Friday, March 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసమస్యలే… సమస్యలు

సమస్యలే… సమస్యలు

- Advertisement -

జీరో అవర్‌లో అధికార, విపక్ష సభ్యుల ప్రస్తావన
ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌
అసైన్డ్‌ భూములపై ఉన్నతస్థాయి కమిటీ
నివేదిక ఆధారంగా నిర్ణయం : అసెంబ్లీలో మంత్రి పొంగులేటి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అసెంబ్లీలో గురువారం జీరో అవర్‌ రెండు గంటలపాటు నిర్వహించారు. అధికార, విపక్ష సభ్యులు అన్న తేడా లేకుండా అందరూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. వారి నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ సభ్యుడు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ అసైన్డ్‌ భూముల్లో ఇండ్లు కట్టుకున్నారని చెప్పారు. ఆ ఇండ్లను రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. కలెక్టర్లకు ఆదేశాలివ్వాలని సూచించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పందిస్తూ అసైన్డ్‌ భూముల్లో ఇండ్లు కట్టుకుని ప్రజలు జీవిస్తున్నది వాస్తవమని అన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ సమస్య ఉందన్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ సమస్యపై ఉన్నతస్థాయి కమిటీని వేస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో తీసుకున్న నిర్ణయాలపై అధ్యయనం చేస్తుందని అన్నారు. అసైన్డ్‌ భూముల్లో ఇండ్లు కట్టుకున్న వాటిపై ఆ కమిటీ నివేదిక ఆధారంగా క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ప్రశాశ్‌గౌడ్‌ మాట్లాడుతూ రాజేంద్రనగర్‌ను హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కలపొద్దనీ, సైబరాబాద్‌ లేదా ఫ్యూచర్‌ సిటీలో కలపాలని సూచించారు. బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రామంతాపూర్‌ విద్యుత్‌ తీగల వల్ల మరణించిన కుటుంబాలకు ఉద్యోగాలివ్వాలని కోరారు. ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 22, 21 కింద రెండు లక్షల ఎకరాలకు నీరందించాలని చెప్పారు. రూ.500 కోట్లు కేటాయించి ఆ ప్యాకేజీ పనులను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీలో ఆస్తి పన్నులో 90 శాతం మినహాయింపును అన్ని మున్సిపాల్టీలకూ వర్తింపజేయాలని కోరారు. ధన్‌పాల్‌ సూర్యనారాయణ మాట్లాడుతూ కబ్జాలకు కేరాఫ్‌గా నిజామాబాద్‌ మారిందన్నారు. ఫుట్‌పాత్‌లు, చెరువులు కబ్జాలకు గురవుతున్నాయని చెప్పారు. హైడ్రాను నిజామాబాద్‌కు తేవాలని కోరారు. ఎలివేటెడ్‌ కారిడార్‌ వల్ల నష్టపోతున్న బాధితులకు మంచి పరిహారం అందించాలని శ్రీగణేష్‌ డిమాండ్‌ చేశారు. కాలే యాదయ్య మాట్లాడుతూ గుడి మల్కాపూర్‌ మార్కెట్‌ను అజీజ్‌నగర్‌కు తరలించాలని సూచించారు.

గ్యాస్‌ సిలిండర్ల కొరతపై ప్రభుత్వం స్పందించాలి : జాఫర్‌ హుస్సేన్‌
ఎల్పీజీ సిలిండర్లు గతంలో బుక్‌ చేసిన రెండు, మూడు రోజుల్లోనే గృహ వినియోగదారులకు వచ్చేవని ఎంఐఎం సభ్యులు జాఫర్‌ హుస్సేన్‌ అన్నారు. కానీ ఇప్పుడు బుక్‌ చేస్తే 25 రోజుల సమయం పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వాణిజ్య సిలిండర్ల సరఫరా పూర్తిగా నిలిపివేశారని చెప్పారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం గ్యాస్‌ సిలిండర్ల కొరత లేదని అంటున్నాయని వివరిం చారు. కొరత లేకుంటే ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం స్పందించి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. చింతా ప్రభాకర్‌ మాట్లాడుతూ మియాపూర్‌ నుంచి ఇస్నాపూర్‌ వరకు మెట్రోరైల్‌ను విస్తరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. దాన్ని సంగారెడ్డి వరకు పొడిగించాలని కోరారు. పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ ఓయూలో పాలన అస్తవ్యస్థంగా మారిందన్నారు.

