Thursday, October 30, 2025
E-PAPER
Homeజాతీయంరాఫెల్‌లో రాష్ట్రపతి గగనయానం

రాఫెల్‌లో రాష్ట్రపతి గగనయానం

- Advertisement -

చరిత్ర సృష్టించిన ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ : భారతదేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌ ద్రౌపదీ ముర్ము రాఫెల్‌ యుద్ధ విమానంలో ప్రయాణించారు. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి ఆమె రాఫెల్‌లో గగనయానం చేశారు. ఈ రాఫెల్‌ యుద్ధ విమానాన్ని 17వ స్క్వాడ్రన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ గ్రూప్‌ కెప్టెన్‌ అమిత్‌ గెహానీ నడిపారు. ద్రౌపది ముర్ము సహ పైలెట్‌గా పాల్గొన్నారు. వాయుసేన చీఫ్‌ మార్షల్‌ ఎ.పి సింగ్‌.. ఆమెకు తోడుగా మరో విమానంలో ప్రయాణించారు. రాఫెల్‌ విమానంలో ప్రయాణించిన మొదటి భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఘనతను సాధించారు. అంతేకాదు.. ఆమె గతంలో సుఖోరు-30 ఎంకేఐ యుద్ధ విమానంలోనూ విహరించారు. ఈ ప్రయాణం చేసిన రెండో మహిళ రాష్ట్రపతిగా కూడా ఆమె గుర్తింపు పొందారు. అలాగే రెండు యుద్ధ విమానాల్లో గగనయానం చేసిన రాష్ట్రపతిగా కూడా నిలిచారు. గతంలో నాటి రాష్ట్రపతులు అబ్దుల్‌ కలాం 2006లో, ప్రతిభా పాటిల్‌ 2009లో సుఖోరు-30 ఎంకేఐ యుద్ధవిమానాల్లో ప్రయాణించిన విషయం విదితమే.

రాష్ట్రపతికి సాంప్రదాయ గార్డ్‌ ఆఫ్‌ ఆనత్‌తో స్వాగతం లభించింది. రాఫెల్‌ సామర్థ్యాలపై ఆమెకు అధికారులు వివరించారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు విమానం టేకాఫ్‌ అయింది. సుమారు 30 నిమిషాల పాటు కొనసాగి దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణిచింది. ఈ సమయంలో రాఫెల్‌ విమానం 15వేల అడుగు ఎత్తులో, గంటకు 700 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఇక రాఫెల్‌లో ఎక్కడానికి ముందు రాష్ట్రపతి ముర్ము.. జీ-సూట్‌ను ధరించారు. సన్‌గ్లాసెస్‌ పెట్టుకున్నారు. హెల్మెట్‌ పట్టుకొని పైలట్‌తో కలిసి ఫొటోలు దిగారు. వీటికి సంబంధించిన ఫొటోలనూ, తన అనుభవాన్ని ద్రౌపది ముర్ము సామాజిక మాధ్యమాలు వేదికగా పంచుకున్నారు.ఫ్రాన్స్‌ కంపెనీ డసాల్ట్‌ ఏవియేషన్‌ తయారు చేసిన రాఫెల్‌ యుద్ధ విమానాలు.. 2020 సెప్టెంబర్‌లో భారత వైమానిక దళంలో చేరాయి. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాక్‌పై భారత సైన్యం రాఫెల్‌ యుద్ధ విమానాలను ప్రయోగించిన విషయం విదితమే. ఇప్పుడు ఆ యుద్ధ విమానాల్లోనే భారత రాష్ట్రపతి ప్రయాణించడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -