గతేడాదితో పోలిస్తే పెరిగిన నేరాల సంఖ్య
78 శాతం కేసుల పరిష్కారం
పెరిగిన కిడ్నాప్, పోక్సో కేసుల సంఖ్య
2025లో 3734సైబర్ క్రైమ్ కేసులు నమోదు
రాచకొండలోనే 31మందికి జీవిత ఖైదు విధింపు
రూ. 20.01కోట్ల డ్రగ్స్ స్వాధీనం
రాచకొండ సీపీ సుధీర్‌బాబు వెల్లడి
రాచకొండ నేర వార్షిక నివేదిక విడుదల
నవతెలంగాణ- హయత్‌నగర్
రాచకొండ పోలీస్ కమిషనరేట్ ప్రీ ఎన్‌బీడబ్ల్యూగా ఉండటం గర్వంగా ఉందని సీపీ సుధీర్‌బాబు తెలిపారు. రాచకొండలో ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగిందన్నారు. దేశంలోనే అతిపెద్ద కమిషనరేట్ అయిన రాచకొండ 2025 క్రైమ్ వార్షిక నివేదికను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో మొత్తం 51 పోలీస్ స్టేషన్‌లు ఉన్నాయని తెలిపారు. 2024లో 28,626 కేసులు నమోదు కాగా.. 2025లో 33,040 కేసులు నమోదయ్యాయని వివరించారు. ఈ ఏడాదిలో 78 శాతం కేసులు పరిష్కారం అయ్యాయని చెప్పారు. నేరాల సంఖ్య పెరిగినప్పటికీ 21,056 కేసులను పరిష్కరించడం గర్వకారణమన్నారు. ముఖ్యంగా కిడ్నాప్, పోక్సో కేసులు పెరిగినట్టు సీపీ తెలిపారు. ఈ ఏడాది 579 కిడ్నాప్ కేసులు, 1,224 పోక్సో కేసులు నమోదయ్యాయన్నారు.
మహిళలపై నేరాలు గత ఏడాదితో పోలిస్తే 4 శాతం పెరిగినట్టు చెప్పారు. వరకట్న హత్యలు 6 కేసులు, వరకట్న మరణాలు 12 కేసులు, ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులు 52, వేధింపులు-గృహహింస కేసులు 782, మహిళల హత్యలు 18, లైంగికదాడుల్లో 330 కేసులు నమోదైనట్టు వివరించారు. 12 కీలక కేసుల్లో దోషులకు 20 ఏండ్ల జైలు శిక్ష పడేలా పటిష్ట దర్యాప్తు నిర్వహించామని తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది జీవిత ఖైదు శిక్ష పడిన 31 కేసులు రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే నమోదవ్వడం విశేషమన్నారు. ఇందులో అడ్డగూడూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హత్య కేసులో 17 మందికి శిక్ష పడినట్టు చెప్పారు. డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపామని, ఈ ఏడాది రూ.20.01 కోట్ల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుని 495 మందిని అరెస్టు చేసినట్టు సీపీ తెలిపారు. ఇందులో తెలంగాణకు చెందిన 322 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన 172 మంది, ఒక విదేశీయుడు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే 227 ఎన్డీపీఎస్ అనుమానిత షీట్లను తెరిచామని చెప్పారు.
సైబర్ నేరాల విషయంలో 3,734 కేసులు నమోదు కాగా, రూ.40.10 కోట్ల నగదును రికవరీ చేసినట్టు తెలిపారు. మొత్తం 6,188 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశామన్నారు. ఈ ఏడాది ఎక్సైజ్ యాక్ట్ కింద 656 కేసులు నమోదు చేయగా.. 689 మందిని అరెస్టు చేసినట్టు సీపీ తెలిపారు. కాగా 6,824 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు చెప్పారు. గేమింగ్ యాక్ట్ కింద 227 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ కేసుల్లో 1,472 మంది అరెస్టు కాగా.. రూ.69 లక్షల ప్రాపర్టీ సీజ్ చేసినట్టు చెప్పారు. అలాగే.. మర్డర్ ఫర్ గెయిన్ 3, దోపిడీ 3, దొంగతనాలు 67, ఇండ్లలో చోరీ 589, వాహనాల చోరీ 876, సాధారణ చోరీలు 1,161, హత్యలు 73, లైంగికదాడులు 330, వరకట్నం మరణాలు 12, గృహ హింస కింద 782 కేసులు నమోదయినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎల్‌బీనగర్, మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి డీసీపీలు, ట్రాఫిక్ డీసీపీలు, ఎస్‌ఓటీ అడిషనల్ డీసీపీ, అడిషనల్ డీసీపీలు పాల్గొన్నారు.