ఔటా అధ్యక్షుడు మనోహర్‌రెడ్డిపై సస్పెన్షన్‌ను ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ చేర్యాల రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. రామగుండంలో దోబీలు, ఇతరులకు కులధృవీకరణ పత్రాలను ఇవ్వాలని రాజ్‌ఠాకూర్‌ సూచించారు. యశస్విని రెడ్డి మాట్లాడుతూ కొడకండ్లలో మినీటెక్స్‌ టైల్‌ పార్కును ఏర్పాటు చేయాలని చెప్పారు. జి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ కౌకుంట్ల మండల కార్యాలయం అద్దె భవనంలో ఉందన్నారు. ప్రభుత్వ కార్యాలయాన్ని శాశ్వతంగా నిర్మించాలని కోరారు. సాంకేతిక సమస్యల వల్ల ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు రావడం లేదన్నారు. రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ కారులపై కేసులను ఎత్తేయాలని చెప్పారు. పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ హుజూరాబాద్‌లో డంపింగ్‌ యార్డ్‌ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. నీరు కలుషితం అవుతుందన్నారు. అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్దండపూర్‌ రిజర్వాయర్‌ వద్ద టూరిజం హోటల్‌ను నిర్మించాలని సూచించారు.

గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ ఆదివాసీలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరైతే అటవీ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. వడ్డెర కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని మందుల సామేల్‌ చెప్పారు. కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ ఉరుమలపై కేసులు నమోదు చేయడం సరైంది కాదన్నారు. పాడి పరిశ్రమపై ఆధారపడిన రైతులకు మూడు, నాలుగు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనీ, వాటిని విడుదల చేయాలని కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. ఎడ్మ బొజ్జు మాట్లాడుతూ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే రెవెన్యూ అధికారులు ఇసుక తీసుకుపోనీయడం లేదనీ, ఆ ఇండ్లను గిరిజనులు ఎలా కట్టుకోవాలని ప్రశ్నించారు.

వితంతు పెన్షన్లు పెండింగ్‌లో ఉన్నాయనీ, వాటిని పరిష్కరించాలని మాణిక్‌రావు కోరారు. బీర్ల ఐలయ్య మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలనీ, ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలనీ, ఖాళీలను భర్తీ చేయాలని చెప్పారు. 120 మంది గల్ఫ్‌ కార్మికులు మరణించారనీ, వారి కుటుంబ సభ్యులకు రూ.ఐదు లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని రాకేశ్‌రెడ్డి అన్నారు. వంశీకృష్ణ మాట్లాడుతూ డిండి ప్రాజెక్టు వద్ద బోటింగ్‌, రిసార్ట్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. వేసవిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని సంజీవరెడ్డి చెప్పారు. ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ వేములవాడలో సాగునీటి సమస్యను తీర్చాలని కోరారు. ఉపాధ్యాయులకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయనీ, పీఆర్సీ అమలు కాలేదని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి : కూనంనేని
రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. అనేక సమస్యలతో వారు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎంత మంది జర్నలిస్టులు పనిచేస్తున్నారని అన్నారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి సంక్షేమ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరోగ్య కార్డులను ఇవ్వాలని చెప్పారు. జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని అన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు పెన్షన్‌ పథకాన్ని కల్పించాలన్నారు. కెమెరాలు, ల్యాప్‌టాప్‌, ఆధునిక మొబైల్‌ ఫోన్లు ఇవ్వాలన్నారు. జర్నలిస్టుల భద్రతకు చట్టం తేవాలని చెప్పారు. జర్నలిస్టులకు కనీస వేతనం అమలు చేయాలని కోరారు. ఎంపానెల్‌లో ఉన్న చిన్న పత్రికలకు యాడ్స్‌ ఇవ్వడంలో ఆలస్యమవుతున్నదనీ, ఈ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -