మంత్రి కోమటిరెడ్డి అభినందన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్)ను అత్యుత్తమ స్కిల్ డెవల్మపెంట్ వేదికగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, న్యాక్ వైస్‌చైర్మెన్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు విద్యార్థుల్లో స్కిల్ డెవల్మపెంట్ పెంపొందించాలనే లక్ష్యంతో ఇప్పటికే ప్రజా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ డెవల్మపెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే పురస్కరించుకొని ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్న న్యాక్ సీనియర్ ఇన్‌స్ట్రక్టర్ స్నేహలత మంత్రిని గురువారం మంత్రుల నివాస సముదాయంలోని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ విభాగంలో ఉత్తమ టీచర్స్ అవార్డు అందుకున్న ఆమెను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. శాలువాతో సత్కరించి, ఆమె పెద్దఎత్తున యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన అందించిన సేవలను మెచ్చుకున్నారు.
న్యాక్ ద్వారా నిరుద్యోగ యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, జగిత్యాల పట్టణాల్లో నిరుద్యోగ యువతకు సర్టిఫికెట్ కోర్సులు, ఉద్యోగ అవకాశాలు కల్పించే వత్తివిద్యా కోర్సులను అందిస్తూ, ఉత్తమ బోధన అందించేందుకు చేసిన కషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కిందని మంత్రి కొనియాడారు. దేశవ్యాప్తంగా 13 మంది ఈ అవార్డుకు ఎంపికైతే తెలంగాణ నుంచి న్యాక్ ఇన్‌స్ట్రక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న హన్మకొండకు చెందిన నక్కా స్నేహలతకు అవార్డు రావడం తెలంగాణ రాష్ట్రానికి గర్వ కారణం అన్నారు. నల్లగొండలో అధునాతన హంగులతో నూతనంగా నిర్మిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అతిత్వరలో అందుబాటులోకి రానుందనీ, ఉమ్మడి జిల్లా యువతలో ప్రపంచంతో పోటీపడే నైపుణ్యం పెంపొందించేందుకు ఈ సెంటర్ ఉపయోగపడనుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. నైపుణ్యాలకు ఉత్తమ వేదికగా నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్‌ను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్న మంత్రి, ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు దక్కడంతో న్యాక్ ఫ్యాకల్టీ, సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని నింపిందన్నారు. స్నేహలతను ప్రోత్సహించిన న్యాక్ డైరెక్టర్ శాంతిశ్రీని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.
న్యాక్ సీనియర్ ఇన్‌స్ట్రక్టర్ స్నేహలతకు రాష్ట్రపతి అవార్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES