Friday, March 27, 2026
E-PAPER
Homeజాతీయంరెచ్చగొట్టేలా రాహుల్‌గాంధీ ప్రకటనలు

రెచ్చగొట్టేలా రాహుల్‌గాంధీ ప్రకటనలు

- Advertisement -

ఖండించిన సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై, సీపీఐ(ఎం) లౌకికవాద విశ్వసనీయతపై కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గేల రెచ్చగొట్టే ప్రకటనలను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. వారు, ఇటువంటి నిరాధారమైన వార్తలను ప్రచారం చేయడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో చవకబారు ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారని విమర్శించింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. బీజేపీకి బదులుగా సీపీఐ(ఎం)ను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కాంగ్రెస్‌ నేతలు, మతోన్మాద, నిరంకుశవాద శక్తులపై పోరాటం సాగిస్తామంటూ ఇచ్చిన హామీలను ఉల్లంఘిస్తున్నారని పొలిట్‌బ్యూరో విమర్శించింది.

కేరళ ప్రజలు ఈ కుట్రపూరిత ఎజెండాను గ్రహిస్తారని పేర్కొంది. ఒక రాష్ట్రం తర్వాత మరొక రాష్ట్రంలో వరుసగా తమ నేతలు ఎందుకు పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారో కాంగ్రెస్‌ నేతలు తప్పనిసరిగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సి వుందని ఆ ప్రకటన పేర్కొంది. ప్రస్తుత అసోం ముఖ్యమంత్రి గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కీలకమైన పదవులు నిర్వహించారన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. త్రిపురలో, 2018లో లెఫ్ట్‌ ఫ్రంట్‌ను ఓడించేందుకు గానూ మొత్తంగా కాంగ్రెస్‌ నాయకత్వం బీజేపీలో చేరింది. కేంద్ర ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, బీజేపీకి చెందిన పలువురు పార్లమెంట్‌ సభ్యులు గతంలో కాంగ్రెస్‌లో ప్రముఖ నేతలే. కాంగ్రెస్‌, బీజేపీకి పోషక సంస్థగా మారిపోయిందని పొలిట్‌బ్యూరో ప్రకటన విమర్శించింది. పదేండ్ల ప్రస్తుత ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వ హయాంలో, కేరళలో మతోన్మాద అల్లర్లు జరిగిన సంఘటన ఒక్కటీ లేదు. మరోవైపు రాష్ట్రంలోని మరద్‌లో జరిగిన అత్యంత అధ్వాన్నమైన మతోన్మాద ఘర్షణలు యూడీఎఫ్‌ ప్రభుత్వ హయాంలోనే చోటు చేసుకున్నాయి.

ఈ ఎన్నికల్లో కూడా, కాంగ్రెస్‌, మైనారిటీ ఛాందసవాద శక్తులతో జత కడుతోంది. ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికలతో సహా కేరళలో వివిధ ఎన్నికల్లో కాంగ్రెస్‌-లీగ్‌-బీజేపీ బంధం బయటపడింది. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని సీపీఐ(ఎం) ప్రతీసారీ వ్యతిరేకిస్తూనే వస్తోంది. మరోవైపు ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మాత్రం ఈడీ, ఇతర కేంద్ర సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష ముఖ్యమంత్రిని అరెస్టు చేయాలని పిలుపిస్తున్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ను అరెస్టు చేయాలని కూడా గతంలో కాంగ్రెస్‌ ఇలాగే పిలుపిచ్చిన విషయాన్ని మరిచిపోరాదు. ఇవన్నీ, వారి అవకాశవాద వైఖరిని తేటతెల్లం చేస్తున్నాయని పొలిట్‌బ్యూరో పేర్కొంది.ఎల్‌డీఎఫ్‌ పాలనలో గత పదేండ్లుగా అనూహ్యమైన రీతిలో అభివృద్ధిని, మత సామరస్యతను కండ్లారా చూస్తున్న కేరళ ప్రజలు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు గట్టి గుణపాఠం చెబుతారని పొలిట్‌బ్యూరో పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -