అధికారులకు సీఎస్ రామకృష్ణారావు ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబ్కేదర్ రాష్ట్ర సచివాలయంలో సంబంధిత అధికారులతో సీఎస్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నగర పరిశుభ్రతపై ఇప్పటి వరకు తీసుకుంటున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎస్‌కు వివరించారు. పరిశుభ్రత, చెత్త సేకరణ విధానం, పరిశుభ్రతా చర్యలు, ప్రజారోగ్య పరిరక్షణపై తీసుకుంటున్న చర్యలను ఆయన పరిశీలించారు.
వివరాలను ఎప్పటికప్పుడు డాష్ బోర్డ్‌లో పొందుపరచాలని ఈ సందర్భంగా సీఎస్ అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 4500 స్వచ్ఛ ఆటోలు ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తున్నాయని అధికారులు సీఎస్‌కు వివరించారు. 2650 స్వయం సహాయక బృందాల సభ్యులు మొత్తం 18,557 మంది శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్నారని గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు. నగర పరిధిలో రోజువారీగా 7800 టన్నుల మేరకు గార్బేజ్ సేకరణ జరుగుతుంద న్నారు. మున్సిపల్ విభాగం ప్రభుత్వంలో కీలకమన్నారు. ప్రజల అవసరాలకు తగినట్టుగా బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు.
రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ, సమర్థవంతంగా ఉండేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. చెత్త సేకరణ (డ్రై, వెట్ వేస్ట్), ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. నగరంలో పారిశుధ్య పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సమయానుసారంగా నివేదికలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ వ్యవస్థలను శుభ్రపరిచే చర్యలు ముందస్తుగా చేపట్టాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి టి.కె.శ్రీదేవి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన, మల్కాజ్‌గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జోనల్ కమిషనర్లు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.



