న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబరు 4, 5 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. పుతిన్ నేతృత్వంలోని రష్యా ప్రతినిధి బృందం 23వ భారత్-రష్యా వార్షిక సదస్సులో పాల్గొంటుందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సమీక్షించేందుకు ఇరు దేశాల నాయకత్వానికి ఈ పర్యటన ఒక అవకాశాన్ని కల్పిస్తోందని విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. అలాగే ఇప్పటికే ఇరు దేశాల మధ్య వున్న ప్రత్యేక, విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు దార్శనికతను నిర్ధారించడం, పరస్పర ఆసక్తి కలిగిన అంశాలతో పాటూ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై పరస్పరం అభిప్రాయాల మార్పిడికి కూడా ఈ పర్యటన దోహదపడుతుందని పేర్కొంది. 2021లో జరిగిన 21వ వార్షిక సదస్సుకు పుతిన్ హాజరయ్యారు. ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములతో చర్చలు జరుపుతారు. 28 పాయింట్లతో ఉక్రెయిన్-రష్యా శాంతి ప్రణాళికను ట్రంప్ వెలువరించిన నేపథ్యంలో పుతిన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.



