చెడును ఎదిరించి సమాజం మేలు కోసం పని చేస్తారు
రానున్న కాలం ఎర్రజెండాదే : యువ కమ్యూనిస్టుల సమ్మేళనంలో సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
సమాజంలో జరుగుతున్న చెడును ఎదిరించి సమాజం మేలు కోసం పనిచేసే పురోగామి శక్తులు కమ్యూనిస్టులు అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ఆదివారం యువ కమ్యూనిస్టుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్, సుభాష్ విగ్రహం మీదుగా సీపీఐ(ఎం) కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. యువ సమ్మేళనం ప్రారంభ సూచికగా పార్టీ జెండాను తమ్మినేని వీరభద్రం ఆవిష్కరించారు. భగత్‌సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పార్టీ మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం అధ్యక్షతన నిర్వహించిన సమ్మేళనంలో తమ్మినేని మాట్లాడారు. దేశంలో పెట్టుబడిదారీ విధానాల వల్లనే అసమానతలు పెరుగుతున్నాయని అన్నారు. ప్రజలకు కనీస అవసరాలు కల్పించలేని పాలకుల విధానాలకు వ్యతిరేకంగా యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
రానున్నకాలం ఎర్రజెండాదేనని.. కమ్యూనిస్టులు పురోగామి శక్తులుగా అవతరిస్తున్నారని అన్నారు. విశ్వమానవాళిలో మహౌన్నతమైన సిద్ధాంతం కమ్యూనిజమని పేర్కొన్నారు. శ్రీలంక లాంటి పరిణామాలే నిదర్శనం అన్నారు. ప్రజలకు విద్య, వైద్యం, కనీస అవసరాలు తీర్చలేని స్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని విమర్శించారు. ఎన్నికల్లో గెలవడం కోసం అమలు చేయలేని హామీలు ఇచ్చి గెలిచాక ప్రజల్ని ఆర్థిక సంక్షేమంలోకి నెట్టేసి ప్రజావ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయన్నారు. నాటి నుంచి ఇప్పటివరకు ప్రాణాలకు భయపడకుండా పోరాటం చేస్తోంది కమ్యూనిస్టులేనని స్పష్టం చేశారు. బీజేపీకి ప్రజాసమస్యలపై పోరాడిన చరిత్ర లేదన్నారు. స్వాతంత్య్ర ఉద్యమానికి ద్రోహం చేసి తాము దేశభక్తులమని అబద్ధ ప్రచారం చేసే ఆర్‌ఎస్‌ఎస్‌ను యువత తిప్పి కొట్టాలని అన్నారు. సమాజంలో జరుగుతున్న అసమానతలు అంతరాలపై యువకమ్యూనిస్టులు సంఘటితంగా పోరాడాలన్నారు. మెరుగైన సమాజ నిర్మాణం కోసం యువత క్రీయాశీలక శక్తిగా పని చేయాలని సూచించారు.
ప్రశ్నించకుండా..సమాజం ముందుకెళ్లదు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జహంగీర్
యువత ప్రశ్నించకుండా పోరాడకుండా ఉంటే సమాజం తిరోగమనంలో ఉంటుందని, దోపిడీ వ్యవస్థను కూల్చేందుకు యువత ముందుకు రావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి.జహంగీర్ పిలుపునిచ్చారు. మనువాదం, మతోన్మాదం పేరుతో బీజేపీ ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టి విభజన రాజకీయాలు చేస్తున్నదన్నారు. అది సామాజిక న్యాయానికి సమానత్వానికి వ్యతిరేకమన్నారు. ఇది రిజర్వేషన్ల అంశంలో తేలిపోయిందన్నారు. రాబోయే స్థానికసంస్థల ఎన్నికల్లో కమ్యూనిస్టులను గెలిపించేందుకు యువత అగ్రభాగాన నిలవాలన్నారు. దేశ సమగ్రత, సమైక్యత కోసం పోరాడిన వీరుల త్యాగాల స్ఫూర్తితో యువజనులు ప్రజల పక్షాన పోరాడాల్సిన అవసరముందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు మేక అశోక్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జల్లెల్ల పెంటయ్య, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశ్, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు వనం ఉపేందర్, బలుగూరి అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూరెళ్ళ నరసింహాచారి, బోయిని ఆనంద్, కందుల హనుమంతు, కల్లూరి నగేష్, డివైఎఫ్‌ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు శానకొండ రామచంద్రం, మెట్టు శ్రవణ్‌కుమార్, మండల కమిటీ సభ్యులు గొరిగేసోములు, గన్నేబోయిన విజయభాస్కర్, నాగటి ఉపేందర్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు గంటెపాక శివకుమార్, ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.