మనీలాండరింగ్‌పై ఈడీ కీలక విచారణ
అనిల్ అంబానీ ఫ్రాడ్ కేసులో
మూడో రోజూ కొనసాగుతున్న సోదాలు
పలు ఫైల్స్ స్వాధీనం
న్యూఢిల్లీ : దిగ్గజ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ తన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) కోసం తీసుకున్న రుణాల మళ్లింపు కేసులో ఆయనకు చెందిన కార్యాలయాల్లో వరుసగా మూడో రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలను కొనసాగిస్తోంది. ముంబయిలోని అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు చెందిన కార్యాలయాలు, ఇతర ప్రాంతాల నుంచి పలు ఫైల్స్, కంప్యూటర్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని స్పష్టమవుతోంది. సీబీఐ నమోదు చేసిన రెండు ప్రాథమిక సమాచార నివేదికల ఆధారంగా ఈడీ దర్యాప్తు సాగుతుంది. గురువారం నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ముంబయి, ఢిల్లీ నగరాల్లో 35కి పైగా చోట్ల, 50 కంపెనీలు, 25 కంటే ఎక్కువ మందిపై ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్టు ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రాథమిక సమాచారం ప్రకారం.. 2017 నుంచి 2019 మధ్యకాలంలో యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3,000 కోట్ల రుణాలను ఆర్‌కామ్ అనుమానాస్పద రీతిలో దారి మళ్లించింది. యెస్ బ్యాంక్ మాజీ ప్రమోటర్లకు లంచం ఇచ్చారనే ఆరోపణలున్నాయి. యెస్ బ్యాంక్ మాజీ ఎండీ ప్రమోటర్ రాణా కపూర్‌పై దాఖలైన మనీలాండరింగ్ కేసులో భాగంగా 2020లో అనిల్ అంబానీ ఈడీ ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే. నేషనల్ హౌసింగ్ బ్యాంక్, సెబీ, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ, బ్యాంక్ ఆఫ్ బరోడాతో సహా పలు నియంత్రణ, ఆర్థిక సంస్థల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా సీబీఐ నమోదు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఇడి తాజాగా రంగంలోకి దిగింది. ఆర్‌కామ్ తీసుకున్న రుణాన్ని ఫ్రాడ్‌గా వర్గీకరించాలని ఎస్బీఐ నిర్ణయించింది. కాగా.. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈ సోదాల గురించి స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చాయి. వీటివల్ల తమ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం లేదని పేర్కొన్నాయి. ప్రస్తుత ఈ సోదాలు మనీలాండరింగ్‌కు సంబంధించినవిగా తెలుస్తోంది. ”బ్యాంకులు, వాటాదారులు, పెట్టుబడిదారులు, ఇతర ప్రభుత్వ సంస్థలను మోసం చేయటం ద్వారా ప్రజా ధనాన్ని మళ్లించటానికి, దోచుకోవటానికి చాలా ప్రణాళికబద్ధంగా పథకం వేసినట్టు ఈడీ ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది.
ప్రజాధనాన్ని కొల్లగొట్టారు
- Advertisement -
- Advertisement -