ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యాబోధన

నవతెలంగాణ – రాయపోల్: ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందించడం జరుగుతుందని రాయపోల్ సర్పంచ్ మౌనిక రాజిరెడ్డి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ అన్నారు. బుధవారం రాయపోల్ మండల కేంద్రం ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాసం, ఏకరూప దుస్తువుల పంపిణీ, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలు ఎంతో మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మన ఊరి మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయన్నారు. గతంలో పాఠశాలలో సరైన వసతులు సౌకర్యాలు లేక విద్యార్థులు చదువుకోవడానికి ఎన్నో అవస్థలు పడేవారని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వమే ఉచితంగా ఏకరూప దుస్తులను అందజేస్తుందని, ఉచితంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తూ, విద్యార్థుల ఆకలి తీర్చడానికి నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తుందన్నారు. కాబట్టి విద్యార్థులు అందరూ ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను వినియోగించుకొని పాఠశాలకు తల్లిదండ్రులకు గొప్ప పేరు తెచ్చే విధంగా చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్, ఉపాధ్యాయులు కృష్ణ, భాస్కర్, విజయ, ఉప సర్పంచ్ సత్తమ్మ, పంచాయతీ కార్యదర్శి శివకుమార్, అంగన్వాడీ టీచర్లు ఆగమ్మ, పద్మ, సంతోష, రేఖ, ఎస్ఎంసి చైర్మన్ నర్సింలు, సిఆర్పి కుమారస్వామి, గ్రామస్తులు ప్రసాద్, ఇషాక్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love