దేశవ్యాప్తంగా నిరసనలకు వామపక్షాల పిలుపు
న్యూఢిల్లీ : వెనిజులాపై అమెరికా సాయుధ దురాక్రమణను, అధ్యక్షుడు మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను కిడ్నాప్ చేయడాన్ని వామపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఒక సార్వభౌమాధికార దేశంపై సాగించిన ఈ దాడి ఐక్యరాజ్య సమితి నిబంధనావళిని దారుణంగా ఉల్లంఘించిందని పేర్కొన్నాయి. సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్)- లిబరేషన్, ఆర్‌ఎస్‌సీ, ఏఐఎఫ్‌బి నేతలు వరుసగా ఎం.ఎ.బేబీ, డి.రాజా, దీపంకర్ భట్టాచార్య, మనోజ్ భట్టాచార్య, జి.దేవరాజన్ ఆదివారం ఈ మేరకు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. వెనిజులా చమురు నిల్వలను తాము హస్తగతం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో ఈ దురాక్రమణ చర్య వెనుక గల వాస్తవ ఉద్దేశాలు స్పష్టంగా బహిర్గతమయ్యాయి. అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో మరో అడుగు ముందుకేసి తమ తదుపరి లక్ష్యం క్యూబా, మెక్సికోలేనని హెచ్చరించారు. అమెరికా జాతీయ భద్రతా వ్యూహం, 2025ను విడుదల చేసిన అనంతర కాలంలో చేసిన ఈ ప్రకటనలు చూస్తుంటే అవసరమైతే సైనిక దాడులు చేయడానికైనా వెనుకాడకుండా యావత్ ప్రపంచంపై అమెరికా సామ్రాజ్యవాదం తన గుత్తాధిపత్యాన్ని చెలాయించాలని చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. మొత్తంగా పశ్చిమార్థ గోళాన్ని తమ ఇంటి పెరడుగా భావించాలని పేర్కొంటున్న మన్రో సిద్ధాంత భావజాలాన్ని అమెరికా ఇక్కడ అమలు చేయాలనుకుంటోంది.
వెనిజులా నుంచి వస్తున్న వార్తలు చూస్తుంటే, అమెరికా దురాక్రమణకు వ్యతిరేకంగా, తమ దేశ సార్వభౌమాధికారానికి మద్దతుగా పెద్ద సంఖ్యలో ప్రజలు సమీకృతులవుతున్నట్టు తెలుస్తోంది. పోరాట బాట పడుతున్న వెనిజులా ప్రజలకు సంపూర్ణ మద్దతు, సంఘీభావాన్ని వామపక్షాలు ప్రకటించాయి. అమెరికా దురాక్రమణ చర్యలకు వ్యతిరేకంగా, లాటిన్ అమెరికా ప్రజలకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించాల్సిందిగా వామపక్షాలు పిలుపునిచ్చాయి. దేశంలోని శాంతికాముకులు, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ నిరసనల్లో చురుకుగా పాల్గొనాలని వామపక్షాల నేతలు కోరారు. అమెరికా దురాక్రమణను ఖండిస్తూ, వెనిజులాకు బాసటగా నిలబడుతూ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వినిపించిన నిరసన గళంతో భారత ప్రభుత్వం కూడా గళం కలపాలని ఆ ప్రకటనలో వామపక్షాలు విజ్ఞప్తి చేశాయి.
అమెరికాకు నిరసన గళం వినిపించండి
- Advertisement -
- Advertisement -



