పలువురికి గాయాలు
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రంగారెడ్డి జిల్లా ఓఆర్‌ఆర్‌పై టైరు పేలి ఓ ప్రయివేట్ బస్సు అదుపుతప్పి బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగపూర్‌కు చెందిన ఓ ప్రయివేట్ బస్సు గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వైపు గురువారం ఉదయం వేగంగా వెళ్తోంది. రాజేంద్రనగర్ అవుటర్ రింగ్ రోడ్డు వద్ద బస్సు టైరు పేలి పూర్తిగా అదుపు తప్పి శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది.
ఈ ఘటనలో బస్సు ముందు భాగం, బొలెరో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న 30 మందిలో తొమ్మిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే తోటి ప్రయాణికులు 108లో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న బస్సును, బొలెరో వాహనాన్ని క్రేన్ సాయంతో పక్కకు తీశారు. ప్రమాదంతో ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్‌ని పునరుద్ధరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.