిన సూటైన ఘాటైన ప్రశ్నలు’ అని బ్యానర్‌ కట్టి సురవరం ప్రతాపరెడ్డి గోలకొండ పత్రికలో ప్రచురించారు. సురవరం వారంటే ‘గోలకొండను అక్షరాల కట్టినవాడు/ నడమంతరపు దొరల హడలగొట్టినవాడు’ అంటూ వారి బహుముఖీనపాత్రను ప్రశింసించారు.
కాళోజీకి తెలంగాణ సంస్కృతి మీద వున్న గౌరవం గొప్పది. ‘బతుకమ్మ’ను బతుకు అనే అమ్మగా, దేవతగా కొలుచుకునే సంప్రదాయాన్ని తన తాత్వికతతో కొలుచుకుని చెప్పిన కవిత ‘బతకమ్మా! బతుకు’, ‘గుమ్మడి పూలు పూయగ బ్రతుకు/ తంగెడి పసిడి చిందగ బ్రతుకు’ అంటూ పండుగకు ప్రకృతితో ముడివడి వున్న బంధాన్ని వర్ణించి, నొసటి కుంకుమల తణుకులనీనుచు/ మంగళ సూత్రము వలపులపేనుచు బతకమ్మా బతుకు అంటూ పండుగకు మాంగళ్యానికి వున్న విశ్వాస బంధాన్ని వర్ణిస్తారు.
కాళోజీ నిజాయితీకి మారుపేరు. జైల్లో తనతోటి ఖైదీ ఒక దొమ్మరివాడు. అతడు తనకంటే చాలా తక్కువ వాడని కాళోజీ అ భిప్రాయం. తొలిచూపు నుంచే అతణ్ణి అసహ్యించుకుంటాడు. కాళోజీ జైలు కెందుకొచ్చిండో తెలుసుకోవటానికి దొమ్మరాయన చోరీ చేసినవా? ఎవర్నయినా చంపినవా? ఎవరి పెండ్లాన్నయిన ఎత్తుకొచ్చినవా?’ వంటి ప్రశ్నలడుగుతాడు. అట్లాంటి ప్రశ్నలను సత్యాగ్రహి అయిన తనలాంటి ఉన్నతస్థాయి వ్యక్తిని అడుగుతున్నందుకు ఛీ కొడుతాడు. అప్పుడు ఆ దొమ్మరాయన ‘గాంధీమహరాజ్‌కున్న హుజూర్‌ నిజాంకు బడాయి అయితాందట. అండ్లగిన రాలేదు గద నువ్వు?’ అని అడుగుతాడు. అతి కింది స్థాయి వాడనుకున్నవాడిలో స్వాతంత్య్రోద్యమానికి, గాంధీ గారికి సంబంధించిన అవగాహన ఉండటాన్ని గ్రహించేసరికి కాళోజీకి దిమ్మదిరిగి పోయింది. అతని దగ్గరికి వెళ్లి, కావలించుకుని కన్నీరు కార్చి, పశ్చాత్తాపాగ్నిలో తనను తాను శుద్ధి చేసుకున్నాడు. ఈ ఘట్టాన్ని ‘కాళోజీ గర్వభంగం’ అని నమోదు చేసుకున్నారు తన ఆత్మకథలో.
కాళోజీ స్నేహాన్ని ప్రాణప్రదంగా ప్రేమించినవాడు. ‘దేవతలెరుగని దివ్యానుభవం మైత్రి’ అన్న పంక్తిలో మహిమకన్నా మైత్రి గొప్పదన్న సూచన, దేవుడికన్నా మనిషి గొప్పవాడన్న ధ్వని వున్నాయి. ‘భావుకత’ కవులకు మాత్రమే పరిమితమైందని అనుకుంటాది. కానీ కాళోజీ దాన్ని సమస్త జీవితానికి అన్వయించి ‘భావుకత లేకుంటే బండ బారుతుంది బ్రతుకు’అంటారు.
‘అవనిపై జరిగేటి అవకతవకలు జూచి/ ఎందుకోనా హృదిని ఇన్ని ఆవేదనలు’ అంటూ సుకుమారమైన కరుణ రసాత్మక స్పందనతో కష్టజీవులతో మమేకమయ్యే కాళోజీ ‘తపన, తహతహ, సంసిద్ధత/ సాహనం వున్నన్నాళ్లు/ బతికే వుంటాను’ అని సార్థక జీవితాన్ని నిర్వచిస్తారు. కాళోజీ వకీలు కూడా. అందుకే ప్రతి కవితలో అంతర్గత తర్కం వుంటుంది. నిరంతర ప్రాసంగికత వున్న ఈ కవిత్వం కాళోజీని అమరుణ్ణి చేసింది. మనల్ని చైతన్యవంతుల్ని చేసింది. మన కలల్లో ఆయనెపుడూ సజీవమే.
(సెప్టెంబర్‌ 9 కాళోజీ నారాయణ రావు గారి జయంతి)

  • అమ్మంగి వేణుగోపాల్‌, 9441054637
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad