బాధితులనే చిత్రహింసలు పెట్టడం ఏంటి..?
కుల దురహంకార హత్యలపై ముఖ్యమంత్రి స్పందించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
ఎర్ర రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించిన సీపీఐ(ఎం) బృందం
నవతెలంగాణ-షాద్‌నగర్‌రూరల్
పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఎర్ర రాజశేఖర్ హత్య జరిగిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులే బాధితులను చిత్రహింసలు పెట్టడం ఏంటనీ ప్రశ్నించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సోమవారం రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో కుల దురహంకారానికి బలైన ఎర్ర రాజశేఖర్ కుటుంబాన్ని సీపీఐ(ఎం) కార్యదర్శి జాన్‌వెస్లీ, కేవీపీఎస్ రాష్ట్ర ఫ్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, ఆ పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు సాగర్, రాష్ట్ర కమిటీ సభ్యులు జయలక్ష్మి, పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఏ. నరసింహ, షాద్‌గర్ డివిజన్ కార్యదర్శి ఎన్.రాజు తదితరులు పరామర్శించారు. మృతుని భార్య వాణి, తండ్రి మల్లేష్‌ని ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జాన్‌వెస్లీ మీడియాతో మాట్లాడారు.
దళిత యువకుడు ఎర్ర చంద్రశేఖర్ బీసీ యువతిని ప్రేమ వివాహం చేసుకుంటే అతని సోదరుడు ఎర్ర రాజశేఖర్‌ను కిడ్నాప్ చేసి హత్య చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం మేజర్లయిన యువతీ, యువకులు పెండ్లి చేసుకునే హక్కు వారికి ఉందన్నారు. దీన్ని జీర్ణించుకోలేని వధువు తండ్రి కావలి వెంకటేశ్.. మొయినాబాద్ పోలీసుల సహాయంతో పోలీస్‌స్టేషన్‌లోనే ఎర్ర చంద్రశేఖర్ తండ్రిపై, అన్న జగన్‌ను బెదిరించి చిత్రహింసలు పెట్టారని అన్నారు. ఎర్ర రాజశేఖర్‌ని కిడ్నాప్ చేసిన విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం వహించారని తెలిపారు. సకాలంలో పోలీసులు స్పందించి ఉంటే రాజశేఖర్ హత్య జరిగేది కాదని అన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నేడు జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు
ఎల్లంపల్లి గ్రామంలో చోటుచేసుకున్న హత్యను నిరసిస్తూ మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాలకు సీపీఐ(ఎం) పిలుపునిచ్చింది. పార్టీ నాయకులు, అనుబంధ సంఘాలు, ప్రజాసంఘాలతో కలిసి ప్రభుత్వ వైఫల్యాన్ని, పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎండకడతామని పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య తెలిపారు. పరామర్శించిన వారిలో పార్టీ నాయకులు బిసా సాయిబాబు, శ్రీనునాయక్, కొంగరి నర్సింలు, శ్రీకాంత్, ఈశ్వర్‌నాయక్, బేరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
కుల, మతాంతర చట్టాన్ని తీసుకురావాలి..
రాష్ట్ర ప్రభుత్వం కుల మతాంతర ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, చట్టంపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించి, కుల, మతాంతర వివాహాలు చేసుకుంటున్న యువతీయువకులకు అండగా నిలబడాలని జాన్‌వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక కుల దురహంకార హత్యలు పెరుగుతున్నాయని, ఇప్పటివరకు 142 హత్యలు జరిగాయని తెలిపారు. ఇటీవలే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కోడలిని మామ హత్య చేయటం, షాద్‌నగర్‌లో అన్నను హత్య చేయటం దారుణమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ హత్యలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. ఎర్ర రాజశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా ఇంటిని నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పోలీసులు తమ ప్రవర్తన మార్చుకొని చట్టబద్ధంగా మేజర్లయిన ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించాలన్నారు.



