నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో ప్రొటోకాల్ పాటించలేదని ఆరోపిస్తూ … కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తికి లేఖ రాశారు. శనివారం బాగ్డోగ్రా విమానాశ్రయం సమీపంలో జరిగిన గిరిజన సంఘం అంతర్జాతీయ సంతాల్ సదస్సు కార్యక్రమంలో తక్కువమంది హాజరు కావడం పట్ల రాష్ట్రపతి ముర్ము నిరాశ వ్యక్తం చేశారు. వేదికను బిధాన్ నగర్ నుండి మార్చాలనే నిర్ణయాన్ని ప్రశ్నించారు.
అయితే, భద్రత, ఇతర లాజిస్టిక్ కారణాలను చూపుతూ, అధికారులు వేదికను బాగ్డోగ్రా విమానాశ్రయానికి సమీపంలోని గోషైపూర్‌కు మార్చారని వివరణ ఇచ్చారు. ముర్ము మాట్లాడుతూ …. ”ఆ కార్యక్రమాన్ని బిధాన్‌నగర్‌లో నిర్వహించి ఉంటే బాగుండేది. అక్కడ తగినంత స్థలం ఉంది. చాలా మంది హాజరు కావచ్చు. కానీ రాష్ట్ర యంత్రాంగం అక్కడ సమావేశానికి ఎందుకు అనుమతించలేదో నాకు తెలియదు. ఈరోజు కార్యక్రమానికి ప్రజలు ఇక్కడికి రావడం కష్టంగా ఉండే ప్రదేశంలో జరుగుతోంది. బహుశా రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజనుల సంక్షేమం అక్కర్లేదు, అందుకే వారు ఇక్కడికి రాకుండా నిరోధించబడ్డారు ” అని ముర్ము అసహనాన్ని వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని సందర్శించిన సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రపతి ముర్మును అవమానించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఆరోపిస్తూ, ఇది సిగ్గుచేటు, అని, టిఎంసి పాలన ‘నిజంగా అన్ని పరిమితులను దాటిందని’ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో … రాష్ట్రపతి పర్యటన వేళ ప్రొటోకాల్ పాటించలేదంటూ … కొన్ని అంశాలకు వివరణ ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది.
లేఖలో ప్రస్తావించిన అంశాలు ….
రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎందుకు హాజరు కాలేదు ?
రాష్ట్రపతి కోసం ఏర్పాటు చేసిన వాష్ రూమ్‌లో నీళ్లు లేవు.
రాష్ట్రపతి కాన్వారు వెళ్లే దారి చెత్తతో నిండిపోయింది.
డార్జిలింగ్ జిల్లా మేజిస్ట్రేట్, సిలిగుడి పోలీస్ కమిషనర్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ను బాధ్యులుగా పేర్కొంటూ.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయండి. …
పై ప్రశ్నలకు సంబంధించి ఆదివారం సాయంత్రం 5 గంటల సమయానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కేంద్రం కోరింది.



