లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు గాని సవాల్’. లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో, ఎల్ ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ, దర్శకత్వం వహించారు. రక్షా బంధన్ సందర్భంగా ఆగస్టు 8న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. హీరోయిన్స్ డింపుల్ హయతి, రాశీ సింగ్, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్, ప్రొడ్యూసర్స్ దామోదర ప్రసాద్, టి. రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్, గీత రచయిత గోరటి వెంకన్న, నటుడు డా.భద్రం ముఖ్య అతిథులుగా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత, హీరో లెలిజాల రవీందర్ మాట్లాడుతూ, ‘మా మూవీ ట్రైలర్ లాంచ్‌కు వచ్చిన పెద్దలు అందరికీ థ్యాంక్స్. ఇలాంటి పెద్దల మధ్య నా మూవీ ఈవెంట్ జరుపుకోవాలని కొన్నేళ్లుగా కలగం టున్నాను. అది ఈ రోజు నెరవేరడం హ్యాపీగా ఉంది. మా జీవితాల్లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్‌ను ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రమిది. సహజంగా ఉండేందుకు కవాడిగూడ రియల్ లొకేషన్స్‌లో షూటింగ్ చేశాం. మధ్య తరగతి వారి జీవితంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి. అలాంటి సందర్భంలో ఒక పెద్ద సమస్య ఎదురైతే ఆ మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ చిత్రంలో చూస్తారు. ఫ్యామిలీ బాండింగ్స్, స్నేహితుల మధ్య ఉండే అనుబంధాలను ఆకట్టుకునేలా తెరకెక్కించాం. సినిమా టెక్నికల్‌గా క్వాలిటీగా ఉండాలని టాప్ టెక్నీషియన్స్‌ను పెట్టుకున్నాం. యశ్వంత్ నాగ్ మ్యూజిక్‌లో రామ్ మిరియాల, అనురాగ్ కులకర్ణి, గోరటి వెంకన్న వంటి సింగర్స్ సాంగ్స్ పాడారు. ఈ సినిమా చూసి బాపిరాజు క్లాసికల్ మ్యూజికల్ హిట్ అవుతుందనటం హ్యాపీగా ఉంది’ అని అన్నారు.