Thursday, March 12, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుడీజీపీ పోస్ట్‌ కోసం రేస్‌

డీజీపీ పోస్ట్‌ కోసం రేస్‌

- Advertisement -

ముగ్గురు ఐపీఎస్‌ల లిస్ట్‌ రెడీ చేసిన యూపీఎస్సీ
నేడో, రేపో రాష్ట్రానికి జాబితా
సీవీ ఆనంద్‌, షికాగోయల్‌లో ఒకరికి ఛాన్స్‌ ?

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర నూతన డీజీపీ పోస్ట్‌ కోసం ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల పేర్లను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) బుధవారం ఖరారు చేసినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి, రెండు రోజుల్లో పంపించే అవకాశముంది. రాష్ట్రంలో ప్రస్తుతం డీజీపీగా బత్తుల శివధర్‌ రెడ్డి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అయితే డీజీపీ ఎంపిక సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన విధి, విధానాల ప్రకారం జరగలేదనీ, ముఖ్యంగా యూపీఎస్సీకి సీనియర్‌ ఐపీఎస్‌ల జాబితాను డీజీపీ పోస్ట్‌ ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపించలేదని ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో సుప్రీంకోర్టు సైతం ఇదే అంశంపై దాఖలైన పిటిషన్‌ ను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం యూపీఎస్సీకీ తక్షణమే సీనియర్‌ ఐపీఎస్‌ల జాబితాను పంపించాలని రాష్ట్ర సర్కారును ఆదేశించింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 1990 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్‌ (రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ), 1994 బ్యాచ్‌కు చెందిన అభిలాషబిస్ట్‌ (పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌), ప్రభాకర్‌ ఆప్టే (కేంద్ర డిప్యూటేషన్‌ ), శివధర్‌ రెడ్డి (రాష్ట్ర ఇన్‌చార్జి డీజీపీ), షికాగోయల్‌, (టీవీసీఎస్‌బీ డీజీపీ), సౌమ్య మిశ్రా (జైళ్ల శాఖ డీజీ) పేర్లను యూపీఎస్సీకి ప్రభుత్వం పంపించింది. ఈ జాబితాను కూలంకషంగా పరిశీలించిన యూపీఎస్సీ సీవీ ఆనంద్‌, షికాగోయల్‌, సౌమ్య మిశ్రాల పేర్లను రాష్ట్ర డీజీపీ పోస్ట్‌ కోసం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుత డీజీపీ శివధర్‌ రెడ్డి గత ఆరు మాసాలుగా విజయవంతంగా ఆ పోస్టును నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఆయన సర్వీసు ఏప్రిల్‌ మాసంలో ముగుస్తుండటంతో సర్వీస్‌ లేని కారణంగా ఆయన పేరును యూపీఎస్సీ ప్రతిపాదించలేదని తెలుస్తోంది. మరోవైపు పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ అభిలాషబిస్ట్‌ సమర్థురాలైన ఐపీఎస్‌ అధికారి అయినప్పటికీ ఆమె సర్వీస్‌ సైతం జూన్‌ నెలలో ముగుస్తుండటంతో ఆమె పేరును కూడా సుదీర్ఘ సర్వీస్‌ లేని కారణంగా యూపీఎస్సీ జాబితాలో చేర్చలేదని విశ్వసనీయ సమాచారం.

ఇక ప్రభాకర్‌ ఆప్టేకు 3 సంవత్సరాల వరకు సర్వీసు ఉన్నప్పటికీ ఆయన రాష్ట్రానికి రావడానికి ఇష్టపడకపోవడం తో ఆయన పేరును కూడా జాబితాలో పొందుపర్చలేదని సమాచారం. ఇక ఉన్న వారిలో సీవీ ఆనంద్‌కు రెండున్నరేండ్లు, షికాగోయల్‌ కు మూడేండ్లు, సౌమ్య మిశ్రాకు 15 నెలలకు పైగా సర్వీసు ఉంది. దీంతో వీరి సర్వీసు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన యూపీఎస్సీ ఈ ముగ్గురి పేర్లను జాబితాలో చేర్చి వీరిలో నుంచి ఒకరిని డీజీపీ పోస్ట్‌కు ఎంపిక చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనుందని తెలిసింది. కాగా ఈ ముగ్గురిలో ఎవరికి పోలీస్‌ పగ్గాలు తగ్గుతాయోనన్న ఉత్కంఠ ఐపీఎస్‌ వర్గాల్లో నెలకొంది. ముఖ్యంగా సీవీ ఆనంద్‌, షికాగోయల్‌లో ఒకరికి డీజీపీ హోదా దక్కే అవకాశముందని భావిస్తున్నారు. సీనియార్టీ ప్రకారం చూసి సీవీ ఆనంద్‌ కే ఎక్కువగా అవకాశాలుండగా, మహిళా పోలీస్‌ అధికారులను ప్రోత్సహిస్తున్నామని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో షికాగోయల్‌కు ఛాన్స్‌ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదని ఐపీఎస్‌ వర్గాల్లో చర్చ సాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -