
– మండలంలో పలు పాఠశాలలను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి
నవతెలంగాణ-కోహెడ
ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా కలెక్టర్ మనుచౌదరి అన్నారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు మండలంలోని కాచాపూర్, సోమరంపల్లి, శనిగరం గ్రామాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, ప్రాథమిక పాఠశాలలను, అంగన్వాడి సెంటర్లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తరగతి గదులలో విద్యార్థులతో ముచ్చటించారు. ఉపాధ్యాయుల బోధన, మధ్యాహ్న భోజన పనితీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహించడం జరుగుతుందని అందరూ శ్రద్ధగా చదివి ఫలితాల్లో 10 జిపిఏ తెచ్చుకోవాలన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని జిల్లాలో వెయ్యికి పైగా పాఠశాలలో త్రాగునీరు, మరుగుదొడ్డి, విద్యుత్, కాంపౌండ్ వాల్, కిషన్ షెడ్లు మైనర్ రిపేర్లు తదితర పనులను సంపూర్ణంగా చేపట్టడం జరిగిందని అన్నారు. ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన కొన్ని ప్రభుత్వ పాఠశాలలు గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులు లేక మూతపడడం ఆందోళనకరమైన విషయమని కోహెడ, అక్కన్నపేట మండలాల్లో సుమారు 15 పాఠశాలలు మూతపడ్డాయని, మూతపడడానికి గల కారణాలు తెలుసుకొని తల్లిదండ్రులను మోటివేట్ చేసి విద్యార్థులను చేర్పించి వాటిని మళ్లీ తెరవడానికి విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కొన్ని పాఠశాలలలో ఇప్పటికే కొంతమంది విద్యార్థులు చేర్చడం జరిగిందని నాణ్యమైన ఉచిత విద్య, పాఠ్యపుస్తకాలు, నోటు బుక్కులు, రెండు జతల యూనిఫామ్ ను అందిస్తూ క్వాలిఫైడ్ టీచర్లచే విద్యా బోధన జరుగుచున్న ప్రభుత్వ పాఠశాలలకే తమ పిల్లలను పంపించాలని సూచించారు.సోమారంపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులు రాకపోవడం, అంగన్వాడికి భవనం లేకపోవడంతో ప్రాథమిక పాఠశాల భవనంలో అంగన్వాడి నడిపిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా అంగన్వాడి భవన నిర్మాణానికి, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని విద్యాశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. కాచాపూర్ గ్రామంలో రెండు సంవత్సరాలుగా మూతపడిన ప్రాథమిక పాఠశాలను తిరిగి పునరుద్ధరించడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలలో కాంప్లెక్స్ హెచ్ఎం మహమూద్, విద్యాశాఖ సెక్టోరల్ అధికారి రామస్వామి, కమ్యూనిటీ నోబలైజర్ పద్మయ్య, పాఠశాలల ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు.