– టీపీజేఏసీ, ఎన్‌ఏపీఎం ధర్నాలో నాయకులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీపీజేఏసీ, ఎన్‌ఏపీఎం డిమాండ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం టీపీజేఏసీ, ఎన్‌ఏపీఎం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని లేబర్ కమిషనర్ కార్యాల యం వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. ధర్నా సందర్భంగా పలు డిమాండ్లతో ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఇప్పటి వరకు నిర్దిష్టమైన అడుగులు ప్రభుత్వం వైపు నుంచి పడలేదని విమర్శించారు. రాష్ట్రంలో గిగ్ అండ్ ప్లాట్ ఫాం కార్మికుల సంక్షేమానికి మే 1 నుంచి ప్రత్యేక చట్టం తెస్తామని ప్రకటించినప్పటికీ అదీ ఇంకా కార్యరూపం దాల్చలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్మిక శాఖను బలోపేతం చేసే దిశగా సిబ్బంది, అధికారుల సంఖ్యను పెంచాలనీ, ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలనీ, గిగ్ అండ్ ప్లాట్ ఫాం కార్మికులు, ఉద్యోగులకు సమగ్ర సంక్షేమ చట్టాన్ని వెంటనే ప్రకటించి అమలు చేయా లని డిమాండ్ చేశారు. వలస కార్మికులు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించాలనీ, స్కూల్స్‌లో మధ్యాహ్న భోజన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతనం చెల్లించాలనీ, స్కూల్ స్వీపర్ల వేతనాన్ని రూ.21 వేలకు పెంచి రెగ్యులైజ్ చేయాలని కోరారు. పెరిగిన కార్మికుల సంఖ్యకు అనుగుణంగా మల్టీ స్పెషాలిటీ ఈఎస్‌ఐ ఆస్పత్రులను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలనీ, అసంఘటిత కార్మికుల సహజ మరణానికి రూ.5 లక్షల బీమా చెల్లించాలనీ, కార్మిక సంఘాలను భాగస్వాములుగా చేసుకుని అసంఘటిత కార్మికులను నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా హమాలీలు, గృహ కార్మికులు, చెత్త సేకరించే కార్మికులు, ఉపాధి హామీ కార్మికులు, ఇతర అసంఘటిత కార్మికులు, ప్రభుత్వ రంగ సంస్థల కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీజేఏసీ కో కన్వీనర్లు కె.రవిచందర్, కన్నెగంటి రవి, ఎన్‌ఏపీఎం జాతీయ కమిటీ సభ్యులు మీరా సంఘమిత్ర, రాష్ట్ర నాయకులు ఖలీదా పర్వీన్, ఏపీసీఆర్ రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ ఉస్మాన్, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.శంకర్, గృహ కార్మికుల యూనియన్ (టీడీడబ్ల్యూయూ) నాయకులు మంజుల, తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సామ్రాజ్యం, గిగ్ అండ్ ప్లాట్ ఫాం వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు షేక్ సలావుద్దీన్, హైదరా బాద్ చెత్త సేకరించే కార్మికుల కలెక్టివ్ ప్రతినిధి జయలక్ష్మి అరిపిన తదితరులు పాల్గొన్నారు.
కార్మికులకిచ్చిన హామీలు అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES