– ధాన్యం, మిర్చి ‘సాగర్’ పాలు
– తడిసిన ధాన్యాన్ని ఎత్తిపోసుకుంటున్న అన్నదాతలు
– నీటిపారుదల శాఖ అధికారులపై రైతుల ఆగ్రహం
– కల్వర్టు మరమ్మతులు వెంటనే చేపట్టాలని డిమాండ్
నవతెలంగాణ-బోనకల్
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం సీతానగరం వద్దనున్న రాపల్లి మైనర్ కాలువ కల్వర్టు మంగళవారం అర్ధరాత్రి కూలింది. దాంతో సాగర్ నీళ్లు పక్కనే ఉన్న ధాన్యం, మిర్చిపై పడ్డాయి. బుధవారం ఉదయం నీటిపారుదల శాఖ అధికారులకు రైతులు సమాచారం అందించారు. పంటలు మునిగి పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరా మండల పరిధిలోని రాపల్లి మైనర్ కాలువ.. బోనకల్ మండలంలోని సీతానగరం గ్రామం మీదుగా వెళ్తుంది. మరమ్మత్తులు చేయకపోవడంతో పది రోజుల క్రితం సీతానగరం వద్ద కాలువకు గండి పడింది. దాంతో సాగర్ నీరు పక్కనే ఉన్న పంట పొలాల్లోని చేరడంతో పంటలు దెబ్బతిన్నాయి. ఆ గ్రామ సర్పంచ్ కొమ్మగిరి బిక్షమయ్య, మాజీ ఉపసర్పంచ్ మేకల శరత్ బాబు.. విజ్ఞప్తి మేరకు స్పందించిన బోనకల్ సబ్ డివిజన్ డీఈ, ఏఈ.. రెండు రోజుల్లో గండిని పూడ్పించారు. కాగా, మంగళవారం ఆర్థరాత్రి కల్వర్టు కూలిపోయింది. దాంతో పక్కనే పంట పొలాల్లోని కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి, వరి ధాన్యం నీట మునిగాయి. మొక్క జొన్నలు తడిసిపోయాయి. కాగా, బుధవారం ఉదయం రైతులు తమ కల్లాల వద్దకు వెళ్లగా.. నీరు చేరి ఉండటంతో లబోదిబోమంటూ తడిసిన ధాన్యాన్ని, మిర్చిని ఎత్తి మరో చోటకు చేర్చారు. ఈ సందర్భంగా బాధిత రైతులు బొమ్మగాని నరసింహారావు, వేల్పుల మంగయ్య, వేల్పుల గటకయ్య, చంగల ముత్తయ్య, గంజినబోయిన రామయ్య మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని అన్నారు. కాలువకు మరమ్మతు చేసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు వెంటనే స్పందించి కాలువ కల్వర్టు మరమ్మతు పనులు పూర్తి చేయాలని, లేకపోతే కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తామని రైతులు హెచ్చరించారు.
కూలిన రాపల్లి మైనర్ కల్వర్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



