– ఈదురుగాలతో నేల వాలిన పంటలు
– వరి రైతుకు అపార నష్టం
– కళ్ళల్లో తడిసిన వరి ధాన్యం, నువ్వులు
నవతెలంగాణ కమ్మర్ పల్లి
మండలంలో బుధవారం తెల్లవారుజామున వర్షం బీభత్సం సృష్టించింది. సుమారు గంటన్నర పాటు బలమైన ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షంతో పలు పంటలకు నష్టం వాటిల్లింది. పలుచోట్ల బలంగా వీచిన ఈదురు గాలులకు జొన్న, నువ్వు పంటలు నేల వాలాయి. కళ్ళల్లో ఆరబెట్టిన వరి ధాన్యం భారీ వర్షానికి తడిసిపోయింది. పలువురు రైతులు వరి ధాన్యాన్ని కాపాడుకునేందుకు ప్లాస్టిక్ కవర్లను కప్పి ఉంచినప్పటికీ ఈదురు గాలుల మూలంగా కవర్లు తొలగిపోవడంతో ధాన్యం తడిసింది.మరికొందరు రైతులకు సంబంధించిన వరి ధాన్యంపై ప్లాస్టిక్ కవర్లు ఉన్నప్పటికీ భారీ వర్షం మూలంగా అడుగు భాగంలో ఉన్న ధాన్యం వర్షపు వరద నీటికి తడిసిపోయింది. బలంగా వీచిన ఈదురు గాలులతో కూడిన వర్ష మూలంగా పలుచోట్ల చెట్లు వేర్లతో సహా, మరి కొన్ని చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. భారీ వర్షం, బలంగా వేచిన ఈదురుగాలుల మూలంగా వరి పంటకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోతున్నారు.
కొందరు రైతులు సంబంధించిన వరి ధాన్యం తూకం జరిగి, బస్తాల్లో నింపి రైస్ మిల్ కు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన తరుణంలో భారీ వర్షం మూలంగా వరి ధాన్యం సంచులు నాని ముద్దయ్యాయి. కప్పి ఉంచిన వరి ధాన్యం చుట్టూ వరద నీరు చేరి కుంటలను తలపిస్తుంది.దులిపేందుకు కోత కోసి కళ్ళల్లో ఆరబెట్టిన నువ్వు పంట తడవడంతోపాటు, వరద నీటిలో పంట కొట్టుకుపోయి రైతుకు నష్టం చేకూరింది. ఖరీఫ్ లో విత్తుకునేందుకు రైతులు నిల్వ ఉంచుకున్న విత్తనం పసుపు కూడా తడిసి ముద్దయ్యింది. తవడం మూలంగా విత్తనం పసుపు నీరు పట్టి మురిగిపోయే ఆస్కారం ఉందని, తద్వారా ఖరీఫ్లో విత్తుకునేందుకు విత్తనం పసుపు దొరక్క ఇబ్బందులు ఎదురవుతాయని రైతులు వాపోతున్నారు.చేతికొచ్చింది అనుకున్న పంట చెడగొట్టు వానల మూలంగా నేల పాలవ్వడంతో నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన వరి ధాన్యం రంగు మారి, మొలకలు వస్తే కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర లభించక ఇబ్బందులు ఎదురవుతాయని రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల మూలంగా నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.