బ్రిటన్ పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళనలు
ప్రిన్స్ చార్లెస్‌తో భేటీ
విండ్సర్, ఇంగ్లండ్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్రిటన్‌లో అధికార పర్యటన నిమిత్తం బుధవారం లండన్ చేరుకున్నారు. బ్రిటన్‌లో ట్రంప్ పర్యటించడం ఇది రెండోసారి. ఈ పర్యటనలో భాగంగా ట్రంప్‌నకు రాజు చార్లెస్ దంపతులు ఆతిథ్యాన్ని ఇస్తున్నారు. ఈ సందర్భంగా చార్లెస్ దంపతులతో పాటూ ప్రిన్స్ విలియం, ఆయన సతీమణి కేట్‌లతో కూడా ట్రంప్ భేటీ అయ్యారు. వెయ్యి ఏళ్ళకు పైగా బ్రిటన్ రాజకుటుంబాలకు నెలవుగా వున్న విండ్సర్ కోటలోనే ట్రంప్ బస చేస్తున్నారు. అంతకుముందు ట్రంప్‌కు కోటలో ఘనంగా రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. తుపాకులతో గౌరవవందనాలు, మిలటరీ కవాతు అనంతరం విలాసవంతమైన విందు ఏర్పాటు చేశారు. బ్రిటన్ సహా పలు కీలకమైన వాణిజ్య భాగస్వాములతో అమెరికా వాణిజ్య చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది. ఈ పర్యటనలో సాంకేతికత, పౌర అణు ఒప్పందం సహా ఇరు దేశాల మధ్య అనేక ఒప్పందాలు జరగనున్నాయి.
నిరసనల సెగ
ట్రంప్‌కు బ్రిటన్‌లో నిరసనల సెగ తప్పడం లేదు. ట్రంప్ పర్యటనను నిరాకరిస్తూ మంగళవారం విండ్సర్ కోట వెలుపల స్టాప్ ట్రంప్ కొయిలేషన్‌కి చెందిన నిరసనకారులు ఆందోళన చేపట్టారు. కోట భవనాల్లో ఒకదానిపై ట్రంప్, లైంగిక వేధింపుల నేరస్తుడు జెఫ్రీ ఎపిస్టెన్‌లు కలిసి వున్న ఫోటోను ప్రదర్శించారు. ఆ సమయానికి ట్రంప్ అక్కడకు రాలేదు. దాంతో అధికారులు వెంటనే స్పందించి ఆ వీడియోను, ఫోటోలను తొలగించారు. ఈ సందర్భంగా నలుగురిని అరెస్టు చేశారు. లండన్‌లో బుధవారం పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. వాటిని అదుపు చేసేందుకు దాదాపు 1600మంది పోలీసు అధికారులను రంగంలోకి దించారు. ఇటీవల కాలంలో విచ్ఛిన్నకర, మితవాద రాజకీయాలను రెచ్చగొడుతున్న నేత ట్రంప్ అని ఆందోళనకారులు విమర్శించారు.
ప్రత్యేకబంధం బలోపేతం
ట్రంప్ పర్యటనతో బ్రిటన్, అమెరికా మధ్య ప్రత్యేక బంధం మరింత బలోపేతమవుతుందని ప్రధాని కెయిర్ స్టార్మర్ ఆశిస్తున్నారు. అలాగే ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు కూడా మరింత పటిష్టమవుతాయని, వందల కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నారు. టారిఫ్‌లపై చర్చలు జరుగుతాయని, ఉక్రెయిన్ విషయమై ట్రంప్‌పై ఒత్తిడి తీసుకురావచ్చని బ్రిటన్ నాయకత్వం భావిస్తోంది.
వాణిజ్యం కోసమే
ప్రధానంగా వాణిజ్య ఒప్పందం కోసమే తన బ్రిటన్ పర్యటన ఉద్దేశించబడిందని మంగళవారం ట్రంప్ వ్యాఖ్యానించారు. మరికొంత మెరుగైన రీతిలో వాణిజ్యఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తారని భావిస్తున్నానని వారితో మాట్లాడతానని చెప్పారు.