ఓయూలో సమస్యలను పరిష్కరించండి : సీఎం రేవ్‌ంరెడ్డికి మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గురుకులాల్లోని విద్యార్థులకు పురుగుల్లేని భోజనం అందించాలని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో సమస్యలను పరిష్కరించాలని కోరారు. గురుకులాలు, ఓయూ విద్యార్థుల నిరసనలపై హరీశ్‌రావు గురువారం ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. కల్తీ ఆహారం వదంటూ సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ మండలం ఎస్టీ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారని గుర్తు చేశారు. భోజనం బాగుండటం లేదని ఓయూలో విద్యార్థులు నిరసన తెలిపారని వివరించారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట జరుగుతున్నా విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉలుకు లేదు, పలుకు లేదని విమర్శించారు.
నిత్యం గాలి మోటార్లలో చక్కర్లు కొట్టే సీఎంకు గురుకులాల్లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులపై సమీక్షించే తీరిక లేకపోవడం సిగ్గుచేటని తెలిపారు. ఓయూకు వెళ్లి రిబ్బన్లు కట్ చేయడం తప్ప రెండున్నరేండ్లుగా చేసిన అభివృద్ధి ఏముందని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ది కోసమే అంటూ ఇప్పటి వరకు 62 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్‌రెడ్డి సాధించిదేంటో మొన్నటి కేంద్ర బడ్జెట్‌తోనే తేటతెల్లమైందని విమర్శించారు. గురుకులాల ఖ్యాతిని మసకబార్చిన రేవంత్‌రెడ్డి, అంచనాలు పెంచి కమీషన్లు దండుకోవడానికే యంగ్ ఇండియా స్కూల్స్ పేరిట భారీ నాటకానికి తెరతీశారని తెలిపారు.
గురుకులాల్లో పిల్లలకు మంచి భోజనం పెట్టలేని ప్రభుత్వం, అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పిస్తుందట అని ఎద్దేవా చేశారు. పురుగుల్లేని అన్నం కోసం విద్యార్థులు నడిరోడ్డెక్కి నిరసన తెలిపే దుస్థితి కల్పించడమేనా ఇందిరమ్మ రాజ్యం?అని ప్రశ్నించారు. ఓయూ విద్యార్థులు, తల్లిదండ్రులకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా అవమానించడమేనా ప్రజాపాలన?అని తెలిపారు. హార్వర్డ్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయానికి వెళ్లి వచ్చినా కూడా రేవంత్‌రెడ్డి విద్య పట్ల, విద్యార్థుల పట్ల ప్రాధాన్యం చూపకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ మీద దృష్టి సారించాలనీ, గురుకుల విద్యార్థులకు పురుగుల్లేని భోజనం అందించాలనీ, ఓయూలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
గురుకులాల్లో పురుగుల్లేని భోజనం అందించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



