నవతెలంగాణ హైదరాబాద్: సీపీఐ(ఎం), వామపక్ష పార్టీల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా వచ్చిన మహాత్మా గాంధీ పేరుమీద ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (mgnrega) కేంద్ర బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. దీని స్థానంలో “విబి-జి రామ్ జి” పేరుతో కొత్త చట్టాన్ని తెస్తూ నిధుల కోత, పనిదినాల కోతకు కుట్ర చేసింది. కూలీల పొట్టగొట్టే కేంద్ర ప్రభుత్వ చర్యలను సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది.
పార్టీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఎంజీఎనఆరఇజీఏ చట్టాన్ని కాపాడుకోవడానికి జనవరి 30 నుండి ఫిబ్రవరి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సభలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నది. ఈ కార్యక్రమాల్లో ఉపాధి హామీ కార్మికులు, వ్యవసాయ కూలీలు, ప్రజా సంఘాల కార్యకర్తలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నది.



