Tuesday, November 25, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాకు నిఘా సమాచారం ఇవ్వం

అమెరికాకు నిఘా సమాచారం ఇవ్వం

- Advertisement -

ఇస్తే వెనిజులాపై దాడి చేయొచ్చు : యూరోపియన్‌ దేశాల అనుమానం
వాషింగ్టన్‌ :
మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునే పేరుతో వెనిజులాపై అమెరికా చేపట్టిన సైనిక చర్య, భూతల దాడులు చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న బెదిరింపుల నేపథ్యంలో యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. కరేబియన్‌లోని కొన్ని వ్యూహాత్మక ప్రాంతాలు ఆయా దేశాల చేతిలో ఉన్నాయని, అందుకే అవి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని పరిశీలకులు తెలిపారు. కరేబియన్‌ ప్రాంతానికి సంబంధించి ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌, బ్రిటన్‌ వంటి యూరోపియన్‌ దేశాలు అమెరికాకు నిఘా సమాచారాన్ని చేరవేస్తున్నాయి. అయితే తాము అందిస్తున్న సమాచారాన్ని ఉపయోగిం చుకొని వెనిజులాపై అమెరికా దాడికి తెగబడుతుందేమోనని ఆయా దేశాలు ఇప్పుడు అనుమానిస్తున్నాయి. వలసవాద పాలకుల నుంచి బ్రిటన్‌ కొన్ని కరేబియన్‌ ప్రాంతాలను పొందింది. కొన్ని పెద్ద పెద్ద దీవులు ఇప్పుడు అధికారికంగా ఫ్రాన్స్‌లో భాగంగా ఉన్నాయి. ఇక వెనిజులా తీరంలోని మూడు దీవులు నెదర్లాండ్స్‌ అధీనంలో ఉన్నాయి. మదురో ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి అమెరికా కుట్ర చేస్తోందని, తీర ప్రాంతంలో యుద్ధ విమాన వాహన నౌకను మోహరించిందని వెనిజులా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. వెనిజులా అధ్యక్షుడు మదురో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారని అమెరికా నిందలు వేస్తోంది. వీటిని వెనిజులా పదే పదే ఖండిస్తూనే ఉన్నప్పటికీ అగ్రరాజ్యం ఆరోపణలు మాత్రం ఆగడం లేదు.
కాగా వెనిజులా తీరానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న తన దీవుల విషయంలో ఫ్రాన్స్‌ ఆందోళన చెందుతోందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో ఏ యూరోపియన్‌ దేశం కూడా అమెరికాతో నిఘా సమాచారాన్ని పంచుకోబోదని ఫ్రాన్స్‌కు చెందిన సీనియర్‌ పోలీస్‌ అధికారి డిమిత్రీ జోలస్‌ చెప్పారు. నిఘా సమాచారాన్ని అమెరికాకు చేరవేస్తే అది దాడికి దారితీయవచ్చునని ఫ్రాన్స్‌ వర్గాలు అనుమానిస్తున్నాయి. కాగా నిఘా సమాచారాన్ని అమెరికాకు అందిస్తే కరేబియన్‌లో మాదక ద్రవ్యాల డీలర్లను ట్రంప్‌ మట్టుపెట్టే అవకాశం ఉన్నదని బ్రిటన్‌ చెబుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -