– లేబర్ కోడ్లను తిప్పికొట్టడమే మోటూరుకి నిజమైన నివాళి
– పూర్ణచంద్రరావు స్మారక సభలో వక్తలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రముఖ కార్మిక నాయకులు, సీఐటీయూ హైదరాబాద్ జిల్లా మాజీ కార్యదర్శి మోటూరు పూర్ణచంద్రరావు స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్మించాలని పలువురు వక్తలు అన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులను సంఘటితం చేసి కేంద్రం కుట్రలను అడ్డుకోవడమే పూర్ణచంద్రరావుకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. హైదరాబాద్ లో జూబ్లిహిల్స్ కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం పూర్ణచంద్రరావు స్మారక సభను ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించారు. పలు కార్మిక సంఘాల నాయకులు, సీఐటీయూ నేతలు, సీపీఐ(ఎం), ప్రజా సంఘాల నాయకులు, మోటూరు అభిమానులు, బంధు మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి మాట్లాడుతూ.. ఐద్వా రాష్ట్ర కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే.. ఏడాదిలోగా భవనాన్ని నిర్మించి ఐద్వాకు అప్పగించిన గొప్ప నాయకులు మోటూరు పూర్ణచంద్రరావు అని కొనియాడారు. పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మెన్ డిజి.నర్సింహారావు మాట్లాడుతూ.. మానవతా విలువలు కలిగిన గొప్ప కార్మిక నేత మోటూరు అని, ఆయన ద్వారానే తాను విద్యార్థి ఉద్యమం నుంచి సీపీఐ(ఎం)లోకి వచ్చినట్టు చెప్పారు. కార్మిక సంఘాల నాయకులను జైళ్లలో పెట్టినప్పుడు వారి కుటుంబాలకు పూర్ణచంద్రరావు ప్రతినెలా ఆర్థిక సహాయం చేశారని, అందులో తనను కూడా భాగస్వామ్యం చేశారని వివరించారు.
సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. చివరివరకూ ప్రజల కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి పూర్ణచంద్రరావు అన్నారు. ఎప్పుడు కలిసినా సమకాలీన రాజకీయ విశ్లేషణ, ప్రజాశక్తి గురించే మాట్లాడేవారని గుర్తు చేసుకున్నారు. ప్రజాశక్తి ఎడిటర్ తులసీదాస్ మాట్లాడుతూ.. ప్రజాశక్తి పత్రికకు మోటూరు పూర్ణచంద్రరావు అందించిన సహకారం పత్రిక చరిత్రలో చిరకాలం నిలిచి ఉంటుందన్నారు. మోటూరు హనుమంతరావు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కావడం వల్ల ప్రజాశక్తితో పూర్ణచంద్రరావుకు చాలా దగ్గర సంబంధం ఉండేదన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజాశక్తి కృషి చేస్తుందని చెప్పారు. మోటూరు కుమారులు ప్రమోద్, ప్రవీణ్, కుమార్తె పద్మజ మాట్లాడుతూ.. తమ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంటీ ట్రేడ్ యూనియన్ నాయకులు కోటేశ్వరరావు, గోపీచంద్, పివి.సత్యనారాయణ, సిహెచ్.మల్లేశ్వరాచారి, పీఎస్‌ఎన్ మూర్తి, జన విజ్ఞాన వేదిక నాయకులు వరప్రసాద్, ఈసీఐఎల్ ట్రేడ్ యూనియన్ నాయకులు ఎస్.నర్సింహారెడ్డి, పూర్ణచంద్రరావు కటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మోటూరు పూర్ణచంద్రరావు స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES